అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు… అంటే ఏమిటి..? పోలీసులు కొన్ని రౌండ్లు గాలిలోకి కాలుస్తారు… అధికారులు అంత్యక్రియలను పర్యవేక్షిస్తారు… అంతేకదా… ఏ కట్టెలు వాడినా, ఎవరు చితి పేర్చినా కట్టెకాలిపోతుంది…. కానీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే ప్రభుత్వం తన ప్రాశస్త్యాన్ని గుర్తించడం, వెరసి జాతి ఘనంగా వీడ్కోలు పలకడం…
మరి ఒక హరికృష్ణకన్నా విశ్వనాథ్ ఏం తక్కువ..? ఒక సత్యనారాయణకన్నా ఏం తక్కువ..? కులంలోనా..? గుణంలోనా..? పాపులారిటీలోనా..? ప్రతిభలోనా..? కట్టుతప్పని క్రమశిక్షణలోనా..? సౌశీల్యంలోనా..? సార్థకజీవనంలోనా..? హరికృష్ణ, సత్యనారాయణల అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు సమంజసమే కావచ్చుగాక, కానీ విశ్వనాథ్ ఎందుకు అనర్హుడు అయ్యాడు…? మొన్న మరణించిన జమున ఎందుకు అనర్హురాలైంది..? ఆమెకు ఏం తక్కువ..?
అసలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి ఓ ప్రాతిపదిక ఏమైనా ఉందా..? పాలకస్థానంలో ఉన్నవాళ్ల నిర్ణయమే అంతిమమా..? అసలు ప్రముఖులను ఈలోకం నుంచి పంపించడలోనూ వివక్షేనా..? అంటే పాలకుడి రాగద్వేషాలు, లెక్కలే అధికారిక లాంఛనాల్ని ఖరారు చేయాలా..? ఓకే, ఒక రామానాయుడికి ఘనంగా వీడ్కోలు… స్టూడియో, విస్తృతంగా ఆస్తులు, కొడుకు హీరో, మరో కొడుకు ఇండస్ట్రీని శాసించే సిండికేట్ మెంబర్… కాబట్టి తను విశిష్ట వ్యక్తి అయ్యాడు… కొడుకు పెద్ద వినోద వ్యాపారి, ధనిక వ్యాపారి కాబట్టి తుపాకులు గాలిలో పేలి వీడ్కోలు పలకాలి…
Ads
హరికృష్ణ ఎన్టీయార్‌కు కొడుకు… ఇద్దరు హీరోలకు తండ్రి… మాజీ సీఎంకు బావమరిది… అంతేనా..? పోనీ, వ్యక్తిగత ప్రతిభ, పదిమందికీ ఆదర్శ బతుకు విషయాల్లో విశ్వనాథ్‌కు హరికృష్ణకూ అసలు పోలిక దొరుకుతుందా..? మరి హరికృష్ణ కావల్సినవాడు ఎలా అయ్యాడు..? విశ్వనాథ్ కానివాడు ఎలా అయ్యాడు..? సేమ్, కైకాల సత్యనారాయణతో పోలిస్తే అంత తీసికట్టా విశ్వనాథుడు..? కృష్ణకు అధికారిక లాంఛనాలు అంటే వోకే… దర్శకుడు, నిర్మాత, హీరో, స్టూడియో ఓనర్… అనేకాంశాల్లో అనితర సాధ్యుడు తను… పైగా కొడుకు ప్రముఖ హీరో… ముఖ్యమంత్రి కొడుక్కి దోస్త్… అంతేకదా సార్..? కృష్ణంరాజుకు కూడా వోకే… వారసుడు పెద్ద పాన్ ఇండియా హీరో… వాళ్లందరూ వోకే, అభ్యంతరాలు అక్కర్లేదు, కానీ వీళ్లెందుకు కొరగానివారయ్యారు..? ఇదే ప్రశ్న… చివరకు తెలంగాణను పీల్చిపిప్పి చేసిన నిజాం వారసుడికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, సీఎం హాజరు..!!
పాపం జమున, పాపం విశ్వనాథ్… వాళ్లేమీ ఇన్‌ఫ్లుయెన్స్ చూపించగల వ్యక్తులు కాదాయె… ఆ మూడు కులాలకు చెందనివారు కూడా కాదు… వాళ్ల గురించి రేప్పొద్దున అడిగేవాళ్లు కూడా ఉండరు… నియమబద్ధ జీవితం గడిపిన వాళ్లు కదా… పెద్ద పెద్ద సర్కిళ్లలో ఇమడలేదు… అదేనా అధికారిక లాంఛనాలకు అనర్హత… అందుకే నిన్న విశ్వనాథ్ అంత్యక్రియలు చూశాక ఈ ఆలోచనలు తెగడం లేదు… పద్మ పురస్కారాలకు, ప్రభుత్వ అవార్డులకు పైరవీలు, సిఫారసులు గట్రా ఉంటాయని, అదొక దిక్కుమాలిన ప్రహసనం అని అందరికీ తెలుసు… చివరకు అంత్యక్రియల్లోనూ అదే దిక్కుమాలిన పక్షపాతాలు, వివక్షలా..? ప్చ్… రోజులు మరీ ఇంత చెడిపోయాయేమిటో…!!
ఐతేనేం… ప్రభుత్వానికి వివక్షలు, పక్షపాతాలు గాలికి వదిలేస్తే… పాలకుడి లెక్కలు ఏమైనా కాలిపోనీ… జాతి ఆ ఇద్దరినీ ఘనంగా స్మరించుకుంటూ వీడ్కోలు పలికింది… కోట్ల మంది తెలుగువాళ్లు స్పందించారు… మీడియా, సోషల్ మీడియా ఆ ఇద్దరికీ ఘన నివాళి అర్పించింది… ఆఫ్టరాల్ ప్రభుత్వాలు… ఆ తుపాకులు పేలకపోతేనేం… అడ్డగోలుతనం నిండిన ఆ బుర్రలు స్పందించకపోతేనేం..?
Share this Article