చైనా దుర్మార్గాలు తప్ప ప్రపంచంలో ఏం జరిగినా, మస్తు నీతులు చెప్పే సీపీఎం పార్టీ, దాని అనుబంధ మీడియా పూర్తిగా పాతాళానికి చేరుకున్నట్టుంది… చివరకు బ్యానర్ స్టోరీ హెడింగులో అక్షరదోషాల్ని కూడా ఎవరైనా చేతులు పట్టి దిద్దించాలా..? కంటెంటు గురించి తరువాత చెబుతాను… తెలంగాణలో ప్రజాశక్తిని చీల్చి నవతెలంగాణ అని ఓ పత్రిక పెట్టారు కదా…
ఈరోజు ఓ హెడింగ్… ‘సవాళ్లేన్నో…’… నిజమే, టైపో అయితే విమర్శించకూడదు… కానీ ఒక పత్రిక తన ఫస్ట్ పేజీ బ్యానర్‌ను ప్రింటింగ్‌కు ముందే చదివి, తప్పుంటే దిద్దుకునే దిక్కులేదా..? సవాళ్లు ఎన్నో, సవాళ్లెన్నో… మనకు తెలిసిన హెడింగ్స్ ఇవే… ఈ సవాళ్లేన్నో ఏమిటో, ళ్లేకు దీర్ఘం దేనికో పత్రిక ఎడిటర్ మహాశయుడికే తెలియాలి… అమెరికా దుర్మార్గాలు, నాటో పైత్యాలు గట్రా తరువాత రాయొచ్చు, ముందు రాయడం నేర్చుకోవాలి కదా…
ఇక కంటెంటు సంగతికొద్దాం… సిద్ధాంతపరంగా సీపీఎం ప్రపంచబ్యాంకుకు వ్యతిరేకం… దాన్ని నమ్మదు… దాని రిపోర్టులను, దాని సాయాల్ని, దాని అడుగుల్ని ఏమాత్రం విశ్వసించదు… ప్రపంచబ్యాంకు ఏం చేసినా అందులో మనల్ని ముంచే మర్మమేదో ఉందని సందేహిస్తుంది… ఆ లైన్ తీసుకోవడంతో తప్పులేదు… అదెలాగూ పరమ కుటిలమైన సంస్థ… కానీ మీరు రాసిన వార్తకు దాని రిపోర్టే ఎందుకు ప్రామాణికంగా ఉంది..? పైగా అది ఏమాత్రం నమ్మదగని డ్రై, పెరిఫెరల్ రిపోర్టు… అది బ్యానర్ స్టోరీ ఎలా అయ్యింది..?
Ads
ఈ నివేదికకు బేస్ ఏమిటి అంటే… 2019లో… అంటే కరోనాకు ముందు చేసిన ఒక సర్వే… అదీ ముంబైలోని 6 వేల మంది ప్రయాణికులతో చేసిన సర్వే… సో, ముంబైలోని సిటీ బస్సు, లోకల్ ట్రెయిన్ ప్రయాణికుల అనుభవాలు, అవసరాలు మొత్తం దేశానికే వర్తించేలా ఓ దిక్కుమాలిన రిపోర్టు ప్రిపేరైంది… అది ఓ వామపక్ష పత్రికకు బ్యానర్ స్టోరీ అయ్యింది… ఇది కదా ఐరనీ అంటే…
ప్రజారవాణాను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది, నిజం… నిజానికి సిటీల్లో ప్రైవేటు వాహనాలను డిస్కరేజ్ చేయాలి… అయితే దానికి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రిపోర్టులో చెప్పినట్టు సైక్లింగ్ ట్రాకులు, కాలినడక సౌకర్యాలు పరిష్కారాలు ఎలా అవుతాయి..? మెట్రోలు కావాలి, సిటీ బస్సులు, ఎంఎంటీఎస్‌లు, ఇతర ప్రజారవాణా మార్గాలు విస్తృతంగా అందుబాటులోకి రావాలి… అది మహిళలకే కాదు, మొత్తం ప్రజారవాణాకే మేలు… కాలుష్య నియంత్రణకు, నరకజీవనం నుంచి కాస్త రిలీఫ్‌కు ఉపయోగకరం…
పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, ఇంధన వ్యయం వంటి చాలా లోతైన అంశాలున్న సబ్జెక్టు… వాడెవడో నువ్వే నమ్మని బ్యాంకు, వాడు ఓ నెత్తిమాశిన రిపోర్టు ఇస్తే, అదీ సిటీ ప్రజారవాణాకు సంబంధించి… అదే నీకు బ్యానర్ స్టోరీయా..? ఇంతకన్నా శరవేగంగా బీఆర్ఎస్ భవన్ వంటి కృతజ్ఞతా వార్తలు రాసుకోవచ్చు కదా… ఈ బ్యానర్ పక్కనే ఉంది అది కూడా…!!
Share this Article