వార్నీ… ఇంతేనా..? సీనియర్ యాంకర్ సుమ ఇక యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక ప్రోమో… షాక్ షాక్ అంటూ బొచ్చెడు వార్తలు… పెద్ద బిల్డప్పు… మామూలుగా టీవీ ప్రోమోలు అంటేనే ఫేక్, ప్రాంక్… కానీ దీన్ని చాలా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా సీరియస్గా తీసుకుని, నిజమే అన్నట్టుగా రాసిపారేశారు…
ఏదో ఓ ప్రోగ్రాం కోసం ఈ పిచ్చి ప్రోమో చేస్తే, ఇదేదో ఎదురుతంతోందని సుమకు అర్థమైపోయింది.., నిజంగానే మానేస్తున్నావా అంటూ ఆమెకు బోలెడు ఫోన్లు, హమ్మయ్య, కొత్త రక్తానికి చాన్స్ అంటూ సెటైర్లు, మీమ్స్… మొత్తానికి నెట్ అదిరిపోయింది… దాంతో ‘అబ్బే, అలాంటిదేమీ లేదు, నేను యాంకరింగ్ మానేయడం లేదు’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది…
మళ్లీ ఏమైందో ఏమో… ఆ ప్రోమో చేసీ, వేస్టయిపోతుందని భయపడిందేమో… ఆ వీడియో డిలిట్… మళ్లీ ఏమైందో… మరో వీడియో… ‘నేను ఎటూ పోవడం లేదు, ఏదీ మానేయడం లేదు… అలా ఎందుకు అన్నానో న్యూఇయర్ ప్రోగ్రాం చూడండి’ అని సందేశం… దాంతో ఆ ప్రోమోకు వాల్యూ లేకుండా పోయింది… దాని మీద ఆసక్తి కూడా పోయింది… అప్పటికే అది ఫ్లాపయిపోయింది…
Ads
తీరా 31 డిసెంబరు రాత్రి న్యూ ఇయర్ పార్టీ ప్రోగ్రాం చూశాక … అందరూ నవ్వుకున్నారు… ఫాఫం, సుమ కూడా ఇలా తయారైందేమిటి అని..! విషయం ఏమిటి తెలుసా..? ఆమె 2022లో ఇక విరామం తీసుకుంటుందట యాంకరింగుకు… ప్రేక్షకులంటే నిజంగానే టీవీ వాళ్లకు మజాక్ అయిపోయింది… ఈ న్యూ ఇయర్ పార్టీ మొత్తం సుమకే అంకితం చేశారు… ప్రోగ్రాం చెత్త, దాని గురించి సమీక్షే అనవసరం… కానీ క్యాష్ స్థానంలో ‘సుమ అడ్డా’ అని కొత్త షో స్టార్ట్ చేయబోతోంది ఆమె 2023లో… ఇదీ సంగతి…
నిజానికి క్యాష్ కొనసాగింపు అనవసరమే… మొనాటనీ వచ్చేసింది… పిలిచిన సెలబ్రిటీలనే పిలిచీ పిలిచీ, చూసేవాళ్లకు కూడా బోర్… తరువాత సినిమా ప్రమోషన్లకు వాడుకున్నారు ఆ ప్రోగ్రాంను… ఎవరెవరో కొత్త మొహాలు… దీంతో ప్రేక్షకాదరణ పోయి, దారుణమైన రేటింగ్స్ నమోదు కాసాగాయి… నిజానికి సుమ హోస్ట్ కాకపోతే అదెప్పుడో అట్టర్ ఫ్లాప్… ఆమె తన ఎనర్జీ, తన స్పాంటేనిటీతో ఇన్నాళ్లూ లాక్కొచ్చింది…
తనకు ఈటీవీ టీం (మేనేజ్మెంట్ కాదు, ఆ తొక్కలో శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచ్ ఉంటుంది కదా…) సుమను సన్మానించింది… ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఈటీవీ మొదటి నుంచీ వీళ్లతోనే ఉన్నాను… 27 ఏళ్లు… రోజుకు 16 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి… ఇదే క్యాష్ 12 ఏళ్లుగా నడుస్తోంది… ఎప్పుడో 15.5 యేళ్ల వయస్సులో యాంకరింగ్ ప్రారంభించాను…’’ అని చెబుతూ పోయింది సుమ…
నిజమే… కానీ చివరలో… ‘‘నేనెక్కడికి వెళ్తాను, ఎటూ పోను, ఎప్పుడూ ఎంటర్టెయిన్ చేస్తూనే ఉంటాను’’ అని ముక్తాయించింది… సో, 2033 ఈటీవీ న్యూ ఇయర్ షోకు కూడా సుమ హోస్ట్… రాసి పెట్టుకొండి… అఫ్ కోర్స్, తెలుగు టీవీ ప్రేక్షకుల్లో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు, ఇలాగే కొనసాగించు సుమా… కాకపోతే ఈ తొక్కలో చెత్త ప్రోమోలను మాత్రం ప్రయోగించకు… అంతే…
Share this Article