కృష్ణుడే చంపాడో, సత్యభామే చంపిందో గానీ… నరకాసురుడి కథ ఖతమైపోయింది… నరకాసురుడికి ఓ సైన్యాధ్యక్షుడు ఉంటాడు… పేరు ముర… తన కూతురి పేరు మౌరవి… యుద్ధవిద్యలే కాదు, సకలవిద్యా పారంగతురాలు ఆమె… ఆమె కూడా యుద్దంలో పాల్గొంటుంది… సత్యభామతో మొదట యుద్ధం చేసింది తనే… తరువాత కృష్ణుడు మురను కూడా హతమారుస్తాడు… సైన్యం కకావికలం అయిపోతుంది… ఆ స్థితిలో కృష్ణుడి మీద చంపి ప్రతీకారం తీర్చకుంటానని మౌరవి శపథం చేస్తుంది…
ఎవరీ మౌరవి అనుకుంటున్నారా..? భాగవతమే కాదు, భారతంలోనూ కనిపించే ఓ విశిష్ట పాత్ర… సహస్ర శిరచ్ఛేద చింతామణి అనే కథను చదివారా..? ఆమె కథ కూడా అలాగే ఉంటుంది దాదాపు… ఆమె అసలు పేరు అహిలావతి… ఆమెనే మౌరవి, మౌర్వి, కామకంఠిక అని కూడా అంటారు… మౌరవి శపథం అనంతరం మునులు తదితరులు ఆమెకు హితబోధ చేస్తారు… కృష్ణుడు ఎవరో కాదు, విష్ణు అవతారం, ఎలా చంపుతావు, అజ్ఞాన శపథం, వెనక్కి తీసుకో అంటూ హితవు చెబుతారు…
ఆమె కృష్ణుడి కాళ్ల మీద పడి క్షమించమని కోరుతుంది… కృష్ణుడు ఆమె తలపై చేయి ఉంచి, ఆశీర్వదించి, త్వరలో పెళ్లవుతుందనీ, కొత్త జీవితాన్ని ప్రారంభించమనీ చెప్పి ద్వారక వైపు వెళ్లిపోతాడు…
Ads
((కొన్ని జానపద కథల్లో మాత్రం అహిలావతి శివుడి మెడలో సర్పమైన వాసుకి కూతురు అనీ, నాగకన్య అయిన ఈమె ఓసారి పార్వతి శాపానికి గురవుతుందనీ ఉంటుంది… ఓసారి వాడిపోయిన, పాడైపోయిన పూలను శివుడికి సమర్పిస్తుంది ఈమె… దాంతో పార్వతి మృతభర్తను పొందుదువు గాక అని శపిస్తుంది… శకుని, దుర్యోధనుడి ద్వారా చిన్నప్పుడు భీముడు విషప్రయోగానికి గురై సరస్సులోకి విసిరేయబడతాడు తెలుసు కదా…
మునిగీ మునిగీ అహిలావతి నాగ రాజ్యాన్ని చేరతాడు… తన శాపం గుర్తొచ్చి, భీముడిని తనకు కాబోయే భర్తగా గుర్తిస్తుంది అహిలావతి… తనతో పెళ్లి జరిపించాల్సిందిగా తండ్రిని కోరుతుంది… మృతుడితో పెళ్లేమిటని ఆగ్రహించిన తండ్రి భీముడి చితి పేరుస్తాడు… అందులో దూకి అహిలావతి పెళ్లిగాకముందే సతికి పాల్పడుతుంది… దాంతో కళ్లు తెరుచుకున్న అహిలావతి తండ్రి ఇంద్రుడు ఇచ్చిన అమృతం ఇచ్చి బతికిస్తాడు ఇద్దరినీ… పైకి భీముడిని పంపించేస్తాడు గానీ అహిలావతి పెళ్లిని మాత్రం మళ్లీ వారిస్తాడు…))
నరకాసుర వధ తరువాత అహిలావతి ఎవరైతే తనను తెలివితేటల్లో, యుద్ధవిద్యల్లో ఓడిస్తారో వారిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ప్రకటిస్తుంది… ఎందరెందరో రాజకుమారులు వస్తారు, ఆమెను ఓడించలేక ఆమె చేతుల్లో హతమైపోతుంటారు… భీముడి కొడుకు ఘటోత్కచుడు ఆమె గురించి విని ఆమెను ఓడించి పెళ్లి చేసుకుంటానని బయల్దేరతాడు…
మధ్యలో కృష్ణుడు ప్రత్యక్షమై… నువ్వు ఆమెను ఓడించడం అసాధ్యం, అమె అనితరసాధ్యురాలు… నీ అవసరం రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఉంటుంది… మరి నువ్వు ఆమె చేతలో హతమైపోతే ఎలాగోయ్ అని ప్రశ్నిస్తాడు… ఘటోత్కచుడికి సగమే అర్థమై తెల్లమొహం వేస్తాడు… ‘సరే, ఆమె ఏ అంశాల్లో ప్రశ్నలు వేస్తుందో, వాటికి జవాబులు ఏమిటో నేను చెబుతాను, యుద్ధవిద్యలో ఆమెకు సరిసాటి నువ్వు, గెలిచి పెళ్లి చేసుకో, నా ఆశీస్సులు ఉంటాయి’ అని చెప్పి సహకరిస్తాడు…
అనుకున్నట్టే ఘటోత్కచుడు గెలుస్తాడు… ఆమెను పాణిగ్రహణం చేసుకుంటాడు… ఆమె తన వెంట అరణ్యరాజ్యానికి వెళ్లిపోతుంది… ఆమె కొడుకే బర్బరీకుడు… బర్బరీకుడి కథ మరింత ఆసక్తికరం, అది చాలామందికి తెలిసిందే… ఇటు ఘటోత్కచుడినీ, అటు బర్బరీకుడినీ యుద్ధానికి వెళ్లాల్సిందిగా ప్రోత్సహిస్తుంది గానీ అడ్డుచెప్పదు… కురుక్షేత్ర ప్రారంభానికి ముందే కొడుకును, యుద్ధంలో భర్తను పోగొట్టుకుంటుంది… అదీ అహిలావతి కథ… భారతాన్ని తవ్వుతూ పోతే ఇలాంటి కథలు, ఉపకథలు బోలెడు…
Share this Article