ఏంటీ… ఆఫ్టరాల్ ఒక సినిమా పాట రాయడానికి అంత డిమాండ్ చేస్తున్నాడా..? నాలుగు తెలుగు పదాలు అటూ ఇటూ కూర్చడానికి అంత డిమాండా..? ఇదేమైనా సాహిత్యమా..? సినిమా పాట ఆ పూటకు రంజింపజేస్తే చాలదా ఏం..? తరతరాలూ నిలవాలా..? ఆ ప్యాడ్, ఆ పెన్నూ పట్రండి… చకచకా నాలుగు వాక్యాలు నేనే రాసి పడేస్తా… ఏం..? నాకు చేతకాదా ఏమిటి..? అసలు సంగీత దర్శకుడు అనేవాడు పాటల రాతగాడు కూడా అయి ఉండాలోయ్… లేకపోతే ఈ కవులు, రచయితలు మన నెత్తి మీద ఎక్కి స్వారీ చేస్తారు…
సరళంగా ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కేలా పాట ఉండాలండీ అని అడిగితే ఏవేవో గొట్టు పదాలు, అర్థంగాకుండా రాసి మన మొహాన పడేస్తారు… వాటిని ట్యూన్ కట్టాల్సింది మనమే… ఈ తొక్కలో పాటల్లో పదాల్ని కాస్త మార్చితే మళ్లీ గొడవ… అలుగుతారు… అదేదో కాళిదాసు కావ్యాన్ని మార్చినంతగా..! మనమే రాసుకుంటే ఇక ఏ సమస్యా ఉండదు…
చూడండి… నేను శ్రీదేవి అయితే నేను చిరంజీవినంటా… ఆహా, ఎంత బాగా వచ్చింది..? నువ్వు భూమికవైతే నేను పవన్ కల్యాణంటా… నువ్వు తమన్నా అయితే నేను రాంచరణంటా… ఐనా బాస్ పాటలో వేరే వాళ్ల ప్రస్తావన వద్దులే, పవిత్రత దెబ్బతింటుంది… ఐనా ఎన్ని లేవు, నువ్వు లైలా, నేను మజ్ను… నువ్వు సీతవైతే నేను రాముడినంటా… నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా… ఆహా, ఎంత హాయిగా వస్తోంది పాట… ఈమాత్రం దానికి ఆ పాటల రాతగాళ్లకు అంత చెల్లించాలా..?
Ads
నువ్వు జూలియట్‌వైతే నేను రోమియానంటా… రాయే రాయే చేసుకుందాం లవ్వు… నువ్వు పాటవైతే నేను రాగమంట… నువ్వు వానవైతే నేను మేఘమంట… అవునూ, వానకు, మేఘానికి ప్రేయసీప్రియుల సంబంధం ఉంటుందా..? ఆఁ పోనీలే… ఎవడడుగుతాడు..? నువ్వు వీణవైతే నేను తీగనంటా… పైనపైన రాయే రాయే అన్నాం కదా, ఇక్కడ రారా రారా అని రాసేద్దాం… నువ్వు గువ్వవయితే నేను గోరింకంటా… నువ్వు రాణివైతే, మై నేమ్ ఈజ్ రాజు అంట… నువ్వు హీరోయిన్ అయితే నేను హీరోనంటా… ఓ గంటసేపు రాసేయొచ్చు ఇలా…
ఆ కొరియోగ్రాఫర్ శేఖర్ కూడా ఈమధ్య ఎక్కువ చేస్తున్నాడు… ఏవేవో నాలుగు సింపుల్ మూమెంట్స్ చూపించి, లక్షల బిల్లు చేతికిస్తున్నాడు… ఈసారి కంపోజర్‌తోపాటు కొరియోగ్రాఫర్‌గా కూడా నేనే చేస్తానని నిర్మాతకు చెప్పాలి… ఈమాత్రం నేను పాడలేనా ఏమిటి..? తొక్కలో సింగర్స్‌కు మళ్లీ అదనంగా చెల్లింపులు దేనికి..? ఇక్కడ దేవిశ్రీప్రసాద్… అంటే డీఎస్పీ… నన్ను చూసి ఎలాగూ థమన్ వాతలు పెట్టుకుంటాడు… ఇద్దరమే కదా, ఇంకెవరున్నారు..? వాల్తేరు వీరయ్య తెలుగు పాటకు ఓ కొత్త దశను, దిశను చూపించాల్సిందే…
కాస్త వర్దమాన రచయితలకు ఏమైనా గుట్టుగా చెల్లించేసి, కొన్ని మంచి వాక్యాలు రాయించి పెట్టుకోవాలి… లేకపోతే నువ్వు వానవు, నేను మేఘాన్ని వంటి పదాలు చికాకు పెడతాయి… జోష్‌లో నువ్వు చాపర్ అయితే నేను రెక్కనంట, నువ్వు పెగ్గువైతే నేను సోడానంట వంటివి మధ్యలో చేరితే కష్టం అవుతుంది… ఇదంటే ఏదో బాస్ పాట కాబట్టి, ఎవరూ ఏమీ విమర్శించొద్దు కాబట్టి, దానికి భజనగీతమంతటి పవిత్రత ఉంటుంది కాబట్టి పర్లేదు…!! లేకపోతే ప్రతి పాటకూ అనంత శ్రీరాం కావాలి, రామజోగయ్య కావాలి, చంద్రబోస్ కావాలి, కాసర్ల శ్యామ్ కావాలి అంటే ఎలా కుదురుతుంది…!!
Share this Article