ఎవడెంత ఏడ్చి మొత్తుకున్నా… ఎంత విద్వేషాన్ని చిమ్మినా… ఏ దుష్ప్రచారం చేసినా… సింగిల్ స్టార్ రేటింగులతో ఇజ్జత్ తీసినా… అవతార్-2 తన వసూళ్ల ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉంది… అసలు ఆ సినిమా నడవకపోతే ఇక ఆ సాంకేతిక పరిజ్ఞానానికి, ఆ ప్రయాసకు అర్థమే లేదు… పెద్ద థియేటర్, డోల్బీ సౌండ్, త్రీడీ ఎఫెక్ట్‌లో సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు… దాన్ని ప్రపంచవ్యాప్తంగా జనం ఎంజాయ్ చేస్తున్నారు… కథ ఏమిటో జానేదేవ్… వాహ్, క్యా సీన్ హై అనుకుంటూ లీనం కావడమే…
సినిమా రిలీజైన మూడునాలుగు రోజులకే సినిమా నిర్మాణ వ్యయం 400 మిలియన్ డాలర్లు వచ్చేసింది… ఇప్పుడు 15 రోజులు కూడా దాటకముందే ఒక బిలియన్, అంటే 100 కోట్ల డాలర్ల మార్క్ చేరుకుంది… అంటే దాదాపు 8200 కోట్లు… అబ్బే, జేమ్స్ కామెరూన్ 16,000 కోట్లు వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ రాదు అన్నాడుగా అని సాకులు వెతక్కండి… తను చెబుతాడు, 3 బిలియన్లు కావాలి నాకు అంటాడు, అంటే 24 వేల కోట్లు… ఆయన ఆశ, నిర్మాణవ్యయంపై తన అంచనాలు అలా చెప్పాడు… చెప్పాడు కాబట్టి రావు కదా… పెట్టిన ఖర్చు వచ్చిందా లేదా..?
Ads
నిజానికి కథ కూడా పదునైనదే… మొత్తం గ్రహాన్నే కాజేయాలనే దుష్టబుద్ధితో మనిషి… జాతుల నడుమ పోరాటాలకు స్వస్తి చెప్పి, ఐక్యంగా పోరాడటం సినిమాలో స్పూర్తి… దానికి జలవాతావరణంలో బతకడం నేర్చుకుంటారు… జాతి పరిరక్షణ అనేది ముందుగా కుటుంబరక్షణ దగ్గరే స్టార్ట్ కావాలంటాడు హీరో… కొత్త జాతులతో సహజీవనంలో చిక్కులుంటాయి… సో, అన్నీ కొత్తకొత్తగానే పలకరిస్తాయి మనల్ని… సరే, ఇవన్నీ పక్కన పెడితే… ఈ సినిమా సీక్వెల్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు…
ఆల్‌రెడీ అవతార్-2 షూటింగ్ సమయంలోనే షూట్ చేసిన ఫీడ్ బోలెడు ఉంది… దాదాపు 9 గంటల ఫీడ్‌ను జేమ్స్ కామెరూన్ ఎడిటింగ్, గ్రాఫిక్స్ విభాగాలకు అప్పగించాడు… ఇప్పుడిక షూటింగ్ తిప్పలు లేవు… బియ్యం, కూరగాయలు ఎట్సెట్రా సరుకులు రెడీ… ఇక పొయ్యి వెలిగించి బిర్యానీ వండటమే… అదే పెద్ద టాస్క్… గ్రాఫిక్స్‌తోపాటు ఆ 9 గంటల నిడివిని 3 గంటలకు, అంటే మూడోవంతుకు కుదించాలి… అవతార్-2 మీద కొన్ని విమర్శలు వచ్చాయి కాబట్టి వాటినీ పరిగణనలోకి తీసుకుని, ఇంకాస్త ఆసక్తికరంగా సినిమాను వండాలి…
చేతిలో ఫీడ్ ఉంది కదా, చకచకా ఎడిటింగ్ చేసేసి, గ్రాఫిక్స్ కలిపేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఏమీ లేడు కామెరూన్… పోటీ ఏముంది,..? తొందరేముంది..? పైగా అవతార్-2ను వీలైనంత పిండుకుని, పిండుకుని, ఇక ఏమీ లేదు అనేదాకా వెయిట్ చేసి, అప్పుడు మూడో పార్ట్ రిలీజ్ చేస్తాడు… తను చెబుతున్న 2 బిలియన్లు చేరేదాకా అవతార్2 సినిమా నడుస్తూనే ఉంటుంది… మూడో భాగం కోసం ప్రేక్షకుల్ని వెయిట్ చేయించీ చేయించీ అప్పుడు రిలీజ్ చేస్తాడు…
‘‘పండోరా గ్రహం ఉంటుంది… ఆ గ్రహవాసులు ఉంటారు… మేమేం చేయాలో మాకు క్లారిటీ ఉంది… ఆ కథలు సజీవం… ఇప్పటి నుంచీ లెక్కేసుకొండి, రెండేళ్ల తరువాత (2024) అవతార్3 రిలీజ్ చేస్తాం… తరువాత సంవత్సరం (2025) అవతార్4 వస్తుంది… ఆ తరువాత రెండేళ్లకు (2027) అవతార్5 రిలీజ్ ఉంటుంది…’’ అని చెబుతున్నాడు కామెరూన్… రాబోయే అవతార్3 కోసం కేవలం ఎడిటింగ్, గ్రాఫిక్స్ ఖర్చు మాత్రమే అనుకుంటున్నారా..? అవతార్2 కోసం జరిగిన ఖర్చుకు మూడింతలు అవుతుందని అంటున్నాడు… అదీ సంగతి… 3 బిలియన్లు వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ రాదు అంటాడేమో అప్పుడు..!!
Share this Article