మొన్న మనం ఓ సంగతి ముచ్చటించుకున్నాం… కూల్ డ్రింక్‌లో అడ్డగోలుగా కెఫీన్ ఉంటుంది… అది నిజానికి పిల్లలకు, గర్భిణులకు మంచిది కాదు… మోతాదు పెరిగితే, ఎవరికీ మంచిది కాదు… కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా పెద్ద ప్రకటన ఇచ్చి, దిగువన ఎక్కడో కనీకనిపించని రీతిలో చిన్న డిస్‌క్లెయిమర్ ఇస్తారు… ఎక్కువ కెఫీన్ మంచిది కాదు అని..! ఇలాంటివి వినియోగదారులను తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు బోలెడు… ఏటా వేల కోట్ల దందా… ఉదాహరణకు పాన్ మసాలా పేరిట గుట్కాలకు సరోగసీ యాడ్స్… మినరల్ వాటర్, సోడాల పేరిట మద్యం యాడ్స్…
ప్రింట్ మీడియా, టీవీ మీడియా కనీసం ఇలాంటి విషయాల్లో ఈమాత్రం దొంగచాటు జాగ్రత్తనైనా పాటిస్తున్నాయి… కానీ డిజిటల్ మీడియాకు ఆ కట్టుబాటు కూడా లేదు… ఉదాహరణకు ఓ సెలబ్రిటీ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఏదో ఒక బ్రాండ్ ఉత్పత్తి ఫోటో పెట్టి, తన ఫోటో పెట్టి, వావ్ అని క్యాప్షన్ పెడుతుంది… లక్షల్లో ఫాలోయర్స్ కదా, ఇది పోస్ట్ చేసినందుకు లక్షలు, కోట్లలో చార్జ్ చేస్తారు… ఇప్పుడు సెలబ్రిటీలకు అతి పెద్ద దందా ఇది… కనీసం వినియోగదారులకు ఈ ఉత్పత్తులు నష్టమా అనే సోయి కూడా కనబరచరు… డిస్‌క్లెయిమర్ల చికాకు అసలే లేదు… ఎవడి ఇష్టం వాడు…
ఇప్పుడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాలు, ఆహార మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలపై కాస్త దృష్టి పెట్టింది… సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వెల్లువలా వచ్చిపడుతున్న తప్పుదోవ ప్రకటనలకు గైడ్ లైన్స్ జారీ చేసింది… సెలబ్రిటీలు ఇష్టారాజ్యంగా ఇలాంటి ప్రకటనలు ఎండార్స్ చేస్తే ఇకపై కుదరదు… వాళ్లూ బాధ్యత వహించాల్సి ఉంటుంది… వ్యక్తిగత అభిప్రాయాల ముసుగులో ప్రమోషన్స్ చేస్తామంటే కొన్ని జాగ్రత్తలు, కట్టుదిట్టాలు తప్పనిసరి… ఈమేరకు ‘‘ఎండార్స్‌మెంట్స్ నో-హౌస్!’’ గైడ్‌ను విడుదల చేసింది…
Ads
ఒక ప్రొడక్ట్, ఒక సర్వీస్, ఒక బ్రాండ్, ఓ అనుభవం… ఏది చెబుతున్నా సరే, సదరు సెలబ్రిటీకి దానికీ నడుమ సంబంధం ఏమిటో బహిర్గతం చేయాల్సి ఉంటుంది… అంతేకాదు, సదరు పోస్టుల వల్ల తాము పొందే ఫాయిదాలు ఏమిటో కూడా చెప్పాల్సి ఉంటుంది… డబ్బు మాత్రమే కాదు… బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీలు ట్రిప్పులు, హోటల్ స్టేలు, కానుకలు, ఇతర ప్రయోజనాలను పొందుతూ ఉంటారు… సో, సరళమైన భాషలో అడ్వర్టయిజ్‌మెంట్, పెయిడ్ ప్రమోషన్, స్పాన్సర్డ్ వంటి డిస్‌క్లెయిమర్లను కూడా స్పష్టంగా సూచించాలి… ఓ ఇంపార్టెంట్ క్లాజ్ ఒకటి ఉంది…
ఏ ఉత్పత్తి గురించి ఎలాంటి పోస్టులు పెడుతున్నా సరే, ఆ ఉత్పత్తిని తాము వాడుతూ ఉండాలి, తమకు వ్యక్తిగతంగా ఆ ప్రొడక్ట్‌తో అనుభవం ఉండాలి… ఇది ఆచరణలో కొంత కష్టమే… ఉదాహరణకు, ఫలానా టాయిలెట్ క్లీనర్‌తో క్రిములన్నీ పరార్ అని ఓ పోస్టు పెట్టారనుకొండి… ఆ సెలబ్రిటీ తన టాయిలెట్‌లో దాన్ని వాడుతున్నాడా లేదా ఎవడు చూడొచ్చాడు… ఫలానా సెంటర్‌లో కేన్సర్ చికిత్సకు మంచి వైద్యసదుపాయం అని పోస్ట్ చేశారనుకొండి… వ్యక్తగత అనుభవం ఏముంటుంది..?
ఇలాంటి సందిగ్దతలు, ఆచరణ క్లిష్టతలు కొన్ని ఉన్నా సరే… స్థూలంగా ఈ కట్టుదిట్టాలు మంచివే… అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌ను నిజానికి చాలా కఠినంగా అణిచివేయాలి… ప్రత్యేకించి అక్షరాస్యత తక్కువగా ఉన్న మన దేశంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం చాలా ఈజీ అయిపోయింది కంపెనీలకు… అబద్ధాల్నే ప్రచారం చేస్తున్నాయి… సో, ఇలాంటి ఏదో ఒక ముకుతాడు అవసరమే… సెలబ్రిటీలు కూడా తప్పుడు ప్రకటనలకు బాధ్యత వహించాల్సిందే… వాడెవడో డబ్బు ఇచ్చాడు, నేను ఎండార్స్ చేశాను, నా తప్పేముంది అంటే కుదరదు…
Share this Article