రాష్ట్రాలు కొత్తగా ఏ పన్నులూ వేయడానికి వీల్లేదు… ప్రతిదీ జీఎస్టీలో కవరైపోతుంది… రాష్ట్రాలు సొంతంగా వేయదగిన పొగాకు, మద్యం ఉత్పత్తులు ప్లస్ పెట్రో ఉత్పత్తులు ఇప్పటికే మండిపోతున్నాయి… పైగా మద్యం మీద ఎప్పటిప్పుడు బట్జెట్‌కు సంబంధం లేకుండా పెంచుతూనే ఉన్నారు… పొగాకు వినియోగం తగ్గుతున్న దిశలో ఇంకా పన్నుల మోత మోగించలేరు…
పెట్రో మీద పొరుగు రాష్ట్రాల్లోకన్నా ఇప్పటికే మన మోతలు, వాతలు ఎక్కువ… ఇంకా పెంచితే సగటు మనిషి మరింత దరిద్రంలోకి కూరుకుపోయే స్థితి… కరోనా ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్‌లో ప్రతి వస్తువు ధర డబుల్… సగటు జీవనవ్యయం డబుల్… ప్రధాన కారణం పెట్రో ధరలు… వాటి ప్రభావం మనిషి నిత్యజీవనానికి సంబంధించిన ప్రతి సరుకుపై పడుతోంది… ఇక రాష్ట్రాల బడ్జెట్‌లో పన్నులు అనే కాన్సెప్టే కనిపించదు…
పోనీ, ప్రయారిటీలు, ఖర్చుల తీరు, అప్పుల వివరణల కోసమే బడ్జెట్ అనుకుందామా..? ప్రయారిటీలు బడ్జెట్‌లో చెప్పేదొకటి, వాస్తవ ప్రయారిటీలు వేరే… అసలు బడ్జెట్‌లో శాఖల వారీ పద్దులు రాసుకోవడమే గానీ ఎప్పుడూ వాటికి అనుగుణంగా కేటాయింపులూ ఉండవ్, ఖర్చులూ ఉండవ్… ఏ బడ్జెట్ అకౌంటెడ్ / ఆడిటెడ్ వివరాలు చూసినా ఇది స్పష్టంగా తెలుస్తుంది… అప్పులు బడ్జెట్‌లో చూపినదానికన్నా ఎక్కువే తీసుకొస్తారు… కమీషన్ల ప్రాజెక్టులకు ఖర్చులు పెరుగుతాయి…
Ads
వెరసి, రాష్ట్రాల బడ్జెట్లకు విలువ స్థూలంగా సున్నా… ఇక దీనికి గవర్నర్ల ప్రసంగాలు, వాటికి అడ్డుపుల్లలు, అభ్యంతరాలు, కోర్టుల్లో కేసులు, రాజీలు ఎట్సెట్రా వివాదాలకు నిజంగా జనజీవితంలో ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు… ష్, ఎందరు ప్రజాప్రతినిధులకు బడ్జెట్ లెక్కలు అర్థం అవుతాయి..? ఎవరు వాటిని చదువుతారు..? ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం తేడా ఏమిటి..? ఎందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలుసు వీటి తేడాలు… అసలు బడ్జెట్ ప్రసంగాలు కూడా చదవరు చాలామంది…
ప్రజాస్వామికంగా ఇది తప్పనిసరి లాంఛనం కాబట్టి బడ్జెట్లు ప్రవేశపెట్టబడతాయి… వాటి ఆమోదం లేకపోతే ఖజానా నుంచి డబ్బులు డ్రా చేయలేరు కాబట్టి… అంతకుమించి బడ్జెట్లకు విలువ ఏమీ లేదు… నిజానికి ఒకప్పుడు కేంద్ర బడ్జెట్‌కు విశేష ప్రాధాన్యం ఉండేది… సీజీఎస్టీ వచ్చాక అది చేసేదేమీ లేదు… దాని పరిధిలోని ఏ పన్ను స్లాబయినా సరే జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేయాల్సిందే… కాకపోతే సెంట్రల్ ఎక్సయిజ్, కస్టమ్స్, కార్పొరేట్ టాక్స్, ఐటీ స్లాబులు వంటివి కొన్ని ఇంకా కేంద్రం పరిధిలోనే ఉన్నాయి… అందుకే ఈమాత్రం కాస్త ఆసక్తి… 7 లక్షల ఆదాయానికి IT మినహాయింపు అని చెబితే అది బాగా కనెక్ట్ అవుతుంది… అది కోట్ల మందికి డైరెక్ట్ ఇంపాక్ట్ కాబట్టి…
నిజానికి బడ్జెట్ అంటే… రాబోయే ఏడాదికి రఫ్‌గా మన ఆదాయం, వ్యయాల అంచనాలు… మన అవసరాలు, వాటికి సరిపడా నిధుల సమీకరణ… అంతే… దాన్ని బట్టే నిధుల ఖర్చు ఉండాలని ఏమీ లేదు… ఉజ్జాయింపులు రాబోయే ఏడాదికి సంబంధించిన చిట్టా పద్దులకు మరి ఎందుకింత ఆసక్తి..? ఏమీలేదు… గతంలో సరుకులవారీగా పన్ను హెచ్చింపులు, తగ్గింపులు ఉండేవి కాబట్టి సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగాలను జనం వినేవాళ్లు… ఇప్పుడేముంది..? ఏమీ లేదు… బడ్జెట్‌కు సంబంధం లేకుండానే బాదుతున్నారు కదా…!!
మీడియాలో కూడా ఎవరూ బడ్జెట్ స్థూలాంశాలకు జోలికి పోరు… వాళ్లకూ అర్థం కాదు… ఏవో నాలుగు అంకెలు ఇటూఅటూ కూడి, తీసేసి, మాయ చేసి మమ అనిపించేస్తారు… వివిధ రంగాలకు కేటాయింపులు అని ఏవో రాస్తారు, చూపిస్తారు… ప్రణాళిక, నాన్-ప్రణాళిక వేర్వేరు ఉంటాయి… ఆడిటెడ్, రివైజ్డ్, కరెంటు బడ్జెట్లు వేరువేరు…
అందుకే ఆర్థిక మంత్రి ఏం చీర కట్టింది, రాష్ట్రాల బడ్జెట్ అయితే మంత్రి ప్రసంగం మధ్యలో ఎన్నిసార్లు నీళ్లు తాగాడు, ప్రతిపక్షాలు ఏం కేకలు వేశాయి, ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఎన్ని శ్లోకాలున్నాయి రాస్తారు… కానీ మంత్రి ప్రజల్ని ఎన్ని చెరువుల నీళ్లు తాగించడానికి ప్రయత్నిస్తున్నాడో రాయరు, అర్థమైతే కదా… శ్లోకాలు తప్ప జనం శోకాలు పట్టవు… ఏ ప్రతిపక్షం వాడినైనా కదిలించండి… ‘కొత్త సీసాలో పాత సారా’ అంటాడు… అధికార పక్షం వాడిని అడగండి… ‘ప్రగతి శీలక బడ్జెట్’ అంటాడు… అంతకుమించి బడ్జెట్ వార్తల కవరేజీ ఏమీ ఉండదు… ఉండదు…!! బడ్జెట్ పద్దులపై చర్చలు దాన్ని గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ..!!
Share this Article