పత్రి వాసుదేవన్ :: అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత నారా వారి ఫ్యామిలీకి అతికినట్టు సరిపోతుంది. చినబాబు గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే తలబొప్పి కట్టిన చంద్రబాబుకు, తాజాగా పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం నారా లోకేష్ పాదయాత్ర. ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ పాదయాత్రకు అనుమతులు లభిస్తాయా? లభించినా యాత్ర సజావుగా సాగుతుందా? ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు అందరి మెదళ్లనూ తొలిచివేస్తున్నాయి.
ఈ అనుమానాలను పక్కన పెడితే అసలు పాదయాత్ర పేరుతో కూడా చిక్కులు వస్తున్నాయని కొందరు పార్టీ నాయకులే గుస గుసలాడుకోవడం కనిపిస్తోంది. యువ గళం పేరుతో లోకేష్ పాదయాత్రకు పూనుకున్నారు. మొత్తం 4 వందల రోజులపాటు 4 వేల కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగనుందని చెప్తున్నారు. అసలు ఈ పేరు ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగిందో, దీన్ని లోకేష్ ఎలా అంగీకరించారో అర్ధం కావడం లేదని కొందరు అనుకుంటున్నారు. దీనికి వారు చెప్తున్న లాజిక్ కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంది.
రాష్ట్రంలో 2024లో జరగబోయే ఎన్నికలకు తెలుగుదేశం తరపున ప్రధాన ఫేస్ లోకేష్ కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు కేంద్రంగానే ఎన్నికలకు వెళ్తారన్నది లోకేష్ కూడా ఒప్పుకొనే విషయమే. మళ్ళీ మా పార్టీకి అధికారం ఇవ్వండి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పాలి తప్ప నన్ను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనే అవకాశం లేదన్నది నిర్వివాదాంశం.
Ads
మరి ఇలాంటి సమయంలో తండ్రిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనే తలంపుతో లోకేష్ చేపడుతున్న యాత్రలో తన తండ్రి వారసత్వం ఎక్కడా కనిపించకుండా ఉండడం ఏంటని, కేవలం నిరుద్యోగులకు భరోసా పేరిట పాదయాత్ర ఏంటని తలలు బాదుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ గుర్తుంది. అంతకు ముందు వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అయన తదనంతరం అయన కొడుకు జగన్ ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు.
జగన్ యాత్ర నాటికి వైఎస్ బతికి లేకపోయినా గతంలో అయన చేసిన యాత్ర పేరుకు దగ్గరగా తన యాత్ర పేరు ఉండేలా చేసుకుని, మళ్ళీ తన తండ్రిని అందరికీ గుర్తు చేసి మరీ యాత్ర కొనసాగించిన విషయం తెలిసిందే. మరి లోకేష్ మాత్రం తన తండ్రి యాత్రలకు తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం, యాత్ర లక్ష్యాల్లో చంద్రబాబు ప్రమేయం, ప్రస్తావన, ఆలోచన కూడా లేకపోవడం, రాకపోవడం ఏంటని ముక్కున వేలు వేసుకుంటున్నారు. లోకేష్ ఎందుకు ఈ విపరీత పోకడలు పోతున్నాడో అర్ధం కావడంలేదని అనుకుంటున్నారు… అవునూ, జగన్ తాజాగా తీసుకొచ్చిన రోడ్ షోల రద్దు జీవో ప్రభావం ఈ లోకేష్ పాదయాత్రపై ఎంత ఉండనుంది..?
Share this Article