Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ ఎందుకో అర్థం కావాలంటే… ఇది చదవాలి…

January 12, 2023 by M S R


నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం మిక్కిలి ముదావహం… ఇంకేదో పాటకు రావడం వేరు, కానీ నాటునాటు పాటకే రావడం మరీ మీదిమిక్కిలి ముదావహం… కొంతమందికి నచ్చకపోవచ్చుగాక, కానీ ఎందుకు ఆ పాటకు అంత విశిష్టత తెలియకపోవడం వల్ల వచ్చిన దురవగాహన తప్ప మరేమీ కాదు… ఆ పాట విలువ తెలియాలి… తెలిస్తే కళ్లు చెమరుస్తాయి… గోల్డెన్ గ్లోబ్ ఆ పాటకు తప్ప మరే పాటకూ రావడానికి వీల్లేదని అప్పుడు అర్థం చేసుకోగలరు… ట్విట్టర్‌లో పవన్ సంతోష్ రాసిన థ్రెడ్ మాత్రం బాగుంది మిత్రమా… కీపిటప్…


….. (Pavan Santhosh) @santhoo9

సినిమా పాటల గురించి, వాటి గొప్పదనం మనకు ఏళ్ళ తరబడి ఉన్న ఆలోచనలను ఈ పాటకు పురస్కారం రావడం సవాలు చేస్తుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి కొత్త చూపు అవసరం. మొదట – ఈ పాట ప్రత్యేకత ఏమిటో చెప్పుకుందాం. తర్వాత – ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతవరకూ సబబు అన్నదీ చూద్దాం.

Ads

Image

“నాటు నాటు” పాట ఒక స్థాయిలో చూస్తే “శివ శంకరీ” (జగదేకవీరుని కథ – 1961), “తకిట తథిమి” (సాగర సంగమం – 1983) వంటి వాటికి సరి సమానమైనది. ముఖ్యంగా ఈ పోలిక దర్శకుల ఇమేజినేషన్, ఎగ్జిక్యూషన్, అవి ప్రేక్షకుల్లో కలిగించే స్పందన అన్న అంశాల్లో ఒప్పుతుంది.

Image

దర్శకుల రూపకల్పన చేసిన పద్ధతి చూస్తే – ఈ పాటలు స్పష్టంగా 3-యాక్ట్ స్ట్రక్చర్లో ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో ప్రాచుర్యంలో ఉన్న 3-యాక్ట్ స్ట్రక్చర్‌లో పాటలు రాయడం వల్ల వీటికొక ప్రత్యేకత ఏర్పడింది. దర్శకులు కావాలనుకున్న ఎఫెక్ట్ రావడానికి వీలు పెరిగింది. మీకు తెలిసి ఉండొచ్చు. కానీ 3 యాక్ట్ స్ట్రక్చర్ క్లుప్తంగా – 3 యాక్ట్ స్ట్రక్చర్ సినిమాని 3 యాక్ట్స్‌గా విభజిస్తుంది. 1వ యాక్ట్ – Set up. ప్రోటాగనిస్ట్‌కి ఒక సమస్య ఏర్పడడం, ఒక లక్ష్యం ఏర్పడడం ఇందులోనే. పాత్రల నుంచి కథా ప్రపంచం వరకూ పరిచయం. మన సినిమాల్లో మొదటి 30-35 ని.ల దాకా.

