ఎప్పటి నుంచో చాయ్ బిస్కెట్ వెబ్ ఫీల్డులో ఉంది… డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు అనాలేమో… సరే, సుహాస్ అక్కడే ఎదిగాడు… చాయ్ బిస్కెట్ వాళ్లే సుహాస్ హీరోగా ఓ సినిమా తీశారు… రొటీన్‌గా కనిపించే ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా కథ గాకుండా ఓ భిన్నమైన కథ… సుహాస్ ఇంతకుముందు కలర్ ఫోటోలో యాక్ట్ చేశాడు కానీ అది ఓటీటీ సరుకు అయిపోయింది… ఇప్పుడు రైటర్ పద్మభూషణ్…
ఈ సినిమా కాస్త నచ్చుతుంది… ఎందుకంటే… తెలుగు సినిమా తాలూకు చెత్తా లక్షణాలకు దూరంగా ఉంది… అశ్లీలం లేదు, యాక్షన్ల సీన్ల పేరిట నరుకుళ్లు లేవు, కాల్పుల మోతల్లేవు… రొమాన్స్ పేరిట వెగటుతనాన్ని ఆశ్రయించలేదు… కథనంలో అంతర్లీనంగా కాస్త హాస్యాన్ని, అదీ మధ్యతరగతి మందహాసాన్ని నమ్ముకున్నాడు దర్శకుడు… పద్ధతిగా తీయబడిన ఓ సంసారపక్షం సినిమా…
హీరో పేరు పద్మభూషణ్… విజయవాడ కుర్రాడు… ఏదో ఒకటి రాయాలనే తపన… పుస్తకం అచ్చేసి పాపులర్ అయిపోవాలని ఆశ… అక్కడిక్కడా అప్పులు చేసి ‘తొలి అడుగు’ అనే పుస్తకం ఒకటి అచ్చేస్తాడు… వర్తమానంలో రచయితల కష్టాలు తెలుసు కదా… అడ్డగోలు ముద్రణవ్యయం… సెల్లర్స్‌కు ఎడాపెడా కమీషన్లు… ఐనా సరే రీడర్ దొరకడు… పుస్తకాల్ని సొంతంగా అమ్ముకోవడానికి నానా కష్టాలూ పడాలి… రద్దీ పేపర్లవాడికి అమ్ముకోలేక, ఇంట్లో ఉంచుకుని వాటిని చూస్తూ ఏడవలేక… రచయితల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు…
Ads
పద్మభూషణ్ ఎన్ని వేషాలు వేసినా పుస్తకాలు అమ్ముడుపోవు… హీరోెకు మొహం చెల్లదు… ఈ పాయింట్‌లో పద్మభూషణ్ పేరిట మరొకరు ఎవరో వేరే పుస్తకాన్ని పబ్లిష్ చేస్తాడు… అదేమో సూపర్ హిట్… మంచి గుర్తింపు… ఆహా, మన భూషణే రాశాడని మెచ్చుకుని, ఎప్పట్నుంచో దూరంగా ఉండే మేనమామ లోకేంద్ర (గోపరాజు రమణ) ఏకంగా బిడ్డ సారిక (టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు… అసలు ఎవరు పద్మభూషణ్ పేరిట పుస్తకాలు పబ్లిష్ చేసేది..? కారణం ఏమిటి..? అదే కథ…
చూస్తున్నంతసేపు ఓ కాలక్షేపం… రచయితలకైతే పిచ్చిపిచ్చిగా నచ్చేసే సినిమా… కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ చాలాచోట్ల లాజిక్కులను వదిలేసినా సరే, ఎవరీ పద్మభూషణ్ రైటర్ అనే సస్పెన్స్‌ను అలాగే చివరిదాకా కొనసాగించడంలో సక్సెస్… అలాగే మధ్య తరగతి లైఫులను కూడా నవ్వొచ్చేలా, లోలోన మనమే మనల్ని చూసుకునేలా చిత్రీకరిస్తూ పోయాడు…
పద్మభూషణ్ పేరిట వచ్చే పుస్తకాలన్నీ తనవే అని చెప్పుకునే హీరో, తరువాత గిల్టీగా ఫీలవడం కథానుసారం చూడబుల్… లవ్ ట్రాక్ కూడా వోకే… హీరో కేరక్టరైజేషన్ కూడా మనలో ఒక మనిషే అన్నట్టుగా ఉంటుంది… సూపర్ హీరోయిజం జోలికి తీసుకుపోలేదు దర్శకుడు… అయితే కన్నా పాత్ర తెరమీదకు రావడం, దాని కేరక్టరైజేషన్ అంత కనెక్టింగ్‌గా ఉండదు… అన్నింటికీ మించి సినిమా అనేది చాయ్ బిస్కెట్ సైట్ కాదు… యూట్యూబ్ స్టోరీ కాదు… దృశ్యమాధ్యమం… దృశ్యాల్ని ఓ బలమైన కథతో అనుసంధానించి ప్రజెంట్ చేయడం…
అంటే సీన్లే ప్రేక్షకుల్ని కనెక్ట్ కావాలి… అంతేతప్ప పెద్ద పెద్ద స్పీచులు కావు… సినిమా క్లైమాక్సులో ప్రవచనాలు దండిగా ఉండి విసుగెత్తిస్తాయి… సినిమా చివరి గంట లేదా అరగంట సినిమాకు ప్రాణం… అక్కడ బలమైన సీన్లు పడాలి… స్పీచులు దంచితే ప్రేక్షకుడికి నచ్చదు… ఈ రైటర్ పద్మభూషణ్ ఈ బేసిక్ పాయింట్ మరిచిపోయాడు… సుహాస్ నటన వోకే… ఆ పాత్రకు తను సరిపోయాడు… హీరోయిన్ టీనా శిల్పరాజ్ సోసో… రోహిణి పాత్ర కీలకం… సరస్వతిగా ఆమె నటనకు వంకపెట్టడానికి ఏముంటుంది… సినిమాకు బలం ఆ పాత్ర, రోహిణి ప్రజెన్సే…
చివరగా :: ఏదో కథ కాబట్టి వోకే… కానీ నిజజీవితంలో రైటర్లకు మునుపు ఉన్న పాపులారిటీ ఉందా ఇప్పుడు..? లైబ్రరీలో కొలువు చేసే హీరో, పెద్ద రైటర్ అయిపోవాలని కలగనడం, దానికి మురిసిపోయిన మామ పిల్లనివ్వడం అన్నీ అసహజంగా అనిపిస్తాయి… అతకని కారణాలు ఏవో చెప్పినా సరే… ఐనా హెయిర్ సెలూన్లలో పుస్తకాలు, మ్యాగజైన్స్ కనిపిస్తున్నాయా ఇప్పుడు..? అప్పుడెప్పుడో 1990 ప్రాంతంలో కనిపించేవి… ఇలాంటి మథనాల జోలికి వెళ్లకపోతే… థియేటర్ సరుకు కాదు గానీ… ఓటీటీలో లేదా టీవీలో ఎంచక్కా సరదాగా చూడబుల్ సినిమా ఇది…
Share this Article