ఇదేం హెడ్డింగు..? మోడీ ఎడ్డెం అంటే కేసీయార్ తెడ్డెం అంటాడు కదా… బీజేపీకి బద్ధ వ్యతిరేకి కదా… బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దాని మంచీచెడూ ఆలోచించకుండా వ్యతిరేకించడమే అలవాటు కదా… మరి బీజేపీ ఆలోచన సరళిలో బీఆర్ఎస్ ఉండటం ఏమిటి..? మోడీ అడుగుజాడల్లో కేసీయార్ అడుగులు వేయాలని యోచించడం ఏమిటి అంటారా..? నిజమే… నిన్న దిశ అనబడే ఓ డిజిటల్ పత్రికలో ఓ వార్త వచ్చింది… నాందేడ్ మీటింగు వార్తలోనే దాన్ని కలిపేసి, టెక్స్ట్ మ్యాటర్‌లో ఎక్కడో పబ్లిష్ చేశారు… అదేమిటంటే..?
‘‘రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా జమిలి విధానం ఉండాలి… ఏదేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే మిగతా కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి… ఇప్పుడు కేంద్రం 41 శాతం ఆదాయాన్ని మాత్రమే రాష్ట్రాలకు ఇస్తోంది, దాన్ని 50 శాతానికి పెంచాలి… ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలి…’’ ఇంకాస్త వివరంగా చదువుదామని ప్రతి తెలుగు పత్రిక తిరగేస్తే ఎందులోనూ లేదు… తీరా ఆరా తీస్తే… నాందేడ్ మీటింగ్, ప్రెస్‌మీట్లలో ఇవేమీ చెప్పలేదు కానీ మీడియాకు సర్క్యులేట్ చేసిన రీఇన్వెంట్ ఇండియా అనే సంక్షిప్త డాక్యుమెంట్‌లో ఇవన్నీ ఉన్నాయి… అందులో ఎకనామికల్, కానిస్టిట్యూషనల్, జుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్, ఎలక్టోరల్ తదితర రంగాలపై చర్చ అవసరమని పేర్కొంటూ, ప్రతి విభాగంలో కొన్ని వాక్యాలను పొందుపరిచారు… అదే డాక్యుమెంట్ అట…
Ads
సరే, ఏదో రాశారు… మళ్లీ ఏమనుకున్నాడో మీటింగులో, ప్రెస్‌మీట్‌లో మాత్రం ఏమీ చెప్పలేదు, అందరూ అవే రాసుకుని, అవే పబ్లిష్ చేసేసి, ఈ డాక్యుమెంట్‌ను పక్కన పడేశారు… అదీ ఈ కీలక వ్యాఖ్య పత్రికల్లో రాకుండా పోయింది… ఎందుకు కీలకం అంటే..? పీసీసీ మాజీ అధ్యక్షుడు చెబుతున్నట్టు రాష్ట్రపతి పాలన వస్తుందా రాదా అనేది అప్రస్తుతం కానీ నిజంగా కేసీయార్ దానికి రెడీగా ఉన్నాడా అనే మరో ప్రశ్నకు ఇది ఆధారం… ఎందుకంటే..?
ఒకేసారి రాష్ట్రం, కేంద్రం… అంటే శాసనసభ, లోకసభ ఎన్నికలు ఒకేసారి జరిగితే మోడీ, బీజేపీ ప్రభావం రాష్ట్ర వోటర్లపై పడి, తనకు నష్టం జరుగుతుందనే భావనతో, దాన్ని తప్పించుకోవడానికి 4 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు గత ఎన్నికల్లో… కేసీయార్ అంచనా నిజం… 17 సీట్లకు గాను 8 సీట్లలో బీఆర్ఎస్ గెలవలేదు… బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు గెలుచుకుంది… అదే శాసనసభలో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటే కథ వేరే ఉండేది…
అప్పుడు కేంద్రంతో సఖ్యత ఉండేది కాబట్టి నడిచింది… ఈసారి గనుక ముందస్తు అన్నాడంటే కేంద్రం పడనివ్వదు… రాష్ట్రపతి పాలనకూ సై అంటుంది… అప్పుడు డబ్బు, మెటీరియల్, సాధనసంపత్తి మూవ్‌మెంట్ కుదరదు… ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం నట్లు బిగిస్తుంది… సో, కేసీయార్ అటువైపు ఆలోచించడనే అనుకున్నారు అందరూ… పైగా జమిలి అంటే శాసనసభ వోట్లపైనా మోడీ ప్రభావం ఎంతోకొంత ఉంటుంది… మరి అలాంటప్పుడు మళ్లీ జమిలి ఎన్నికలకు సై అని ఎందుకంటున్నాడు..? చర్చ జరగాలని ఎందుకు కోరుకుంటున్నాడు..?
కేంద్రం పంచి ఇచ్చే ఆదాయంలో వాటా 50 శాతానికి పెరగాలి, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని అనడం మరిన్ని అప్పులకు ఆస్కారం కోసం, మరింతగా ఆదాయం, గ్రాంట్ల కోసం… అసలే రాష్ట్రం ఆర్థిక స్థితి ఘోరంగా ఉంది… చెల్లింపుల్లో గందరగోళం ఉంది… ప్రత్యేకించి జీతాలు ఫస్ట్ తారీఖున ఇచ్చి ఎన్నాళ్లయిందో… రిటైరయితే మానిటర్ బెనిఫిట్స్ గట్రా చెల్లింపుల్లో మస్తు జాప్యం జరుగుతోంది… ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది… సో, ఆర్థికస్థితి మెరుగుపడాలంటే కేంద్రం నుంచి ఎక్కువ ఆదాయం అందాలి… అదీ ఆ సూచనల సారాంశం…
ఎటొచ్చీ జమిలి ఎన్నికల వైపు… అంటే బీజేపీ కోరుకుంటున్నట్టే… కేంద్రం ఆలోచనల సరళిలోనే కేసీయార్ కూడా ఆలోచిస్తున్న తీరు విశేషమే… దాంతో తనకొచ్చే ఫాయిదా ఏమిటి..? కొంపదీసి కేంద్రం కూడా ముందస్తుకు వెళ్లబోతోంది, సో, ఎలాగూ ఎర్లీగా వచ్చేస్తున్నారు కదా, స్వాగతిస్తే సరి అనుకుంటున్నాడా..?!
Share this Article