Image
2వ యాక్ట్‌లో – సినిమాకు సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ జరుగుతాయి. హీరో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడం, తదితర విషయాలు ఇక్కడ జరుగుతాయి. హీరో యత్నాలు, ఎదురయ్యే విషయాలు ప్రేక్షకులను అలరిస్తాయి. మన సినిమాల్లో 30 నిమిషాల నుంచి, ఇంటర్వెల్, తర్వాత మరో అరగంట ఇక్కడే గడుస్తుంది. యాక్ట్ 3- the resolution ఇక విజయం పొందే అవకాశం లేదన్న స్థాయికి యాంటీ క్లైమాక్స్ తీసుకెళ్ళడం, దాన్నుంచి విజయానికి లాక్కుపోవడం – ఇలా క్లైమాక్స్ దిశగా తీసుకెళ్తుందట యాక్ట్ 3. ఇది simplification. లోపాలు ఉండొచ్చు. అయితే, మనం మన నాటు నాటు పాట విషయం మాట్లాడుకోవడానికి ఈ బండ వివరణ చాలు.
Image
ఇలాంటి ఒక 3-యాక్ట్ స్ట్రక్చర్‌తో ఈ పాట ఉంటుంది. అది కూడా పాట నేపథ్యం ఏమిటి? దాదాపు సినిమా నేపథ్యమే దీనిది కూడాను. ఒక జానపద వీరగాథ లాంటి థీమ్స్ రెంటివీ. ఈ పాటకు 3 యాక్ట్స్ ఇలా ఉంటాయి: రామ్, భీమ్‌లను జాతి వివక్షతో ఒక తెల్లవాడు అవమానించి, డ్యాన్స్‌కి వచ్చే అర్హత ఉందా అని రెచ్చగొట్టి, మీకు డ్యాన్స్ తెలుసా అని మొదలుపెడతాడు. ఇలాంటి ఒక అవమానాన్ని ఎదుర్కోవడం లక్ష్యం. ఆ ఎదుర్కోవడానికి డ్యాన్సే మార్గం.

Image

రెండవ యాక్ట్ రూపంలో “నాటు నాటు” పాట వస్తుంది. దుమ్మురేపే డ్యాన్సుతో, కాలు నిలవనివ్వని ట్యూనుతో ప్రేక్షకులను లీనం చేసుకుంటుంది. ఇక్కడ రెండవ యాక్టు ద్వారా ప్రేక్షకులను ఎంతగా రంజింపజేయాలో అంతా చేశారు ఆ పాట బీటు ద్వారా, నాటు డ్యాన్సు ద్వారా.

Image

ఇక 3వ యాక్ట్‌లో సరదా డోసు పెరుగుతుంది. britisherని ఓడించడం అన్నది సాధించడమే కాదు అది చిన్నదై లక్ష్యం మారిపోతుంది. హీరోలిద్దరిలో ఎవరు గెలుస్తారన్న పోటీగా తయారవుతుంది. చివరకు జెన్నీ మనసును భీమ్ గెలవాలని రామ్ తనంత తాను ఓడిపోవడంగా ముగుస్తుంది. తెరపైనా, ఎదుట అందరి మనసులు గెలుస్తారు.

Image
అలా ఇది “కేవలం” ఒక పాట కాదు. ఐదు నిమిషాల్లో సాగే ఒక పూర్తి నిడివి కథనం. ఈ కథనం రక్తి కట్టడానికి దర్శకుడు, రచయిత రాసుకున్న ఊహా సౌధం ఒక్కటీ సరిపోదు. దానికి రక్తమాంసాలిచ్చేవాళ్ళు కావాలి. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అవసరం. అప్పుడే తెరమీదికి సాంకేతిక నిపుణులు, నటీనటులు వస్తారు.
Image
ఆ ఎగ్జిక్యూషన్ గురించి చెప్పుకోవడానికి ముందు మళ్ళీ నేను చేసిన పోలిక సంగతి చూద్దాం. నేను పైన రెండు పాటలు ప్రస్తావించాను కదా – “శివశంకరీ”, “తకిట తథిమి”. ఈ రెండు పాటలు కూడా ఇలానే పూర్తి నిడివి కథలు చెప్తాయి. వీటి రెంటికీ సినిమాకి వర్తించే స్క్రీన్‌ప్లే సూత్రాలు స్థూలంగా వర్తిస్తాయి.
Image
“శివశంకరీ” పాటలో ప్రతాప్ (ఎన్టీఆర్) ఒక శిలను కరిగితే కానీ ఒక ముని అందులోంచి శాపవిముక్తుడు కాడు, అది సాధించాలంటే శిలలు కరిగేలా పాటపాడాలి. హీరోకి అప్పటికే ఉన్న వరాన్ని ఉపయోగించుకుని ఒక్కడే ఐదుగురిగా మారి పాట పాడతాడు. శిల కరుగుతుంది. తకిట తథిమి పాటలో చెప్పే కథ వేరు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ని నేను “మాస్టర్ ఆఫ్‌ డ్రామా” అంటాను. ఆయన డ్రామాని రూపకల్పన చేయడంలోనూ, పండించడంలోనూ వేరే స్థాయిలోని దర్శకుడు. తాగుబోతుగా మారిన నాట్యాచార్యుడు hero, హీరోయిన్‌ తన భర్త పోయిన విషయం తెలియకుండా ఉంటుంది కదా. ఇది ప్రిమైస్.

