తొక్కలో ఫైట్లు, స్టెప్పుల ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా సినిమాలు ఎవడైనా తీస్తాడు… ఒక కొత్త కథకు ప్రాణం పోస్తే, ఆల్‌రెడీ తెలిసిన కథకు కొత్తదనం అద్దితే, ప్రేక్షకుల బుర్రల్లో మథనం సాగిస్తే అదీ గొప్పదనం… 66 ఏళ్ల వయస్సులోనూ రాజకుమార్ సంతోషికి అలసట రాలేదు… జనంలోకి చర్చను వదిలే కథల్ని భలే రాస్తాడు… చక్కగా తీస్తాడు… నటీనటులను తనకు కావల్సిన రిజల్ట్ వచ్చేదాకా పిండుతాడు… అలాగని ఒక సైడ్ తీసుకోడు… రెండు బలమైన పరస్పర విరుద్ధ వాదనల్ని అంతకన్నా బలంగా ప్రజెంట్ చేస్తాడు… ఏ సైడ్ తీసుకోవాలో, అసలు తీసుకోవాలో వద్దో ప్రేక్షకుడి ఇష్టం…
అలాంటిదే సినిమా గాంధీ వర్సెస్ గాడ్సే… బయోపిక్ కాదు, రియాలిటీ కాదు… కల్పన… గాడ్సే కాల్పుల్లో గాంధీ చనిపోడు… గాడ్సేను కలుసుకుంటాడు… ఇద్దరి వాదనలూ బలమైనవే… సంఘర్షిస్తాయి… గాడ్సేలోని ఆవేశాన్ని, గాంధీలోని ఆదర్శాన్ని ప్రభావవంతంగా ప్రజెంట్ చేస్తాడు దర్శకుడు… అలాగని ఇదేమీ డాక్యుమెంటరీ కాదు… కథే… ఒక కల్పన… ట్రెయిలరే ఇంతగా ఆలోచింపజేస్తున్నదంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే… నటీనటులు కూడా ఆ పాత్రల్లో ఒదిగిపోయినట్టు కనిపిస్తోంది…
రెండు బట్టపేలికలు మరేమీ లేని దీపిక పడుకోన్ బరిబాతలతనం… వెగటు పుట్టించే థర్డ్ క్లాస్ సినిమా ఫీట్లతో షారూక్ వీరంగాలు… దీపిక మూవ్‌మెంట్స్ చూస్తుంటే ప్రొఫెషనల్ వ్యాంప్స్ కూడా అలా చేయరేమో అన్నట్టుగా…! ఆ పఠాన్ వంటి చిల్లరతనంకన్నా ఇలాంటి గాంధీ-గాడ్సీ చిత్రాలు ఎంత నయం..? హిందుత్వకు గాడ్సే వెర్షన్ వేరు, గాంధీ వెర్షన్ వేరు… ఒక చర్చను జనంలోకి వదులుతాడు ఆ దర్శకుడు… అశ్లీలాన్ని నెత్తిన మోస్తూ, దీపికను బట్టలు విప్పి చూపిస్తూ, కంపరాన్ని సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తాడు మరో దర్శకుడు… అందుకే పఠాన్ల వేషాలు పగిలిపోయి, గాంధీ-గాడ్సేలు బలంగా థియేటర్లకు వస్తే అర్థవంతమైన సినిమాలు ఇంకా వస్తాయి…
Ads
అనేక వివాదాలు, అనేక విమర్శలు… కానీ ది కశ్మీరీ ఫైల్స్ ఒక ఇష్యూను బలంగా ప్రజెంట్ చేయగలిగింది… జనంలోకి ఒక విషయాన్ని బలంగా తీసుకుపోగలిగింది… చర్చ జరగనివ్వండి… తప్పేముంది..? కాషాయవాదానికి గాడ్సే హీరో అయితే గాంధీ చెప్పిన ఆదర్శం నష్టదాయకంగా కనిపిస్తోంది… హిందుత్వం మీద సమాజంలో చర్చ జరుగుతోంది… సో గాంధీ వర్సెస్ గాడ్సే వంటి సబ్జెక్టులు రానివ్వండి, తప్పేముంది..? కాకపోతే కత్తిమీద సాము, లేని ఉద్రిక్తతలు పెంచకుండా, ఆరోగ్యకరమైన చర్చకు ఆస్కారమివ్వాలి…
లేదంటే దృశ్యం… ఈ సినిమాలో ఓ క్రైమ్ స్టోరీ ఉత్కంఠ సడలని కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది… అందులో హీరో చేసింది చట్టరీత్యా సమర్థనీయమా కాదా పక్కన పెడితే అడుగడుగునా ఓ శక్తివంతమైన ఎమోషన్ మనల్ని సీటుకు కట్టేసి మరీ చూపిస్తుంది సినిమాను… ఒక ఊంచాయి సినిమా అలౌకికమైన నాన్ కమర్షియల్ బంధాలంటే ఏమిటో చెబుతుంది… ముసలి వయస్సులోనూ జీవితం మీద ప్రేమను పెంచుతుంది… ఆశల్ని రేకెత్తిస్తుంది… ఒక కాంతార సినిమా అసలు నటన అంటే ఏమిటో కళ్లముందు ఉంచుతుంది… అసలైన ప్రాంతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ఏమిటో, ఆ జనం విశ్వాసాలు ఏమిటో ఆవిష్కరిస్తుంది… ఇలాంటి కథలు, ఎన్నో ఉండగా… ఈ క్షుద్రమైన పఠాన్లు మనకేల..?!
Share this Article