అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణ పేరుతో ఓ వీడియో బాగా వైరల్ అయిపోయింది… అది అదేనోకాదో గానీ… గల్వాన్ లోయలో ఘర్షణ, ప్రాణనష్టాల తరువాత మళ్లీ కలకలాన్ని సృష్టిస్తున్నది ఈ సంఘటన… అసలు చైనా దురాక్రమణ పద్ధతులు ఎలా ఉంటాయి..? ఏమిటి దాని వ్యూహం..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి వ్యాసం ఎప్పటిలాగే… సవివరంగా…
భారత్ చైనాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది ! గత రెండేళ్ల నుండి అనుకుంటున్నదే మూడు రోజుల క్రితం జరిగింది ! డిసెంబర్ 9, 2022 శుక్రవారం రోజున అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ దగ్గర భారత్ చైనా సరిహద్దుల దగ్గర భారత్ సైనిక పోస్ట్ ని చేజిక్కించుకోవడానికి చైనా సైనికులు ప్రయత్నించగా దానిని భారత్ సైనికులు తిప్పికొట్టారు! గతంలోనే చెప్పుకున్నట్లు చైనా రెండు రకాల వ్యూహాలతో ఉంటుంది ఎప్పుడూ. మొదటిది సలామీ స్లైస్ పద్ధతి. రెండవది వుల్ఫ్ వారియర్ పద్దతి లేదా డిప్లొమసి !
సలామీ స్లైస్ [Salami Slice ]: ఈ పద్ధతిలో తన సరిహద్దుల నుండి నెలకి వంద అడుగుల చొప్పున కొద్ది కొద్దిగా ముందుకు వస్తుంది. అంటే రోజుకి ఒక అడుగు చొప్పున వీలుంటే లేదా ఎవరూ లేకపోతే పది అడుగులు ముందుకు వస్తుంది. అలా వచ్చే క్రమంలో వాళ్ళ భూభాగం వైపు ఉన్న కంచెను జరుపుకుంటూ ముందుకు వస్తుంది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దూరంలో మన వైపు కానీ చైనా వైపు కానీ ఎవరూ ఉండని ‘నో మాన్ లాండ్ ‘ [No Man Land ] ఉంటుంది. ఇది ఒప్పందం లో భాగంగా తప్పనిసరిగా చేశారు.
Ads
ఈ నో మాన్ లాండ్ సాధారణంగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే ఈ కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతంలో ఎవరూ ఉండకూడదు. కానీ సలామీ స్లైస్ లో భాగంగా కొద్ది కొద్దిగా నో మాన్ లాండ్ ని ఆక్రమించుకుంటూ ముందుకు వస్తుంది. బైనాక్యులర్ తో చూసినప్పుడు ఈ దూరం లోని వంద అడుగుల వ్యత్యాసం కనపడదు. మన వైపు నుండి మన సైనికులు బైనాక్యులర్స్ తో చూస్తూ ఉంటారు కానీ రాత్రి పూట దొంగచాటుగా ఒక్కో అడుగు కంచెను ముందుకు తోసుకుంటూ వస్తారు చైనా సైనికులు. మన సైనికులు కనిపెట్టి అభ్యంతరం చెప్తే మీరే నో మాన్ లాండ్ లోకి వచ్చారు అని బుకాయిస్తారు చైనా సైనికులు. ఇలా వంద అడుగులు ముందుకు వచ్చాక చిన్నపాటి ఘర్షణ తప్పక జరుగుతుంది రెండు వైపులా. దాంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది కానీ ముందుకు వచ్చిన వంద అడుగుల స్థలాన్ని వదిలి వెనక్కి వెళ్ళదు చైనా.
**************************************
Wolf Warrior Stratagy or Diplomacy [వుల్ఫ్ వారియర్ డిప్లొమసి లేదా స్ట్రాటజీ ] పేరులోనే ఉంది తోడేలు వ్యూహం ! జస్ట్ అడవిలో తోడేళ్ళు తమ వేటని చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ దాడి చెయ్యవు. దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ ఉంటాయి. తాము వేటాడే జంతువు ఎంత బలంగా ఉన్నా ఏదో ఒక దశలో అలిసిపోక తప్పదు. అలా అలిసిపోగానే ఒక్క సారిగా అన్ని తోడేళ్ళు కలిసి దాడిచేసి వేటని చంపేస్తాయి. ఇలాంటి ఘర్షణ ఒక్కో సారి రోజంతా జరుగుతూనే ఉంటుంది కానీ తోడేళ్ళు పట్టు వదలకుండా అలాగే ఉంటాయి.
చైనా సైనికుల వ్యూహం కూడా తోడేళ్ల లాగానే ఉంటుంది. మన సైనికులతో ఘర్షణ పడడం, తరువాత పోరాడడం [confrontational and combative]. అయితే ఈ వుల్ఫ్ వారియర్ డిప్లమోసి ని 1960 లో మొదటిసారిగా మొదలు పెట్టి 1962 వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ వరకు, మరో వైపు అక్సాయ్ చిన్ వరకు చొచ్చుకువచ్చి యుద్ధం తరువాత ఆక్రమించుకొని అక్కడే ఉండిపోయాయి చైనా సైన్యం. 1962 తరువాత కూడా అంటే 2014 వరకు సలామీ స్లైస్,వుల్ఫ్ వారియర్ డిప్లొమసి ని కొనసాగిస్తూనే వచ్చింది చైనా.
