రాజమౌళికి జ్ఞానోదయం అయ్యింది… కాకపోతే అది ఒరిజినల్, ప్యూర్ కాదు… ఉత్త ఫేక్… కాంతార సినిమా మన సినిమా నిర్మాతలు, దర్శకుల మైండ్ సెట్ మార్చాలట… సినిమా భారీ వసూళ్లకు, సక్సెస్‌కు పెద్ద స్టార్లు, పెద్ద బడ్జెట్లు అవసరం లేదట… ఒత్తిడి పెంచుతోందట… నిజానికి ఇండియన్ సినిమాల్లో అనేక అవలక్షణాల్ని ప్రవేశపెట్టిందే రాజమౌళి… ఇప్పుడు అరెరె అని నాలుక కర్చుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు…
సీన్లకుసీన్లు కాపీ కొట్టడం, చరిత్రను వక్రీకరించడం, హీరోల్ని మానవేతర శక్తులుగా చూపించడం వంటి క్రియేటివిటీ బాపతు దరిద్రాల గురించి కాదు… సినిమా వ్యాపారం గురించి చెప్పుకుందాం… రెండేళ్లు, మూడేళ్లు సినిమా తీస్తే ఇక నీ సామర్థ్యం ఏమున్నట్టు..? పైగా ఆ అరకొర ఫీడ్‌కు ఏ లండన్లోనో, ఏ అమెరికాలోనో గ్రాఫిక్స్… దానికి విపరీతమైన ఖర్చు చూపిస్తున్నారు… వందల కోట్లలో… అదంతా ఓ దందా…
మన తెలుగువాళ్లే హనుమాన్ అనే సినిమా తీస్తుంటే పదీపదిహేను కోట్లతో గ్రాఫిక్స్ చేయించారు… సూపర్బ్‌గా ఉన్నాయి… కాంతార, కేజీఎఫ్, బింబిసార… దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటున్నాయి వీఎఫ్ఎక్స్ మాయలు… మరి ఈ పెద్ద దర్శకులకు వందల కోట్ల ఖర్చు ఎలా అవుతోంది… వీళ్లేమైనా అవతార్ సినిమాలు తీస్తున్నారా..? అవతార్ అడాప్ట్ చేసుకున్న టెక్నాలజీలు, వాడుకున్న నిపుణుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, 16 వేల కోట్లు వసూలైతే గానీ బ్రేక్ ఈవెన్ రాదట… ఆ దర్శకుడే చెప్పాడు… ఆమధ్య జేమ్స్ కామెరూన్ ఏమైనా ఇండియాకు వచ్చి రాజమౌళిని కలిశాడా..?
Ads
పొన్నియిన్ సెల్వన్, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్… అన్నీ వందల కోట్ల గ్రాఫిక్సే… నిజానికి అన్ని సినిమాలవీ తప్పుడు వసూళ్ల లెక్కలే… బ్రహ్మాస్త్ర బాగోతాన్ని బాలీవుడ్ విమర్శలకు బయటపెట్టారు కదా… పొన్నియిన్ సెల్వన్ సినిమాను తమిళనాడు తప్ప మరే భాషలోనూ, మరే రాష్ట్రంలోనూ ప్రేక్షకుడు దేకలేదు… అసలు బాహుబలి ఫస్ట్ పార్ట్ కూడా మైనస్ ప్రాఫిట్స్ అని ఈమధ్యే దిల్ రాజు ఓ నిజాన్ని చెప్పాడు… ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కొన్నిచోట్ల నష్టాల్ని మిగిల్చింది బయ్యర్లకు…
