మహాభారతంతో పోలిస్తే రామాయణంలోని ఉపకథలు చాలా తక్కువ… వాల్మీకి స్ట్రెయిట్‌గా కథ చెప్పేస్తాడు… కాకపోతే తరువాత వచ్చిన వందలు, వేల రామాయణాల్లో ఎవరికితోచినవి వారు ప్రక్షిప్తం చేశారు… రామాయణాల్లో ఎక్కువగా చెప్పబడని పాత్రల్లో ఒకటి శంభుకుమారుడు… కంభ, రంగనాథ రామాయణాల్లో కనిపిస్తుంది ఈ పాత్ర… ఎవరో కాదు, శూర్పణఖ కొడుకు… కాస్త వివరాల్లోకి వెళ్దాం…
శూర్పణఖ రావణుడి దగ్గర పనిచేసే ఓ దానవుడు విద్యుత్ జిహ్వను ప్రేమిస్తుంది… రావణుడు అంగీకరించడు… విద్యుత్ జిహ్వను హతమార్చడానికి సంసిద్ధుడవుతాడు… మండోదరి హితవచనాలతో కోపం తగ్గించుకుని, శూర్పణఖ ప్రేమను ఆమోదిస్తాడు… పెళ్లి జరుగుతుంది… ఆ విద్యుత్ జిహ్వను రావణుడే హతమారుస్తాడు… ఆ కథ మరోసారి చెప్పుకుందాం… శూర్ఫణఖ అప్పటికే గర్భిణి… అలా పుట్టిన కొడుకు పేరే శంభుకుమారుడు…
రావణుడి ఆదేశాల మేరకు శూర్ఫణఖ దండకారణ్యం- శ్రీలంక నడుమ చక్కర్లు కొడుతూ ఉంటుంది… దండకారణ్యంలో ఖరుడు, దూషణుడు ఇతర రాక్షసగణంతో కలిసి ఉండేది… నువ్వు ఎవరినైనా ఎంచుకో, వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని రావణుడు అంతకుముందే ఆమెకు హామీ ఇస్తాడు… కాగా శంభుకుమారుడు తన తండ్రి హత్య గురించి తెలుసుకుని రావణుడిపై ఆగ్రహం పెంచుకుంటాడు… తన బలం సరిపోదు… బ్రహ్మ వరాలిచ్చేవాడు తప్ప దండించేవాడు కాదు, పైగా రావణుడు బ్రహ్మకు చుట్టం… శివుడే బోలెడు వరాలిచ్చాడు, రావణుడు శివుడికి వీరభక్తుడు… విష్ణువు పట్టించుకోవడం లేదు… అందుకని సూర్యుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు శంభుకుమారుడు…
Ads
త్రిమూర్తులకే పట్టని శంభుకుమారుడి జోలికి సూర్యుడు వెళ్లలేక ఓ మహత్తు కలిగిన ఓ ఖడ్గాన్ని పంపిస్తాడు… అది తపస్సులో ఉన్న శంభుకుమారుడి వద్దకు చేరి, సూర్యుడు పంపించాడని చెబుతుంది… సూర్యుడే నా దగ్గరకు రావాలి, నిన్ను అప్పగించాలి, అందుకే వెనక్కి వెళ్లు అని అహంతో బదులిస్తాడు రాక్షస కుమారుడు… ఈలోపు అక్కడికి లక్ష్మణుడు నివాసయోగ్యమైన ఓ ఆశ్రమం కోసం ఆ పొదలన్నీ నరికేస్తూ అక్కడికి చేరుకుంటాడు… పంచవటి అంటే అయిదు రావిచెట్లు… అక్కడున్న ఆ రావిచెట్ల నడుమ ఆశ్రమం కట్టుకుంటే కొంత రక్షణ అని భావిస్తాడు…
ఆ దివ్య ఖడ్గాన్ని గమనించిన లక్ష్మణుడు పరిశీలించడానికి చేతిలోకి తీసుకుంటాడు… పరీక్షించడానికి ఆ పొదను నరుకుతాడు… ఆ పొదలో ఉన్న శంభుకుమారుడి తల తెగిపడుతుంది… అయ్యో, ఒక మునికుమారుడిని హతమార్చానా… అనే బాధతో రాముడికి ఏం జవాబు చెప్పగలను అనుకుంటూ లక్ష్మణుడు అక్కడే ఆత్మహత్యకు సిద్ధపడతాడు… తరువాత మనసు మార్చుకుని రాముడికే విషయం వివరించి, తను ఏం చెబితే అది చేయాలని బయల్దేరతాడు… విషయం విన్న రాముడు కూడా బాధపడతాడు…
ఈలోపు కొందరు మునులు అక్కడికి వచ్చి, శంభుకుమారుడి వృత్తాంతం చెప్పి, విధివశాత్తూ లక్ష్మణుడి చేతిలో మరణించాడనీ, అందులో ఎవరి తప్పూ ఏమీ లేదని నచ్చజెబుతారు… కొడుకును వెతుక్కుంటూ వచ్చిన శూర్పణఖకు రాముడు, లక్ష్మణుడు కనిపిస్తారు… కొడుకును పోగొట్టుకున్న కథను ఖరదూషణాదుల ద్వారా విన్న శూర్పణఖ కోపం పెంచుకోకపోగా లక్ష్మణుడిపై, రాముడిపై మోహాన్ని పెంచుకుంటుంది… తనను కూడా చేపట్టాలని అడుగుతుంది… తరువాత కథ అందరికీ తెలిసిందే… ఈ శంభుకుమారుడి పాత్ర గురించి రామచరిత మానస్, వాల్మీకి రామాయణం వంటి గ్రంథాల్లో కనిపించదు…
కంభ రామాయణంలో ఈ పాత్రను ఇంకోరకంగా పరిచయం చేస్తారు… సీతను చూసి మోహించిన శంభుకుమారుడు ఎప్పుడూ ఆమెను చూస్తూ ఉండటానికి పంచవటిలోనే ఓ చెట్టుగా మారతాడు… లక్ష్మణుడు చెట్టే అనుకుని నరికినప్పుడు చెట్టు మాయమై శంభుకుమారుడి శవం బయటపడుతుంది… ఎన్నెన్నో రకాల కథలు… ఉపకథలు… అందులో శూర్పణఖ కొడుకుది ఓ ఉపకథ…!
Share this Article