తిరుమలలో వీవీఐపీ వస్తే వాడే దేవుడు… అసలు శ్రీవారిని కాసేపు వదిలేస్తారు… వీవీఐసీ ఆర్జిత సేవల్లో తరిస్తారు పూజారులు, దళారులు… జయలలిత సహా తమిళనాడులో నాయకులు దేవుళ్లు… వాళ్లు దూరం నుంచి అలా వెళ్తుంటే ఇక్కడ సాష్టాంగపడి దండాలు పెడతారు… ఫ్యాన్స్‌కు హీరోలు దేవుళ్లు… వాళ్లకోసం బతుకుల్నే నాశనం చేసుకుంటారు… ఇలా దేవుళ్లంటే విగ్రహాలే కాదు, మనుషులే దేవుళ్లు… స్వార్థమే ఆధ్యాత్మికత… అంతటా ఇదే కథ…
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… తమిళనాడులో తాజాగా ఓ వివాదం… ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య పేరు దుర్గ… ఆమె చెన్నై సమీపంలోని తరువొత్తియూర్‌లో ఉన్న త్యాగరాజస్వామి గుడికి వెళ్లింది… దర్శనం అయిపోయింది… ముఖ్యమంత్రి భార్య కదా, పెద్దలందరూ దగ్గరుండి అధికారిక మర్యాదలు, అనగా ప్రొటోకాల్ పాటిస్తూ దర్శనం చేయించారు… అక్కడి విశేష పూజలన్నీ చేయించేశారు… తీర్థం, ప్రసాదం, ఆశీస్సులు గట్రా అన్నీ అందాయి…
తరువాత ఆమె బయటికి వచ్చి, తన కాన్వాయ్ వరకు నడుస్తోంది… ఈలోపు హఠాత్తుగా వర్షపు చినుకులు ప్రారంభమయ్యాయి… అప్పటికే అక్కడ స్వామి వారి ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా ప్రారంభమైంది… ఈ వర్షపు చినుకుల్ని చూడగానే ఓ పూజారి లేదా గుడి ముఖ్యుల్లో ఒకడు దేవుళ్లకు పట్టే పవిత్రమైన గొడుగును కాస్తా ఈ దుర్గ అమ్మవారికి పట్టాడు… ఆఫ్టరాల్ దేవుళ్లు తడిస్తే ఎంత…? ఆమె తడిస్తే ఎంత ప్రమాదం..? మరి దేవుళ్ల మాటేమిటి..? ఫాఫం, అక్కడే ఉన్న ఎవరో ఓ భక్తుడు తన చేతిలో ఉన్న మామూలు గొడుగును దేవుళ్లకు పట్టాడు… అమ్మవారు కారు ఎక్కారు… ఇదీ జరిగింది…
Ads
ఈ ట్వీట్ పెట్టిన బీజేపీ రచ్చ రచ్చ చేస్తోంది… Shocking VVIP power trip in Tamil Nadu… CM Stalin’s wife uses deity’s umbrella… ఏదో ఒకటి… దొరికింది కదా విమర్శించడానికి అన్నట్టుంది బీజేపీ యవ్వారం… బీజేపీ వాళ్లు, డీఎంకే వాళ్లు ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు… ఇక్కడ మరో కోణంలోకి వెళ్దాం… నిజంగా ఇక్కడ దుర్గ తప్పేమైనా ఉందా..? అనవసరంగా ఆమెను ఆడిపోసుకోవడం తప్పు కదా… 1) స్టాలిన్ తన భార్యకు ప్రొటోకాల్ మర్యాదలు పాటించాలని ఏమీ చెప్పడు… ఇదంతా అక్కడి ఉన్నతాధికారులు, గుడి దళారుల ఓవరాక్షన్…
2) నిజంగానే ఆమె చల్లటి కళ్లల్లో పడినా సరే, ఆమె ఎవరి గురించీ స్టాలిన్‌కు రికమెండ్ చేయదు… అస్సలు ఆమె భర్త రాజకీయ కార్యాచరణలో వేలుపెట్టదు… ఆమెకు అసలు రాజకీయాలే పడవు… 3) దేశంలో పలువురు ముఖ్యమంత్రుల భార్యలు తమ ఇళ్లల్లోనే క్యాష్ కౌంటర్లు ఓపెన్ చేసి, వసూళ్ల దందాలన్నీ వాళ్లే చూసుకుంటుంటారు… ఈమెకు అవేమీ తెలియవు… 4) స్టాలిన్ నాస్తికుడు, డీఎంకే మూల సిద్ధాంతాల్లో నాస్తికత్వం కూడా ఒకటి… కానీ స్టాలిన్ భార్య ఆస్తికురాలు… ఆమె దర్శించినన్ని గుళ్లు బహుశా ఎవరూ వెళ్లి ఉండరు… 5) ఎక్కడా మీడియా దృష్టికి రాదు, కెమెరాలకు చాలా దూరంలో ఉంటుంది… 6) భార్య ఆస్తికత్వాన్ని స్టాలిన్ వ్యతిరేకించడు, అది ఆమె వ్యక్తిగత విశ్వాసం అంటాడు… భర్త నాస్తికత్వం ఆమెకూ పట్టదు…
ఇక్కడ ఆమెకు గొడుగు పట్టిన వెధవ ఎవడో వాడిని శిక్షించాలి… కానీ తమిళనాడులో అంత సీన్ ఉంటుందా..?
నిజానికి ఆమె తనకు ఎవరైనా గొడుగు పట్టారా..? ఏ గొడుగు పట్టారు..? అని చూసేట్టుగా లేదు… ఆ చినుకుల నడుమ వేగంగా కారును చేరుకోవాలని వెళ్తోంది… నిజంగానే దేవుడి గొడుగును తనకు పట్టినట్టు తెలిస్తే వారించేది, లెంపలేసుకుని అక్కడే దేవుడిని క్షమించమని వేడుకునేది… అది ఆమె తత్వం… దేవుడి విషయంలో ఆమె సిన్సియర్… అది తమిళనాట అందరికీ తెలుసు…
అసందర్భం ఏమీ కాదు… ఏప్రిల్ నాటి ఓ వార్త మళ్లీ చదువుకుందాం… తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ భార్య దుర్గ ఏ సెక్యూరిటీ, ప్రోటోకాల్, అధికార అట్టహాసాలు, పటాటోపాలు, అధికారుల భజన గీతాలు ఏమీ లేకుండా…. ఓ సామాన్య భక్తురాలిగా తిరుమలలో దేవుడిని దర్శించుకుని వెళ్లిపోయింది… అసలు తిరుమలలో ఓ వీవీఐపీ ఓ సామాన్య భక్తురాలిగా దర్శనానికి వెళ్లిరావడం ఎంతటి అబ్బురం…
దేవుడు కూడా సంతోషపడి ఉంటాడు… రోజూ వీవీఐపీలు, వాళ్ల సేవలకు అధికారుల వెధవ్వేషాలు చూసీ చూసీ విసిగిపోయి, విరక్తిగా ఉంటాడు కదా… దేవుడి దగ్గర సింప్లిసిటీ అంటే… వందల మంది అనుచరులను తీసుకెళ్లి, క్యూలను ఆపివేయించి, బోలెడంత పాపం మూటగట్టుకుంటున్న ఏపీ అధికార పార్టీ నేతలకు తెలుసా…?
దుర్గ మాత్రమే కాదు… కరుణానిధి భార్య దయాళు అమ్మాల్ కూడా భక్తురాలే… (స్టాలిన్ తల్లి)… స్టాలిన్ సోదరి సెల్వికి కూడా ఆధ్యాత్మికత మీద గురి ఉంది… కణిమొళి కేసు సమయంలో కరుణానిధి కుటుంబసభ్యుల్లో చాలామంది గుళ్లు సందర్శించారు… పలు తమిళ పత్రికల్లో ఆ గుళ్ల జాబితా కూడా పబ్లిష్ చేశారు… సరే, ఎవరి నమ్మకాలు వాళ్లవి… సో, దేవుడి గొడుగు రచ్చలో దుర్గను టార్గెట్ చేయడం బీజేపీ తప్పు… ఆమె సాత్వికురాలు… చాలా చాలా మంది నేతల భార్యలతో పోలిస్తే చాలా చాలా బెటర్… (తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విజ్ఞుడు… ఈ వివాదానికి దూరంగా ఉన్నాడు)
అవసరాల కోసం ఆస్తికత్వం ముసుగులు ధరించేవాళ్లను తాజాగా ఎంతమందిని చూడటం లేదు… రాహుల్ గాంధీ జంధ్యం వేస్తాడు, నేను కశ్మీరీ బ్రాహ్మడిని, శివభక్తుడిని అంటూ వీరంగం వేస్తాడు… ఆమీర్ ఖాన్ కలశపూజ చేస్తాడు… షారూక్ ఖాన్ వైష్ణోదేవి యాత్ర చేస్తాడు… కొందరు వృద్దాప్యపు గందరగోళంలోకి జారిపోయి దేవుడిని ఆశ్రయిస్తారు… నారాయణ తిరుమల దర్శనం కావచ్చు, గద్దర్ గుడి సందర్శనలు కావచ్చు… కానీ ఈ దుర్గ అలాంటిది కాదు… ఆమె ఆస్తికత్వానికి స్వార్థం, అవసరాలు కారణాలు కావు…
Share this Article