ఈ హీరోల సతీమణులు హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోరు…. అని ఓ ప్రధాన చానెల్ వెబ్‌సైట్‌లో ఓ వార్త… అశ్లీలంగా, కించపరిచేట్టుగా ఏమీలేదు కానీ… కొన్ని ఆలోచనల్ని ముసిరేలా చేస్తుంది వార్త… అదెలా ఉందంటే… స్టార్ హీరోల పెళ్లాలు కూడా హీరోయిన్ సరుకే అన్నట్టుగా ఉంది సూటిగా చెప్పాలంటే… నిజానికి ఇండస్ట్రీలో అత్యంత హీన పదం హీరోయిన్ సరుకు…
హీరోయిన్ సరుకు అంటే ఏమిటి..? మంచి కలర్ ఉండాలి, మంచి అంగ సౌష్టవం కలిగి ఉండాలి, మంచి లుక్కు ఉండాలి, మొహం చూడబుల్‌గా ఉండాలి… ఇంతేనా..? ఇదేనా హీరోయిన్ అనిపించుకోవడానికి అర్హత… నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఏది చెప్పినా కమిటైపోవాలి, అందాలన్నీ ఆరబోయాలి, ఇంతేనా..? దీన్నే హీరోయిన్ సరుకు అంటారా..?
….. (రానా భార్య మిహిక బజాజ్)…..
Ads
హీరోయిన్ అంటే నటి… ఆమె ప్రధాన వృత్తి అది… అంటే కాసింతైనా నటన బేసిక్స్ తెలియాలి… ఎలాగూ డబ్బింగ్ చెప్పిస్తారు కాబట్టి వాచికం ఎలా ఉన్నా పర్లేదు, అసలు భాషే రాకపోయినా, పలకలేకపోయినా పర్లేదు… ఇప్పుడు కలర్ టోన్ కూడా గ్రాఫిక్స్‌లో కవర్ చేయొచ్చు… చిన్నాచితకా ముఖదోషాలను మేకప్పుతో ఫిక్స్ చేయొచ్చు… చివరకు అంగసౌష్టవ లోపాల్ని కూడా కనిపించకుండా చేయొచ్చు… మరి ఇక అర్హత ఏముంది..?
….( అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి)
హిందీలో చూడండి, ఓ వయస్సు దాటినవాళ్లు కూడా యంగ్ లుక్స్‌తో కొత్త హీరోయిన్లతో పోటీపడుతున్నారు… ఉదాహరణకు టాబూ… ఇప్పుడు ఆమె మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ బాలీవుడ్‌లో… ఎస్, ఆలియాభట్, దీపిక పడుకోన్ వంటి అగ్రతారలు అడ్డంగా ఫెయిలైనచోట టాబూ సక్సెస్‌లు చేజిక్కించుకుంటోంది… మాధురీ దీక్షిత్, రవీనా టాండన్ ఎట్సెట్రా వెటరన్స్ కూడా మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నారు… మరి హీరోయిన్ సరుకు అనగానేమి..?
….. (రాంచరణ్ భార్య ఉపాసన)…
ఐనా హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా ఉండి, ఆసక్తి ఉండి, అవకాశాలు కూడా ఉన్నా సరే, ఫ్యాన్స్ పడనిస్తే కదా… మంచు లక్ష్మి, ఘట్టమనేని మంజుల, కొణిదెల నీహారిక… వీళ్లను అసలు సగటు హీరోయిన్లలా పాత్రలు పోషించనిస్తే కదా… ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయని ఎక్కడికక్కడ వెనక్కి పట్టి లాగారు… ఒక్కసారి వీళ్లు వరలక్ష్మి శరత్‌కుమార్, శివానీ రాజశేఖర్, శివాత్మికలను చూసి నేర్చుకోవాలి…
…(నాని భార్య అంజనా)….
అవును, ఈ స్టార్ హీరోల సతీమణులు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు, సో వాట్… వాళ్లకు నటనపై ఆసక్తి ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదుగా… పైగా వీరిలో చాలామంది ఆల్‌రెడీ తల్లులు అయిపోయారు… పిల్లల పోషణ, భర్త బాగోగులు, ఇంటి బాధ్యతలకే సరిపోతుంది… ఇక షూటింగ్ స్పాట్లకు వెళ్లి ఆ తలనొప్పులు భరించడం దేనికి..? ఆస్తుల సంగతి సరేసరి… అందం అంటారా..? అది సమాజానికి ప్రదర్శించడానికే కాదు కదా… తమ కోసం కూడా… దానిపై చర్చ అనవసరం… అందాల ప్రస్తావన అటుంచి, ఎక్కువ శాతం మంది అడ్డగోలు కట్నాలతో అత్తిళ్లకు వస్తారు, ఐనా ఈ కెరీర్ దేనికి వాళ్లకు..? (భర్తలు ఎవరితో తిరుగుతున్నారని కాస్త నిఘా వేసుకుంటే సరి…)
… (నితిన్ భార్య శాలిని…)
వీళ్లంతా సరే… కానీ సినిమా హీరోయిన్లనే పెళ్లి చేసుకున్నవాళ్లు ఉన్నారుగా… అఫ్‌కోర్స్, పెళ్లయ్యాక ఇంట్లో కూర్చోబెట్టేవాళ్లే అధికం… కానీ హిందీలో పెళ్లయ్యాక కూడా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు కొందరు… మరింత ఉధృతంగా… ఉదాహరణ దీపిక పడుకోన్… పెళ్లయ్యాక మరీ రెచ్చిపోయి, వెగటు సీన్లను పండిస్తోంది… కొంతలోకొంత ఆలియా భట్ నయం… మంచి పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ, కష్టపడుతోంది… మహేశ్ బాబు భార్య నమ్రత పెళ్లయ్యాక మళ్లీ తెర మీదకు రాలేదు… సో, ఎవరి అభిరుచి, ఎవరి పరిమితులు, ఎవరి ఆలోచనలు వాళ్లవి…
….(ఎన్టీయార్ భార్య ప్రణతి)….
చూశారుగా… స్టార్ హీరోల భార్యలు సగటు హీరోయిన్లకన్నా ఏం తక్కువ అనే ఒక్క వాక్యం ఎన్ని ఆలోచనలను పరుస్తున్నదో… అసలు హీరోయిన్ అంటే ఎవరు అనే నిర్వచనం నుంచి మొదలవుతుంది మథనం… అఫ్‌కోర్స్, అది ఎటూ తేలదు… చివరగా… చాలామంది తారలు పెళ్లిళ్లు చేసుకున్నాక భర్తలు నటించనివ్వరు, బయటికే రానివ్వరు… కొన్నాళ్లకు వాళ్లు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ వస్తారు… క్లిక్కయ్యేది తక్కువ మంది… అప్పటికే పెళ్లిళ్లు డిస్టర్బయి పోతాయి… సో… ఇది పెద్ద చర్చే…!!
Share this Article