మొన్న మన మెయిన్ స్ట్రీమ్‌కు ఈ వార్త పట్టలేదు… మహారాష్ట్రలోని రాజ్‌థాకరేకు సంబంధించిన పార్టీ నవ నిర్మాణ సేన ఓ హెచ్చరిక జారీ చేసింది… పాకిస్థాన్ సినిమా ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ను దేశంలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి… అదే జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి అనేది ఆ హెచ్చరిక సారాంశం… శివసేన తన హిందుత్వను ఎప్పుడో అరేబియా సముద్రంలో కలిపేసింది కానీ నవ నిర్మాణ సేన ఇంకా ఆ పనిచేయలేదు… పైగా రాష్ట్రంలో బలం పెంచుకోవడం కోసం తాపత్రయపడిపోతూ ఉంది…
నవ నిర్మాణ సేన హెచ్చరికతోపాటు పలు హిందూ సెక్షన్లు కూడా ఇదే పిలుపునివ్వడంతో ప్రస్తుతానికి ఆ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది… నిజానికి నిన్న ఈ సినిమా రిలీజ్ కావల్సి ఉంది… ఐనాక్స్ వర్గాలు రెండుమూడు రోజుల క్రితమే తమకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సమాచారం ఇచ్చారనీ, తిరిగి ఎప్పుడు రిలీజ్ చెప్పలేమని చెబుతున్నాయి…
అసలు ఈ సినిమా ఏమిటి..? వివాదం ఏమిటి..? 1979లో మౌలా జాట్ అనే సినిమా వచ్చింది… దానికి ఇప్పుడు రీమేక్ చేశారు… ఇందులో ఓ కీలకపాత్ర నూరి నాట్… దీన్ని పోషించింది హమ్‌జా అలీ అబ్బాసీ… ఈ సినిమా రిలీజు వార్తలు వెలువడిన వెంటనే నెటిజనం కూడా వ్యతిరేకంగా రియాక్టయ్యారు… ఒకవైపు ఇండియాలో టెర్రరిజాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తుంటే… ఓ ఉగ్రవాదికి మద్దతుదారైన అబ్బాసీ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయడం ఏమిటనేది ఆ వ్యతిరేకత…
Ads
ఈ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయడానికి జీ స్టూడియో వాడు హక్కులు కొన్నాడు… పీవీఆర్ సినిమాస్ కూడా 30న రిలీజ్ ఉంటుందని టికెట్ల విక్రయం కూడా మొదలుపెట్టింది… ప్రధానంగా పంజాబీ ఎక్కువగా మాట్లాడే పంజాబ్, ఢిల్లీ థియేటర్లలో వసూళ్ల మీద ఆశలు పెట్టుకుంది జీ స్టూడియో…
ఈ అబ్బాసీ 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వీరాభిమాని… 2019లో డొనాల్డ్ ట్రంపు ఏదో ట్వీట్ చేస్తే… ‘‘ఒరే ఇడియెట్, హఫీజ్ ముంబై పేలుళ్లను ఖండించాడు తెలుసా’’ అని సమాధానమిచ్చాడు… 2019 జూలైలో పాకిస్థానీ అధికారులు హఫీజ్‌ను అరెస్టు చేస్తే… ఇదే అబ్బాసీ ‘‘హఫీజ్ టెర్రరిస్టు కాదు, అదే నిజం, జస్ట్, కాశ్మీర్ యువత కోసం ర్యాలీల్లో మాట్లాడుతుంటాడు… అదే నేరమా..? నాకు హఫీజ్ ఏళ్లుగా తెలుసు…’’ అని ట్వీట్ చేశాడు…
నిజానికి హఫీజ్ పాకిస్థాన్‌లోని నాన్-ముస్లిం కమ్యూనిటీలకు ఎనలేని సేవ చేశాడని కూడా అన్నాడు ఓసారి… పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల సమయంలో కూడా ‘‘థాంక్ గాడ్, జిన్నా రెండు దేశాల విభజన చేయించి బతికించాడు’’ అని వ్యాఖ్యానించాడు… ఇలాంటి ఉగ్రవాది కీలకపాత్ర పోషించిన ఆ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయడం ఏమిటి…? అది జాతి మనోభావాలకే దెబ్బ అని నవనిర్మాణసేన వాదిస్తోంది… దీంతో సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడింది…!!
Share this Article