నిజానికి ఇది వార్తగా గాకుండా… ఎవరికైనా దీన్ని మామూలుగా చెబితే ఎహె, ఊరుకొండి, సినిమా కథ చెబుతున్నావా.? కల్పనకు కూడా హద్దుండాలి అని తిట్టేస్తారేమో… అంతటి అసాధారణత్వం ఈ కథలో… ఇంత ఆర్ద్రమైన కథను, నిజాన్ని, వార్తను వినలేం, చదవలేం… అంత డెప్త్ ఉంది… ఈరోజు తెలుగు పాఠకులందరినీ కదిలించిన ఆ వార్త ఏమిటంటే..?
సాఫ్ట్‌వేర్ దంపతులు… ఆరేళ్ల కొడుకు… తనకు మెదడు కేన్సర్… డాక్టర్లకు చూపిస్తున్నారు… బిడ్డకు అర్థం అవుతుందో లేదో వాళ్లకు తెలియదు కానీ ఏ సమస్యా లేనట్టుగానే ఆ జంట వ్యవహరిస్తున్నారు… కడుపులో బాధ కత్తులతో కోస్తున్నా సరే, బిడ్డ ఎదుట నటిస్తున్నారు… కన్నీటి చుక్క కూడా బయటపడనివ్వడం లేదు… కానీ వాళ్లకు తెలియని అసలు నిజం ఏమిటంటే… డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు, తాను వేసుకుంటున్న మందులను బట్టి ఆ బిడ్డ తన వ్యాధి ఏమిటో తనే గూగుల్‌లో అన్వేషించి, తెలుసుకున్నాడని..!
అసలు ఆరేళ్ల చిన్నారి తన ట్యాబ్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవాలని అనిపించడం చాలా చిన్న విషయం… ఇప్పటితరం ఐక్యూ లెవల్స్ డిఫరెంట్… అయితే ఇక్కడ మనం నమ్మలేనిది ఏమిటంటే..? సాధారణంగా రోగులకు వ్యాధి గురించి చెప్పకండి, ప్యానిక్ అవుతారు లేదా చివరి రోజుల దాకా ఆనందంగా ఉంచాలి అని రోగుల సంబంధీకులు డాక్టర్లను అడుగుతుంటారు… కానీ ఇక్కడ రివర్స్… ఆ పిల్లాడు తన తల్లిదండ్రులకు తన కేన్సర్ గురించి తెలియదని అనుకున్నాడు… నేను చనిపోయేదాకా చెప్పకండి డాక్టర్, వాళ్లు సంతోషంగా ఉండాలి అని అడగడమే హైలైట్… పిల్లాడికి ఏమీ తెలియదని పేరెంట్స్ అనుకున్నారు… పేరెంట్స్‌కు తెలియదని పిల్లాడు అనుకున్నాడు… కడుపులో దుఖం, ప్రేమ పేగుల్ని కోసేసే ఓ తట్టుకోలేని ఉద్వేగం…
Ads
తన వయస్సెంత..? అసలు అంత పరిణతి మనం ఊహించగలమా..? చదువుతుంటే అప్రయత్నంగా, మనకు తెలియకుండానే ఓ కన్నీటిచుక్క చెంపలపైకి జారుతుంది… ఊహించనంత క్రియేటివిటీయే జీవితం, రియల్ మెలోడ్రామా అంటే ఇంతకుమించి ఏముంటుంది..? ఇక్కడే కథ ముగియలేదు… మరో డాక్టర్ దగ్గరకు బాబును తీసుకుపోయినప్పుడు, వాళ్లకూ అర్థమైపోయింది, ఇక మా బాబు మమ్మల్ని విడిచిపోయే కాలం సమీపించిందని… ఆ చివరి రోజుల్లో బాబును ఆనందంగా ఉంచాలని వాళ్లు అనుకున్నారు… సేమ్, రక్తం కదా, సేమ్ అనుభూతులు…
కొలువులకు రాజీనామా చేశారు… ఇన్నాళ్లూ కూడబెట్టుకున్న సొమ్ముతో బాబును అటూ ఇటూ తిప్పారు… హోటళ్లు, టూర్లు, సినిమాలు… పిల్లాడి ఆనందమే ప్రపంచంగా బతికారు… జగన్నాటక సూత్రధారికే ఒక కొత్త ఉద్వేగ నాటకం ఏమిటో చూపించారు ఆ జంట, ఆ కొడుకు… కొన్నాళ్లకు దేవుడు ఆ పిల్లాడిని తీసుకెళ్లిపోయాడు… ఆ తరువాత ఎప్పుడో సదరు డాక్టర్ కలిసినప్పుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు… మీ కొడుకు ఇలా అడిగాడు అని… ఆ ఇద్దరినీ ఇప్పుడు అసలు దుఖం సునామీలా కుదిపేసింది… ఇది కదా హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ అంటే..! మనస్పూర్తిగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ స్టోరీకి ఉన్న ఎక్స్‌క్లూజిటీ, దానికి ఇచ్చిన ప్రయారిటీ, స్ట్రెయిట్‌గా రాసిన శైలి, మంచి ప్రజెంటేషన్, గుడ్…!! సాక్షి కూడా సేమ్… ఎటొచ్చీ ఈనాడులో కూడా ఈ వార్త ఉంది... But not at all impressive… పేలవమైన ప్రజెంటేషన్..!!
Share this Article