ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో వెళ్లిపోయింది మైత్రి మూవీస్… సినిమా నిర్మాణం అంటేనే అనేక తప్పుడు లెక్కల దందా… జీరో అమౌంట్లు, ఆన్ రికార్డ్ పేమెంట్స్‌తో పాటు నానా బాగోతాలు… ఐటీ, జీఎస్టీ అధికారులే కాదు, చాలామంది ఉన్నతాధికారులకు ఏవేవో ఎరలు వేయాలి, పనులు సాధించుకోవాలి… అలాంటిది వీళ్లపై జీఎస్టీ, ఐటీ కలిసి దాడులు చేయడం ఏమిటి..? దీని వెనుక మర్మమేమైనా ఉందా..? అసలే ఇప్పుడు జరిగే దాడులన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ కదా…
ఈ సందేహాలు రావడం సహజం… ఈ నిర్మాణ సంస్థ ద్వారా ప్రస్తుతం పైప్‌లైన్‌లో ఉన్న సినిమాల విలువ 1000 నుంచి 1500 కోట్లు అని ఓ అంచనా… తీసిన సినిమాల సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తోపాటు దేవరకొండ విజయ్ ఖుషీ, కల్యాణరాం సినిమా, బన్నీ పుష్ప-2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ సినిమా, రాంచరణ్ సినిమా ఒకటి… ఇది గాక ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది…
ఈ సంస్థ అడిగితే ఎంతటి టాప్ స్టార్ అయినా సరే, ఎంత టైట్‌గా ఉన్నా సరే, అడిగినన్ని కాల్ షీట్లు ఇస్తారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ వెన్నెముక ఇప్పుడు… ఈ సంస్థపై ఉన్న ప్రధానమైన ఆరోపణ హీరోలకు ఇస్తున్న రెమ్యునరేషన్‌ను సరిగ్గా లెక్కల్లో చూపించకపోవడం… నిర్మాణవ్యయం లెక్కలు నమ్మబుల్‌గా లేకపోవడం… అంటే జీఎస్టీ ఎగవేత ఉంటుంది… అంటే ఆటోమేటిక్‌గా ఆదాయపు పన్ను ఎగవేత ఉంటుంది… అందుకే రెండు శాఖలూ కలిసి దాడులు, కాదు, సోదాలకు దిగాయి…
Ads
కేంద్ర సంస్థల దాడులు అనగానే పొలిటికల్ కోణం చూడటం సహజమైపోయింది ఈమధ్య… పైగా ఈ నిర్మాణ సంస్థ తీసే సినిమాలన్నీ టాప్ స్టార్లతో… అందరికీ పొలిటికల్ ఎజెండాలున్నయ్… అందుకని ఈ డౌట్లను తోసిరాజనలేం… కానీ ఒక కోణంలో పరిశీలిస్తే… వాల్తేరు వీరయ్య చిరంజీవి బీజేపీకి ప్రత్యర్థి కాదు, స్నేహితుడూ కాదు… పైగా పవన్ కల్యాణ్‌ను ఉన్నత స్థానంలో చూడాలని కోరుకునే సోదరుడు కాబట్టి బీజేపీకి కూడా ప్రస్తుతానికి అస్మదీయుడే… మరి చిరంజీవి సినిమాకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తారు..? ఎందుకు సతాయిస్తారు..?
అలాగే ఉస్తాద్ భగత్‌సింగ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి బీజేపీ రూట్ మ్యాప్‌లో సహబాటసారి… తెలుగుదేశం వైపు వెళ్తే… బిడ్డా, మర్యాద దక్కదు అని హెచ్చరించడానికి ఈ దాడులు అనుకుందాం… ఫర్ డిబేట్ సేక్… కానీ తను ఒక్కడు కాదు కదా ఇక్కడ సఫరయ్యేది… పైగా ఆ నిర్మాణ సంస్థకు పొలిటికల్ ఎజెండాలు, లైన్లు ఏమీ లేవు… బాలయ్య ఎలాగూ తెలుగుదేశం పార్టీ… కానీ బీజేపీ ఎప్పుడూ తనను సీరియస్ అపోనెంటుగా పరిగణించదు…
జూనియర్ ఎలాగూ బీజేపీకి ఇష్టుడే… పుష్ప-2 బన్నీ కూడా ఆ మెగా శిబిరమే… సో, ఒకటీ అరాతప్ప ఇప్పుడు మైత్రీ వాళ్లు తీస్తున్న సినిమాల హీరోలు ఎవరూ బీజేపీకి టార్గెట్లు కారు… బీజేపీకి వచ్చేది కూడా ఏమీలేదు… బాలయ్య ఎలాగూ తెలుగుదేశం వదిలిరాలేడు కదా… వస్తానన్నా చంద్రబాబునే దగ్గరకు రానివ్వడం లేదు… సో, ఏ కోణంలో చూసినా ఈ దాడుల వెనుక ప్రొఫెషనల్ రీజన్స్ తప్ప పొలిటికల్ రీజన్స్ ఉన్నట్టు ఏమీ అనిపించడం లేదు… తెలుగు సినిమా బడా స్టార్ల రెమ్యునరేషన్ బాగోతాలు నిజంగా బయటపడితే బాగుండు… కానీ ఐటీ, జీఎస్టీ దాడులు ఏవీ లాజికల్ ఎండ్ వైపు, జరిమానాల వైపు, శిక్షల వైపు వెళ్లవు కదా… ఆడిటర్లు అన్నీ సెట్ చేస్తారు…!!
Share this Article