నిజానికి టాప్ గేర్ అనే సినిమా చూసొచ్చాక మనకు అనిపిస్తుంది… ఆది సాయికుమార్ శాపగ్రస్తుడా..? ఫీల్డుకొచ్చి 12 ఏళ్లు, పుష్కరం అవుతున్నా సరే, ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు… సరిగ్గా లెక్క చూస్తే ఏడాదికి ఒకటీ ఒకటిన్నర సినిమాలే తేలతాయి… కానీ రెండేళ్లుగా తనకు వరుస ఆఫర్లు…
ఆ సినిమాలు ఫ్లాపా..? అట్టర్ ఫ్లాపా ఎవడూ చూడడు… ఒకడు కాకపోతే మరొకడు వస్తున్నాడు, అడ్వాన్స్ చేతిలో పెడుతున్నారు, ఆది సరేనంటున్నాడు… వరుస పెట్టి చేస్తూనే ఉన్నాడు… ఏ సినిమా ఎప్పుడొచ్చిందో హఠాత్తుగా అడిగితే తనే చెప్పలేడు… ఈ ఏడాదే తీసుకొండి అతిథి దేవోభవ, బ్లాక్, తీస్మార్‌ఖాన్, క్రేజీ ఫెలో అని సినిమాలు తీశాడు… ఇప్పుడు తాజాగా టాప్ గేర్… అన్నీ ఫ్లాపులే అని చెప్పనక్కర్లేదు కదా…
ఇలాంటి ఫ్లాప్ చరిత్ర ఉంటేనేం… ఈరోజుకు తన చేతిలో నాలుగు సినిమాలున్నయ్… రాసి పెట్టుకొండి, అవి రిలీజయ్యేలోపు మరో నలుగురు నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు… కొందరు ఇలా పెట్టిపుడతారన్నమాట… పోనీ, సినిమా ఎలా ఉన్నా సరే, మినిమం వసూళ్లు ఉంటాయని చెప్పడానికి తను మాస్ హీరో కూడా కాదు…
Ads
నిజానికి తను ఏ కథ ఒప్పుకుంటున్నాడో, ఏం సీన్లు చేస్తున్నాడో తనకే సోయి ఉండటం లేదు… ఈరోజు రిలీజైన టాప్ గేర్ మరీ నాసిరకం… ఆ సినిమా సమీక్షకు వస్తే స్పేస్ వేస్ట్ అన్నట్టుగా ఉంది… అసలు ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయాలంటే కథనం మీద, సీన్ల మీద బాగా వర్క్ జరగాలి… అదేమీ జరిగినట్టు కనిపించదు…
థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం అనిపించేది ఒకటే… హమ్మయ్య, త్వరగానే వదిలాడురా బాబూ అని..! సినిమా చాన్స్ వస్తుందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నట్టున్నాడు ఆది… ఏడాదికి ఒకటి చేసినా సరే, ప్రేక్షకుల మెదళ్లలో రిజిష్టరయ్యే కథను ఎంపిక చేసుకోవచ్చు కదా… అది చేతకాదు… సరే, ఈ కొత్త ఏడాదిలో కూడా బోలెడు సినిమాలు వస్తాయి, ఆ తరువాత ఏడాది కూడా వస్తాయి… తరువాత..?
ఈ ప్రశ్నకు జవాబు ఆది దగ్గర కూడా లేదు… ఎందుకంటే..? తన ఆలోచనలు ఎప్పుడో గతి తప్పాయి… ఏమో, తక్కువ బడ్జెట్‌లో సినిమా చుట్టేయడం, ఓటీటీకి అమ్మేసుకోవడం, థియేటర్లలో పరిగె ఏరుకోవడం… బహుశా ఈ స్ట్రాటజీలో పోతున్నాడేమో… నిర్మాతలకూ సేఫ్ కదా… అవునూ, ఆదీ… నిఖిల్ సిద్ధార్థ వంటి జూనియర్లు కూడా ప్రయోగాలకు, కొత్త కథలకు సై అంటున్నారు కదా, మరి నీకెందుకు ఆ తోవ కనిపించడం లేదు..?! ఇంతకీ ఈ టాప్ గేర్ సినిమా సంగతేమిటి అంటారా..? చూడండి పర్లేదు అని ఎవడైనా సలహా ఇస్తే కదా…!!
Share this Article