హీరో పూర్తిగా తాగేసి హోరుమన్న వానలో బావి మీద నాట్యం చేస్తూంటాడు. పనివాడు ఎంత చెప్పినా వినడు. ఆమె ఎదురైతే బొట్టులేదన్నది తెలుస్తుంది. అలాగని ఊరుకోలేదు. అతను నాట్యం చేస్తూండడం సాగుతూ పరిస్థితి క్షణక్షణంలో ముదురుతూ ఉంటుంది. ఆమె ఏం చేసిందన్నది రిజల్యూషన్.

మూడు పాటల్లో కథ వేరు. రాబట్టాలనుకున్న ఎమోషన్ వేరు. అందువల్ల వాళ్ళది రాబట్టేందుకు చేసినవి వేరు. – కె.వి.రెడ్డి తన పాటని రక్తి కట్టించడానికి సంగీతాన్ని ఎంచుకున్నారు ఘంటసాల ఆ పాటకు హీరో. పెండ్యాల సంగీతమూ అద్భుతం. NTR, పింగళి సాయపడ్డారు. సినీ చరిత్రలో ఆ గానం అజరామరం.

Image

కె. విశ్వనాథ్ ప్రధానంగా స్క్రీన్‌ప్లే రచనా బలాన్ని నమ్ముకుని, ఆపైన సంగీతం-సాహిత్యం-నటన-నాట్యం అన్న స్తంభాలపై దాన్ని నిలబెట్టారు. ఇందులో వేటూరి, ఇళయరాజా, కమల్, జయప్రద ఒకరితో ఒకరు పోటీడ్డారు.

Image

“నాటు నాటు” పాట విషయంలో దర్శకుడు ssrajamouli కి తాను పాట ద్వారా చెప్పే కథ రక్తి కట్టించడానికి ఒక బ్రహ్మాండమైన డ్యాన్స్ కావాలి, ఆ డ్యాన్స్‌ని సమర్థించగలిగే ఉత్సాహకరమైన పాట కావాలి. ప్రేమ్‌రక్షిత్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ, దానికి అంతే పర్ఫెక్ట్‌గా @tarak9999  &

@AlwaysRamCharan చేసిన డ్యాన్స్, దీనికి సరిగ్గా అమరే సంగీతాన్ని సమకూర్చిన @mmkeeravaani , తూకంగా రాసిన @boselyricist , పాడిన
@Rahulsipligunj @kaalabhairava7 – పాటలో చెప్పదలచిన కథకు ప్రాణం పోశారు.
Image
సినిమా పాట సంగీతపరంగానో, సాహిత్యపరంగానో, రెంటిలోనో అత్యద్భుతంగా ఉంటే తప్ప గొప్ప పాట అవ్వదని నమ్ముతున్నారని చాలామంది చేసిన విమర్శలు చూశాకా నాకు తోచింది. కానీ, దర్శకుడు తాను చెప్పదలచుకున్నది చెప్పి, రంజింపజేయడానికి ఏది ఎంత అవసరమో అంతవరకూ వాడుకోవాలి. అదే ఈ మూడు పాటల్లో జరిగింది.
Image
ఇదంతా సినిమా థియేటర్‌లో సంతోషంతో గంతులు వేస్తున్న ప్రేక్షకులకు తెలిసే చేస్తారా? అంటే అలా చెయ్యరు. కానీ, వాళ్ళను విజిల్స్ వేయించిన ఈ పాట వెనుక ఇలాంటి స్ట్రక్చర్ ఉందనీ, ఇంత ప్రణాళిక, కృషి ఉందనీ గమనించడం, తెలియజేయడం విమర్శకులకు శోభస్కరం.
Image

చివరగా ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడం సబబా? బేసబబా? అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. ఆ పని మీకే వదిలేస్తున్నాను. బైదవే – మీరేం సమాధానం చెప్పుకున్నా అది మీ ఇష్టం. నా అభిప్రాయమైతే నూటికి నూరుపాళ్ళూ ఈ పాట అర్హమైనదే అని. #NaatuNaatuForOscars #RRRGoesGlobal

Image

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions