ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో శృంగార నర్తకి (నటి అంటే సరిపోయేదేమో..) జయమాలిని తనకు నచ్చిన పాట సింహబలుడు సినిమాలో ఎన్టీయార్‌తో చేసిన ‘సన్నజాజులోయ్’ అని చెప్పింది… ఎందుకు నచ్చింది అంత బాగా అని ఇంటర్వ్యూయర్ అడిగినట్టు, ఆమె ఏదో చెప్పినట్టు గుర్తులేదు… కానీ నిజానికి ఆమె చేసిన వందల ఐటం సాంగ్స్‌లో దీనికి మరీ అంతగా గుర్తుంచుకునేంత సీన్ ఉందా అనేది ప్రశ్న…
ఉంది… కానీ ఆ పాటలో ఏవో సాహిత్య విలువలున్నాయని కాదు, అవేమీ లేవు కూడా… ఓ సాదాసీదా ఐటం సాంగ్… వేటూరి రాశాడు… ఆమె డాన్సింది… ఎన్టీయార్ కూడా డాన్సాల్సి వచ్చింది… ఏరా, త్వరగా రారా, ఆడతనం చల్లారిపోతోంది అని పిలుస్తుంది ఆమె… తప్పదు కదాని అతను శృతి కలిపి ఏదో పాడతాడు… పాటలో, డాన్సులో మెరుపులేమీ లేవు… కాకపోతే ఎంఎస్ విశ్వనాథన్ కట్టిన ట్యూన్ అదుర్స్… పాట హిట్టయింది అంటే అదే కారణం…
అదేనా..? కాదు, దాన్ని ఆలపించిన ఎల్ఆర్ఈశ్వరి మరో సగం కారణం… జయమాలిని, జ్యోతిలక్ష్మి, స్మిత వంటి శృంగార నర్తకులకే ఆమెతో పాడించేవాళ్లు ఎక్కువగా… ఎందుకో ఆమె మీద ఇండస్ట్రీ వివక్ష చూపించింది… కారణం తెలియదు… శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడమా..? పరాయి మతస్థురాలనా..? ఆమె గొంతు, శైలి ఆ పాటలకే సరిగ్గా సూట్ కావడమా..? ఏమో గానీ… ఆమె పాడిన పలు పాటలు చెవుల తుప్పు వదిలిస్తాయి… పదే పదే చెవుల్లో మోగుతూ ఉంటాయి…
Ads
ఇంతకీ ఆమెను ఎప్పుడైనా తలుచుకుంటున్నామా..? ఎంతసేపూ సుశీల, జానకి… అంతేనా..? జిక్కి, ఎల్ఆర్ఈశ్వరి, వాణీజయరాం… ఎందరు లేరు..? మొన్నటి ఎనిమిదో తారీఖున బర్త్ డే జరుపుకున్న ఈ ఎనభై మూడేళ్ల శ్రావ్యగాయని గురించి ఒక్క చిన్న వ్యాసమైనా కనిపించలేదు… ఎన్ని మరుపుకురాని పాటలు లేవు ఆమె కెరీర్లో… తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, హిందీ, ఇంగ్లిషు… 14 భాషల్లో కొన్ని వేల పాటలు… ఒక్కసారి ఆమె నేపథ్యం పరిశీలిస్తే…
మద్రాసులోని ఓ రోమన్ కేథలిక్ కుటుంబం ఆమెది… తండ్రి మద్రాసులోనే స్పెన్సర్స్ కంపెనీలో కొలువు చేసేవాడు… ఈమెకు ఐదేళ్ల వయస్సున్నప్పుడే మరణించాడు… ఈమె తల్లి నిర్మల మీద కుటుంబ పోషణ భారం పడింది… అప్పటికే గానంలో ప్రవేశం ఉండటంతో అవకాశం దొరికిన ప్రతిసారీ కోరస్ పాడటానికి వెళ్లేది ఆమె… ఆమెతో పాటు ఈశ్వరి కూడా వెళ్లేది…
నిజానికి ఈమె పేరు ఈశ్వరి కాదు… అసలు పేరు లూర్డ్ మేరీ… ఈమె బామ్మ హిందువు కావడంతో రాజేశ్వరి అని పిలిచేవాళ్లు… బంధుగణాన్ని సంతృప్తిపరచడం కోసం లూర్డ్ రాజేశ్వరిగా పేరు మార్చుకుంది మేరీ… ఇంకింత షార్ట్ ఫామ్‌లో ఎల్ఆర్ ఈశ్వరి అయిపోయింది… పాడటంలో శిక్షణ లేదు… అయితేనేం, ఆ గొంతు విని కేవీ మహదేవన్ తొలిసారిగా ఏదో తమిళ సినిమాలో సోలోగా పాడే చాన్స్ ఇచ్చాడు… కానీ ఆ సినిమా ఫ్లాప్… తరువాత మూడేళ్లకు ఇంకేదో సినిమా పాటతో పేరొచ్చింది…
కానీ అధికంగా క్లబ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ పాడించేవాళ్లు… అది ఒక ఒరవడిగా, ఆమెకు అవి మాత్రమే పాడే ప్రతిభ ఉన్నట్టుగా అందరూ అవే పాడించేవాళ్లు… నడుమ నడుమ ఆమె డబ్బింగ్ చెప్పేది… ఆమధ్య నయనతార సినిమాలో చాన్నాళ్ల తరువాత ఓ పాట పాడింది… నిజానికి చాలా ఏళ్లయిపోయింది ఆమె రిటైర్ అయిపోయి… ఎప్పుడూ వార్తల తెర మీదకు రాదు… ఆమె వ్యక్తిగత జీవితం కూడా విషాదమే… కుటుంబం కోసం త్యాగం… పెళ్లి కూడా చేసుకోలేదు… సొసైటీ నుంచి కూడా దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదు… 1984లో తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారం ఇవ్వడమే ఆమె జీవితంలో అతి పెద్ద ప్రశంస, గుర్తింపు, అభినందన…!!
Share this Article