సంవత్సరం ముగింపుకొచ్చింది… అన్నింటికీ అతీతమైన అవతార్ సినిమాను వదిలేసి, ఇండియన్ సినిమాల్లో ఏవి ఈ సంవత్సరం టాప్-10 అంటూ ఐఎండీబీ ఓ లిస్టు రిలీజు చేసింది… సక్సెస్, వసూళ్ల ఆధారంగా ఆ జాబితాను ప్రిపేర్ చేసినట్టుగా ఉంది… వీటిలో ఒకేఒక హిందీ సినిమా… అదీ ‘ది కశ్మీరీ ఫైల్స్’… ఇక మిగతావన్నీ సౌత్ సినిమాలే…
కంటెంటు, ప్రజంటేషన్, ఖర్చు, మార్కెటింగ్, ప్రమోషన్… ఏ కోణం తీసుకున్నా సౌత్ సినిమా బాలీవుడ్‌ను స్పష్టంగా డామినేట్ చేస్తోంది… మొన్న రిలీజైన దృశ్యం-2 మాత్రమే హిందీ సినిమాలకు కంటితుడుపు… అఫ్‌కోర్స్, అదీ సౌత్ సినిమాకు రీమేక్… డర్టీ అండ్ అగ్లీ సాంగ్స్‌తో దీపికను దాదాపు బరిబాతల చూపించిన పఠాన్ సినిమా మీద బాలీవుడ్ ఆశలు పెట్టుకున్నట్టుంది…
బాయ్‌కాట్ పఠాన్ క్యాంపెయిన్‌కు షారూక్ అడమెంట్ రియాక్షన్స్ సినిమా పట్ల మరింత నెగెటివిటీని పెంచుతున్నట్టుంది… ఇక టాప్-10 సంగతికొస్తే… అన్నీ పాన్ ఇండియా సినిమాలే…
Ads
PRESENTING THE IMDB TOP 10 MOST POPULAR INDIAN MOVIES OF THE YEAR 2022 🥁💛 HOW MANY OF YOUR FAVOURITES MADE IT TO THE LIST?#IMDBBESTOF2022 PIC.TWITTER.COM/0GGGT44FG8
— IMDB INDIA (@IMDB_IN) DECEMBER 14, 2022
- RRR (Rise Roar Revolt)
- The Kashmir Files
- K.G.F: Chapter 2
- Vikram
- Kantara
- Rocketry: The Nambi Effect
- Major
- Sita Raman
- Ponniyin Selvan: Part One
- 777 Charlie
తెలుగు నుంచి మేజర్, ఆర్ఆర్ఆర్, సీతారామం… ఊహించిన కార్తికేయ-2 లిస్టులో లేదు… నిజానికి ఆ సినిమాది కూడా అనూహ్య విజయమే… సీతారామం కథ మీద కొన్ని భిన్నాభిప్రాయాలు వినవచ్చినా స్థూలంగా ఓ మంచి ప్రయత్నం, మంచి అభిరుచి… ఏమాత్రం అశ్లీలపు పోకడలు లేకుండా, క్షుద్రమైన కమర్షియల్ అవలక్షణాల జోలికి పోకుండా తీయబడిన క్లాసిక్… స్వప్నా మూవీస్‌కు ఆర్థికంగా కూడా మంచి బూస్టర్…
ఆర్ఆర్ఆర్ అనేది కేవలం డబ్బుల సినిమా… టేస్ట్ లేదు, పైగా గ్రాఫిక్స్ పిచ్చి… ఆస్కార్‌లో ఏదో ఒకటి సాధించాలని మస్తు ఖర్చు పెడుతూ మస్తు లాబీయింగు చేస్తున్నాడు రాజమౌళి… కానీ సక్సెస్ కారణంగా ఐఎండీబీ లిస్టులోకి వచ్చింది… దాని గురించి ఎక్కువ చెప్పుకోవడం దండుగ… మేజర్ సినిమా అనూహ్యంగా మంచి హిట్ కొట్టింది… అడివి శేషు కెరీర్ నాలుగైదు మెట్లు ఒకేసారి ఎక్కేసింది… ఇప్పుడు హిట్-2 సినిమాతో మరింతగా…
కశ్మీరీ ఫైల్స్‌ను ఈరోజుకూ కంట్రవర్సీ చేస్తూనే ఉన్నారు… 15 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 350 కోట్లు వసూలు చేసింది… ప్రమోషన్ లేదు, పెద్ద స్టార్స్ ఎవరూ లేరు… కానీ మౌత్ టాక్‌తో బంపర్ హిట్ కొట్టింది… ఆ సినిమా వివాదం జోలికి ఇక్కడ వెళ్లడం అనవసరం…
ఈసారి విశేషంగా చెప్పుకోవాల్సిన సక్సెస్ కన్నడ సినిమాది… ఒకప్పుడు అనామకంగా ఉండిపోయిన కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు రేపుతోంది… ఈసారి టాప్-10 లో ఉన్న సినిమాల్లో మూడు కన్నడమే… కేజీఎఫ్-2, కాంతార, చార్లి 777… కేజీఎఫ్-2 వసూళ్లు ఇండియన్ సినిమాలో నభూతో తరహాలో సాగాయి… కథ, కథనం విషయాలపై కొన్ని భిన్నాభిప్రాయాలున్నా సరే, జనం మాత్రం పిచ్చిపిచ్చిగా ఆదరించారు సినిమాను…
కాంతార గురించి చాలా చెప్పుకున్నాం… కానీ ఈసారి విశేషంగా చెప్పుకోవాల్సింది చార్లి సినిమా గురించి… ఎమోటివ్… ఎంత ఖర్చు, ఎన్ని వసూళ్లు అనేవి పక్కన పెడితే ఓ మంచి ప్రయత్నం… అనుకోకుండా ఓ మనిషి జీవితంలోకి ప్రవేశించిన ఓ శునకం తనను ఎక్కడి దాకా తీసుకుపోతుంది..? కొత్త కథ, కొత్త కథనం… దేశంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్… అన్నింటికీ మించి ఆ శునకంతో నటింపజేసిన తీరు సూపర్బ్… దర్శకుడు, హీరో ఓపికకు మెచ్చుకోవాలి… ఒక్కో షాట్‌కు అనేక టేకులు… క్లోజప్ షాట్స్‌లో కూడా స్పష్టంగా ఉద్వేగాలు…
తమిళ ఇండస్ట్రీ నుంచి పొన్నియిన్ సెల్వన్… తమిళ ప్రైడ్ స్టోరీగా చెప్పుకునే ఈ బృహద్కథలో మొదటి భాగాన్ని, తన డ్రీమ్ ప్రాజెక్టుగా జనంలోకి వదిలాడు మణిరత్నం… కానీ తమిళ ప్రేక్షకులను మినహా మిగతా ప్రేక్షకులను అలరించలేదు, ఆకట్టుకోలేదు… అసలు అర్థమే కాలేదు… ఇక్కడ కూడా కలెక్షన్లే ఈ సినిమాను ఐఎండీబీ టాప్10 జాబితాలోకి చేర్చాయి…
చెప్పుకోవల్సింది రాకెట్రీ సినిమా… మాధవన్ కష్టపడి తీసిన ఈ బయోపిక్ మంచి సక్సెస్ సాధించింది… నిజానికి సినిమా కోణంలో అది ఓ డ్రై స్టోరీ… కానీ జనరంజకంగా తీశారు… మిగతాది విక్రమ్… ఓ పిచ్చి కమర్షియల్ సినిమా… ఇక్కడా కలెక్షన్లే దీన్ని టాప్-10లోకి చేర్చాయి… స్పష్టంగా, అత్యంత స్పష్టంగా ఇండియన్ సినిమాను సౌత్ సినిమా డామినేట్ చేస్తుందనే విషయాన్ని మాత్రం ఈ టాప్-10 లిస్టు తేటతెల్లం చేసింది…!!
Share this Article