అదే ఫ్యాక్షన్… అదే రాయలసీమ… అవే పంచ్ డైలాగులు… అదే నరుకుడు… అదే ఉతుకుడు… బాలకృష్ణకు హిట్ సినిమా కావాలంటే మళ్లీ అదే సీమ సింహం పాత్ర కావల్సిందేనా..? ఇక వేరే పాత్రల వైపు వెళ్లడా..? వెళ్లలేడా..? బయటికి రాలేడా..? పైగా రాయలసీమను ఇంకా ఇంకా ఎందుకలా చూపించడం..? సీమ అంటే తరుముడు, తురుముడేనా..? సీమలో అడుగుపెట్టగానే వేటకొడవళ్లు, పారే నెత్తురేనా కనిపించేది..? అసలు ఫ్యాక్షన్‌కు సీమ దూరమై ఎన్నేళ్లయింది..? ఇంకా ఆ కత్తుల నీడలే చూపించాలా..?
పైగా ఇలా చూపిస్తేనే మాస్ అట… ఫ్యాన్స్‌కు నచ్చుతుందట… ఓ రొటీన్ కథ, దానికి ఫార్ములా అద్దకాలు… తల్లులు వేరయినా తండ్రి ఒక్కడేగా, మరి అంతగా అన్నపై వరలక్ష్మి పగపడుతుందేం..? చంపించేస్తుందేం..? ఇదేం సెంటిమెంట్..? అసలు మాస్ సినిమా అంటే ఎడాపెడా మీద పడి కొట్టేసుకోవడం, చంపేసుకోవడమేనా..? తెలుగు హీరోలు మారరు, దర్శకులు అస్సలు మారరు… సరే, వీరసింహారెడ్డి రివ్యూకు వస్తే… ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్స్‌కే అంకితం… అవే బిల్డప్పులు, రొటీన్ ఇమేజీ బాపతు స్టెప్పులు…
సెకండ్ హాఫ్ మరింత ఉసూరు… ఎంతసేపూ బాలకృష్ణకు మాస్ సినిమా అంటే… చెన్నకేశవరెడ్డి, లెజెండ్, సమరసింహారెడ్డి బాపతు కథనాలేనా..? ఆ మూసలో నుంచి ఇక బయటికి రాడా..? ఈ కథను, కథనాన్ని ఈజీగా ఊహించొచ్చు… బాలయ్య డబుల్ యాక్షన్… కొడుకు, తండ్రి… కొడుక్కి వరసైన శృతి హాసన్ కేవలం పాటల కోసం మాత్రమే ఉంది… ఆ పాటల్లో కూడా జైబాలయ్యా అచ్చంగా ఫ్యాన్స్ కోసం మాత్రమే… మిగతా పాటల్లో థమన్ బాపతు రొటీన్ డండండం మార్క్ వినొచ్చు… కాకపోతే సినిమాలోని కొన్ని సీన్లకు తన బీజీఎం బాగుంది… అఖండ బీజీఎంను థమన్ కంటిన్యూ చేస్తున్నాడు…
Ads
ఎప్పటిలాగే బుర్ర సాయి మాధవ్ కలం పదును కనిపించింది… ఏపీ ప్రభుత్వం మీద చురకలు అంటించే, అభిమానులను ఉర్రూతలూగించే డైలాగులు ఉన్నాయి. “సవాలు విసరకు. నేను శవాలు విసురుతా”, “మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదు”, “ఆయన్ను చంపే ఆయుధం పుట్టలేదు.. అనుబంధం పుట్టింది” వంటివి మచ్చుకు కొన్ని… కానీ ఎంతసేపూ ఎలివేషన్లు, పంచులు తప్ప మరేమీ లేకపోతే ఎలా..? అందుకే సినిమా బోర్ కొడుతుంది అనేకచోట్ల… తండ్రికీ, కొడుక్కి నడుమ కనీసం 30 ఏళ్ల తేడా ఉండాలి కదా… కానీ ఇద్దరూ సేమ్ లుక్కు… దర్శకుడి గందరగోళం… అన్నట్టు, సినిమాలో హనీ రోజ్ అని మరో నటి కూడా ఉంది…
రమ్యకృష్ణకు సూటయ్యే కొన్ని పాత్రలుంటాయి… ఇకపై ఆమెను మరిచిపొండి, ఇప్పుడు వరలక్ష్మి ఆ ప్లేస్ ఆక్రమించేసింది… ఇందులో కూాడా బాలకృష్ణ సోదరి పాత్ర అలాంటిదే… వంక పెట్టడానికి వీల్లేకుండా నటించింది ఆమె… క్రాక్ సినిమాలో ఆమెకు దక్కిన పాత్రవంటిదే ఇది కూడా… ఇంకా సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు… సంక్రాంతి జోరు, ఆ కోలాహలాన్ని సొమ్ము చేసుకునే సినిమా పోకడ, పక్కా మాస్ తరహా ధోరణి… ఏమాత్రం కొత్తదనం కనిపించని సినిమా… తన నటనకు ఏమీ ఢోకా లేదు… అలవోకగా, మంచి నీళ్లు తాగినంత సులభంగా చేసుకుంటూ పోయాడు… మొత్తానికి అఖండ తరువాత బాలకృష్ణ నుంచి మరో భిన్నమైన పాత్రను ఊహించే వాళ్లకు బాగా నిరాశ… ఇక బాలయ్య ఇంతేలే అనుకునేవాళ్లకు మరో రొటీన్ బాలయ్య మార్క్ సినిమా… శుభం…
అవునూ… పెద్ద బాలయ్యకు మొదటి నుంచీ ఒకే నలుపు డ్రెస్సా..? ఎవరికి నిరసన అది బాలయ్యా… పైగా ఈ బట్టలకు తగినట్టు చివరకు లక్ష్మినర్సింహస్వామి విగ్రహానికి కూడా నలుపు రంగు పులమడం ఏమిటో… ఇంకా మన సినిమా పైత్యాన్ని ఏ లెవల్‌కు తీసుకుపోతారో…!!
Share this Article