ఎంత తోపు హీరోతో నటించినా సరే… ఎంత భారీ సినిమా అయినా సరే… ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే… ప్రమోషన్ వర్క్‌కు, అంటే ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రెయిలర్ రిలీజులు, ఆడియో రిలీజులు, పోస్టర్ రిలీజులు గట్రా ప్రోగ్రాములకు నయనతార హాజరయ్యేది కాదు… ససేమిరా… సైట్లు, మీడియా, యూట్యూబర్ల ఇంటర్వ్యూలకు కూడా నో చెప్పేది… ఒకసారి సినిమా షూటింగ్ అయిపోయిందంటే ఖతం… ఇక అది ఏమైపోయినా తనకు పట్టేది కాదు… సైరా, గాడ్‌ఫాదర్ సినిమాలకు కూడా సింగిల్ బైట్ ఇవ్వలేదు…
వాళ్లు డబ్బులిచ్చారు, నేను నటించాను… ఇదే సూత్రం… ఐనా సరే, వయస్సు మీద పడుతున్నా సరే, ఇప్పటికీ ఆమెకు ఫుల్ గిరాకీ… సౌత్ ఇండియాలో హైలీ పెయిడ్ ఫిమేల్ స్టార్ ఆమె… కానీ ఇప్పుడు ఒక సినిమాకు మాత్రం ఈ స్వీయ నిబంధనలకు నీళ్లొదిలింది… ఆ సినిమా పేరు కనెక్ట్… ఎందుకంటే..? అది సొంత సినిమా… ఆమె లీడ్ రోల్… నిర్మాత తన భర్త విఘ్నేశ్ శివన్… దాంతో పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది… ఇన్నాళ్లూ దొరకలేదు, మళ్లీ దొరుకుతుందో లేదో తెలియదు, ఇక ఈ సినిమా గురించే గాకుండా అనేక అంశాలపై ప్రశ్నలు వేస్తున్నారు మీడియా పర్సన్స్…
Ads
తప్పదు కదా మరి… ఓపికగా సమాధానాలిస్తోంది… ప్రమోషన్ అవసరమేంటో, అందులో హీరోయిన్ పాత్ర ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలిసివస్తోంది ఆమెకు… ఇన్నాళ్లూ బడా నిర్మాతలు సైతం ఎంత అడిగినా ప్రమోషన్ యాక్టివిటీకి సమ్మతించకపోవడం ఎందుకు కరెక్ట్ కాదో అర్థమవుతోంది… నిజానికి ఈ హారర్ సినిమా ఎర్లీ ప్రీమియర్లకు సంబంధించి పాజిటివ్ స్పందన వస్తోంది… అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్ కాగా, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రల్ని పోషించారు…
సినిమా విడుదలయ్యేది రేపు… కేవలం నయనతార మొహం చూసే తెలుగు, ఇతర భాషల్లో బిజినెస్ జరిగింది… ఆమే సినిమాకు ప్రాణం… కట్ చేస్తే, మీడియా నుంచే కాదు, సినిమా సర్కిళ్లలోనూ నయనతార ద్వంద్వ ప్రమాణాల మీద విమర్శలు మొదలయ్యాయి… నీ సొంత సినిమా అయితే ప్రమోషన్ వర్క్ చేసుకుంటావు, వేరే నిర్మాతల సినిమాలైతే పట్టించుకోవు, నీది డబ్బు గానీ, వాళ్లవి డబ్బులు కావా..? ఇదీ విమర్శ… అవునూ, ఇప్పుడు సరే గానీ, ఇప్పటిదాకా నయనతార మీడియాను ఎందుకు అవాయిడ్ చేస్తుండేది..?!
Share this Article