అసలు ఆంధ్రాను తమిళనాడు నుంచి విడదీయడమే తప్ప… విడదీసిన తీరూ తప్పే… అందుకే ఎప్పటికైనా తమిళనాడులో ఆంధ్రా కలిసి ఉండటమే కరెక్టు అని ఎవరైనా గతి-మతి తప్పిన ‘‘తమిళ ఉండవల్లి’’ సుప్రీంకోర్టులో కేసు వేస్తే..? కాదు, ఈ శతృత్వాలు దేనికి..? ఈ యుద్ధాలు దేనికి..? అసలు పాకిస్థాన్, ఇండియా విడిపోవడం తప్పు, విభజించిన తీరు తప్పు, ఎప్పటికైనా రెండు దేశాలు మళ్లీ కలవడమే కరెక్టు అని ఎవరైనా ‘‘పాకిస్థానీ ఉండవల్లి’’ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తే..?
ఎహె, ఊరుకో, ఏమిటీ పైత్యపు మాటలు అనిపిస్తోందా..? నిజం చెప్పండి… మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే మా విధానం అని ఏపీ సకలశాఖా మంత్రి సజ్జల చేసిన వ్యాఖ్యలు సరిగ్గా ఇలాగే లేవా..? ఇప్పటికిప్పుడు అవకాశం దొరికితే గడియారం వెనక్కి తిప్పి, రెండు రాష్ట్రాలను కలపాలనేది ఎంతటి సవ్యమైన, తెలివైన వాదనో, విధానమో… అలాంటప్పుడు ఆంధ్రా, తమిళనాడు కలిసిపోవడం కూడా కరెక్టే అవుతుంది కదా మరి..? ఎనిమిదేళ్లు గడిచిపోయినా, విడివిడి బాటల్లో ఎనిమిదేళ్లలో చాలా దూరం వచ్చేశాక… ఈరోజుకూ ఓ చిన్న రాజధాని నిర్మాణం దిక్కులేని, చేతకానితనం ఈ పిచ్చి వాదనల్లో చూపించాలా..?
ఉండవల్లి అనే ఓ పర్వర్షన్‌కు సమాధానం చెప్పలేని అసహాయతా ఇది..? ఎస్, సుప్రీంకోర్టులో విభజన తీరు సరిగ్గా జరగలేదు అనే కేసు ఉంది… సరిగ్గా జరగలేదు కాబట్టి, మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాలా..? లేక అసలు విభజనే కరెక్టు కాదా..? ఉండవల్లి మాటలే పెద్ద అబ్సర్డ్…! అసలు ఆ కేసే మూసేయాలి అని ఏపీ లాయరే కోర్టుకు చెప్పాడు… పార్లమెంటు చేసిన చట్టం, చేసిన విభజనను ఏమీ అనలేదు కాబట్టి కేంద్రం సైలెంటుగా ఉండిపోయింది… గతం గతః… మళ్లీ ఈ సమైక్యమంటల్ని రాజేస్తున్నది దేనికి..? అయ్యో, అయ్యో, అనవసరంగా ఉండవల్లి మా బట్టలన్నీ విప్పేస్తున్నాడు, మా సమైక్య పాతివ్రత్యం మంటగలిసిపోతోంది అనే దిక్కుమాలిన సమర్థనా..?
Ads
ఇప్పటికీ ఉండవల్లే సరిగ్గా చెప్పడం లేదు… రెండు రాష్ట్రాల్ని మళ్లీ కలిపేయాలా..? లేక విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలా..? విభజనకు సరైన పార్లమెంటరీ పద్దతులు పాటించలేదు కాబట్టి ఆ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచీ చేపట్టాలా..? ఏం కోరుతున్నాడు తను..? సజ్జల వైఖరి ఏమిటి..? అంటే వైసీపీ ధోరణి ఏమిటి..? నిజంగానే సమైక్యవాదమే చావులేని నినాదం, విధానం అయ్యేపక్షంలో మరి ఈ ఎనిమిదేళ్లు వైసీపీ చేసిందేమిటట ఆ దిశలో..?
అక్కడ విచారణ జరుగుతున్నదేమో విభజనకు సరైన పార్లమెంటరీ పద్ధతులు పాటించలేదు అని… సుప్రీం పార్లమెంటు వ్యవహరించిన తీరును తప్పుపట్టగలదా..? విభజన చట్టాన్ని కొట్టేయగలదా..? అలాంటప్పుడు దేశంలో సుప్రీం ఎవరు..? పార్లమెంటా..? సుప్రీంకోర్టా..? కేసు అలా సంక్లిష్టంగా, భిన్నంగా ఉండగా, జనాన్ని మభ్యపెట్టడానికి ‘‘ఏపీ తెలంగాణకు లక్ష కోట్ల ఆస్తులను అప్పనంగా వదిలేసింది… వాటికోసం పోరాడటం చేతకాదు జగన్‌కు…’’ అనే ఉండవల్లి వాదనలు దేనికి..? సజ్జలకైనా, ఉండవల్లికైనా కావల్సింది పునఃకలయికా..? ఆస్తుల విభజన సరిగ్గా జరగడమా..?
ఉండవల్లికి ఓ పార్టీ ఉందా..? ఎవరికైనా సమాధానం చెప్పుకునే అవసరం ఉందా..? ప్రజల పట్ల జవాబుదారీతనం ఉందా..? ఏదైనా మాట్లాడతాడు తను… కానీ అధికారంలో ఉన్న ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీకి ఓ స్థిరమైన, న్యాయసమ్మతమైన విధానం అంటూ అవసరం లేదా..? పోనీ, సమైక్యం కోసం పోరాడుతూనే ఉంటాం, సాధిస్తాం అని చెప్పదలిస్తే తక్షణం మూడు రాజధానులు అనే విధానానికి వీడ్కోలు చెప్పండి… సమైక్యం కోసం ఏదైనా రాజకీయ కార్యాచరణ ప్రకటించండి… ఈసారి సమాధానం తెలంగాణ సమాజం ఇస్తుంది… స్పష్టంగా…!!
Share this Article