రాజమౌళికి తెలిసింది వ్యాపారం… అందుకే పలు భాషల్లో డబ్ చేయడం, దేశం దాటించి జపాన్ దాకా తీసుకెళ్లి, వచ్చిన కాడికి మింట్ చేసుకోవడం… ఆ కళలో సిద్ధహస్తుడు… 15 కోట్ల బడ్జెట్‌తో 400 కోట్ల వసూళ్లు అనేది కాంతార గొప్పతనమే… కానీ ఆ మ్యాజిక్ ఎప్పుడూ జరగదు… దానికి పరిస్థితులు అనుకూలించాయి… అఫ్కోర్స్, మెరిట్ కూడా ఉంది… 15 కోట్లు రిస్క్ లెస్… మరి రాజమౌళి వంటి దర్శకులు వందల కోట్లను పెట్టినట్టుగా చెప్పి, ప్రేక్షకుల మీదకు ఆ భారమంతా రుద్దుతారు దేనికి..? పైగా ఫ్యామిలీ ప్యాకేజీలు..! ఈ ఖర్చులు సరిపోనట్టు, సొంత ఖర్చులతో ఆస్కార్ అవార్డుల పైరవీలు… అదొక ప్రచారం కోసం, ఇంటర్నేషనల్ ఇమేజ్ కోసం…
అసలు స్టార్ హీరో అంటే ఎవరు..? జూనియర్, రాంచరణ్, ప్రభాస్, రానా… వీళ్లేనా..? కార్తికేయ-2 హీరో మామూలు హీరోయే కదా, దుమ్మురేపింది సినిమా… ఆచార్యలో ఇద్దరు స్టార్ హీరోలు, కానీ అట్టర్ ఫ్లాప్… సో, స్టారిజం అంటే ఏమిటి రాజమౌళి భాయ్..? ఇమేజ్, ఫార్ములా, రొటీన్ కంటెంటుతో సినిమా తీసేసి, ఏరియావారీ హక్కుల్ని హీరోలకు ఇచ్చేసి, లేదంటే వందల కోెట్ల ఫాయిదా చూపించేసి… సినిమాలోనూ మానవాతీత శక్తులుగా చూపించేసి… హీరో అనే పదార్థాన్ని అలా ఆకాశంలో నిలిపింది ఎవరు..?
మలయాళంలో కూడా మరక్కార్ పేరిట భారీ సినిమా నిర్మించారు… మరీ ఘోరంగా ఏమీ లేదు సినిమా… కానీ ఫ్లాప్… అసలు ఈ గ్రాఫిక్స్ పేరిట వందల కోట్ల ఖర్చు, హీరోల రెమ్యునరేషన్ మీద భారీ ఖర్చు అంశాలపై సెన్సార్ బోర్డులాగే ఓ ఐటీ బోర్డు ఏర్పాటు చేయడం బెటర్… అశ్లీలం, హింస పారుతున్న వెబ్ సీరీస్ వచ్చాక సెన్సార్ బోర్డు పేరు వింటేనే నవ్వొస్తోంది… థియేటర్ సినిమాకే సెన్సార్, ఓటీటీ విశృంఖలం…
సరే, ఎందుకు చెప్పినా, ఎలా చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే… హీరోల్ని నేలకు దింపాలి… అదీ ముందుగా జరగాల్సింది… అడ్డమైన గ్రాఫిక్స్ పేరిట వందల కోట్ల దందాకు తెరపడాలి… కంటెంటులో నాణ్యత, క్రియేటివిటీకి పట్టం కట్టాలి… కాంతార, కార్తికేయ-2, దృశ్యం-2… ఇలాంటివి ఇప్పుడు కావల్సింది… తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో, సరైన కంటెంటుతో క్రియేటివ్‌గా, రిస్క్ లెస్ సినిమా తీసేవాడే తోపు… రాజమౌళి దీనికి పూర్తిగా ఆపోజిట్టు… ఈ రీసెంటు భారీ ఖర్చుల బాగోతాలన్నింటిలోనూ రాజమౌళి పాత్ర ఉంది… బ్రహ్మాస్త్ర సినిమాకు సౌత్ ఇండియాలో తనే ప్రజెంటర్… ఇప్పుడిలా మాట్లాడుతున్నాడు కదా… తన రాబోయే ప్రాజెక్టులు చూడండి… ఇంకెంత భారీగా ఉండబోతున్నాయో…!!
Share this Article