నిజానికి కార్గిల్ యుద్ధం తరువాత అంటే 2004 నుండి2014 వరకు చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తూనే వచ్చింది కానీ పత్రికలు కానీ ఎలెక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలని బయటికి చెప్పలేదు. 2020 లో గాల్వాన్ లోయలో కూడా కొద్ది కొద్దిగా ముందుకు రావడానికి ప్రయత్నించి విఫలం అవ్వడం ఆ ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే ! 2020 లో గాల్వాన్ లోయ ఘర్షణ తరువాత నా పోస్ట్ లో వివరంగా చెప్పాను తరువాతి ఘర్షణ పాయింట్ అరుణాచల్ ప్రదేశ్ అని. ఆఫ్ కోర్స్ నేను చెప్పింది మన సైనిక వ్యూహకర్తలు చెప్పిందే అప్పట్లో.
డిసెంబర్ 9 న జరిగింది సలామీ స్లైస్ ! కానీ విఫలం అయ్యింది !
తవాంగ్ సెక్టార్ దగ్గర జాట్ రెజిమెంట్ సైనికులు కాపలా కాస్తున్నారు అత్యాధునిక ఆయుధాలతో. జాట్ రెజిమెంట్ ని తవాంగ్ సెక్టార్ దగ్గర వ్యూహాత్మకంగానే ఉంచారు. జాట్ రెజిమెంట్ సైనికులు 6 అడుగుల ఎత్తుతో ధృఢంగా ఉంటారు. ఒక్కో సైనికుడు ఇద్దరు చైనా సైనికులకి సమాధానం చెప్పగలడు. ఒప్పందం ప్రకారం భారత్ చైనా సైనికుల దగ్గర ఆయుధాలు లేవు కానీ చేత్తోనే సమాధానం చెప్పగల సామర్ధ్యం జాట్ రెజిమెంట్ సైనికుల కి ఉంది.
చైనా వైపు నుండి దాదాపుగా 200 నుండి 300 మంది దాకా ఉన్నారు కాగా మన వైపు మొదట్లో కాపలాగా ఉన్న వాళ్ళు 40 లోపే ఉన్నారు కానీ 200 మందికి సమాధానం చెప్పగలరు. చైనా సైనికులు కంచెని తీసుకొని ముందుకు రావడానికి ప్రయత్నించడం తో మొదట ఘర్షణ మొదలయ్యింది. ఘర్షణ మొదలవగానే మరో 50 మంది మన సైనికులు వచ్చి కలవడం తో ఒక దశలో ఘర్షణ తీవ్ర రూపం దాల్చి కర్రలతో, రాళ్ళ తో పరస్పరం దాడులు చేసుకున్నారు కానీ తరువాత చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.
అయితే 2020 కోవిడ్ లాక్ డౌన్ నాటికే చైనా తన వైపున 5G నెట్ వర్క్ ని అప్పటికే అక్కడ విస్తరించింది. 5g నెట్వర్క్ వలన చాలా వేగంగా వీడియొ దృశ్యాలు దూరంగా ఉన్న కమాండ్ సెంటర్ కి అప్పటికప్పుడు మొబైల్ లేదా ప్రత్యేకంగా తయారు చేసిన కెమెరాల ద్వారా పంపవచ్చు. అప్పట్లోనే మూడో ఫిక్షన్ పాయింట్ తవాంగ్ సెక్టార్ అని తెలిసిపోయింది.
ఆరు నెలల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ తో పాటు లడాక్ దగ్గర 5G నెట్వర్క్ ని ఏర్పాటు చేసింది మన సైన్యం. రిలయన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలో ఉద్దేశ్యం ఎలాంటి అవినీతి మరియు అవక తవకలు జరగవు అనే భరోసా ఉండడమే ! నిజానికి రిలయన్స్ కి ఆ ప్రాంతాలలో 5G నెట్వర్క్ ని పెట్టడం వలన వాణిజ్య పరంగా ఎలాంటి లాభాలు ఉండవు, ఏదో ఖర్చులకి సరి పోయేట్లుగా చెల్లింపులు ఉంటాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవగానే ఈ సంఘటన జరగడం ప్రతి పక్షాలు ఏదో ఘొరం జరిగినట్లు హడావిడి చేయడం వెనుక ఎవరి ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకి వేరే చెప్పక్కరలేదు!
మరో వైపు జీరో కోవిడ్ నిబంధనలు సడలించింది చైనా ప్రభుత్వం దాంతో బీజింగ్ తో సహా పెద్ద పెద్ద నగరాలలో వేల కొద్దీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. తమ దేశంలో కోవిడ్ సమస్యని పక్క దారి పట్టించడం కోసం చేసిన హడావిడి ఇది. ప్రతి నెలా ఎక్కడో అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ అవేవీ వార్తలలోకి రావు. 2023 చివరనాటికి జెనరల్ ఎలక్షన్శ్ ఉండబోతున్నాయి కాబట్టి ఇక నుండి తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి హడావిడి చేస్తూనే ఉంటారు.
ఇటీవలే జర్మనీ మంత్రి ఒకరు చైనా లేకపోతే జర్మనీ లేదు అన్న మాట చైనాకి బలాన్ని ఇచ్చింది జస్ట్ సపోర్ట్ గా అన్నమాట. చైనా సప్లై చైన్ మీద ఆధారపడి జర్మనీ ఆటోమొబైల్ పరిశ్రమ మనుగడ సాగిస్తున్నది. పైగా ఇంధనం కొరత వలన తమ దేశంలో తయారుచేసుకోగల విడి భాగాల్ని కూడా చైనాకి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నది జర్మనీ. కాబట్టి చైనా కి మద్దతు తప్పక ఇవ్వని పరిస్థితి ! అమెరికా మద్దతు లేకపోయినా కనీసం యూరోపు లోని అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన జర్మనీ మద్దతు దొరకడం, మరో వైపు గల్ఫ్ దేశాలు చైనా వైపు మొగ్గు చూపడం మనకి శాపం లా మారింది తప్పితే చైనా మన మీదకి దాడి చేసే సాహసం చేయదు…
Share this Article