Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

న్యాయం ఓ ప్రశ్నార్థకం..! ఈ ఇద్దరు తల్లుల పోరాటానికి అభివందనం..!!

February 27, 2026 by M S R

.

Mohammed Rafee … ఆ మహాతల్లుల పోరాటానికి పాదాభివందనం… నేను ఆంధ్రజ్యోతి స్పెషల్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా వున్న రోజుల్లో… మా పక్కనే వున్న సండే డెస్క్ లో పసుపులేటి గీత సబ్ ఎడిటర్ గా పని చేస్తుండే వారు. ఆమె ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ మంచి కవయిత్రి!

1997లో అనుకుంటా… ఆమె సండే స్పెషల్ లో ఒక కవిత రాశారు. ఆడపిల్లల ఆత్మహత్యలు, హత్యలు అన్నీ కడుపు నొప్పితో జరిగినవే అని పోస్టు మార్టం రిపోర్టులో తేల్చేస్తారు అని గీత రాసిన ఒక కవిత నన్ను ఇన్నేళ్లు అయినా వెంటాడుతూనే ఉంది! ఇది నిజమేనా ఇంత ఘోరమా అనిపిస్తూ వచ్చింది!

Ads

కానీ, మొన్న ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా, ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు, అలాగే అయేషా హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చూసాక గీత రాసింది నిజమని నిర్ధారణకు వచ్చాను.

2002లో నేను వార్త సిటీ డెస్క్ లో వున్నాను. GHMC ఎన్నికల సమయం కావడంతో డెస్క్ లోనే అర్ధరాత్రి వరకు ఉండాల్సి వచ్చింది! ఆ సమయంలో ప్రత్యూష వార్త వచ్చింది. సిటీ డెస్క్ ఇంచార్జ్ మురళి గారిలో ఉద్వేగం, ఒత్తిడి చూసి అడిగితే ఘోరమైన ప్రత్యూష వార్త గురించి చెప్పారు. మండిపోయిన ఆవేశంలో నేనే సూపర్ లీడ్ రాసిన గుర్తు! విషం కలిపిన కూల్ డ్రింక్ హత్య… కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి! అలాగే 2007లో ఇబ్రహీంపట్నం లేడీస్ హాస్టల్ లో అయేషా మీరా (17)ను బాత్ రూమ్ లో హత్య చేసి నగ్నం * గా పడేసారు. ఆ వార్త అప్పట్లో కలకలం!

24 ఏళ్ల తరువాత జస్ట్ కూల్ డ్రింక్ లో విషం కలిపి సినీ హీరోయిన్ ప్రత్యూష (22) ఆత్మహత్యకు ప్రేరేపించిన క్లాస్ మేట్ ప్రియుడు సిద్ధార్ధ రెడ్డికి రెండేళ్ల శిక్ష, 50 వేల జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 18 ఏళ్ల తరువాత ప్రత్యూష హత్యకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు తీర్పు తేల్చేసింది! ఈరోజు (ఫిబ్రవరి 27న) అయేషా అవశేషాలతో తెనాలిలో వారి తలిదండ్రులు అంత్యక్రియలు చేయనున్నారు. ఆమెను చంపిన డిసెంబర్ 27ను అయేషా సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరుతున్నారు.

ప్రత్యూష తల్లి టీచర్ సరోజిని (భువనగిరి), అయేషా తల్లి శంషాద్ బేగం (తెనాలి) చేసిన ఇన్నేళ్ల పోరాటం వృధా అయిపోయింది! ఇద్దరు తల్లుల మానని గాయాలు, ఆగని కన్నీళ్లకు కోర్టులు భలే తీర్పులు ఇచ్చాయి!  మరి ఆ మహా తల్లులకు న్యాయం జరిగిందా? వారిద్దరూ తమ అందమైన ప్రాణమైన కుమార్తెల కోసం కనీసం న్యాయం కోసం చేసిన పోరాటం వారి కన్నీళ్లు తుడవవగలిగిందా? ఇది అన్యాయం అని అనలేమా? చట్టానికి నిజంగానే కళ్ళు లేవని ఎన్నో సార్లు రుజువవుతూనే ఉంది! ఇప్పుడేం కొత్త కాదు!

ప్రత్యూష మృతి వెనుక, అయేషా హత్య వెనుక అప్పట్లో రాజకీయాల్లో వున్న పెద్ద తలల పేర్లు, వారి బిడ్డల పేర్లు వార్తల్లోకి వచ్చాయి! అవి నిజమో కాదో కానీ, కోర్టులో నిలబడవని అప్పట్లోనే మిత్రులతో అనుకున్నాం! ప్రత్యూష తల్లి సరోజిని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తమ కుమార్తె ఒంటిపై గాయాలు ఉన్నాయని, పోస్టు మార్టం నివేదికలు మారిపోయాయని… పట్టించుకునే వారెవ్వరు?

  • అయేషా హత్య వెనుక తెనాలికి చెందిన శివాంజనేయులు పేరు దోషిగా మొదట వచ్చింది. వాళ్ళు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింగ్ అని మరో పేరు వచ్చింది! ఆయన తల్లి కోర్టును ఆశ్రయిస్తే లడ్డు పేరు, ఆ తరువాత స్వయానా మేనమామ పేరు… ఇలా మార్చి మార్చి చివరకు సత్యం బాబును ఇరికించేసారు. నరాల బలహీనత కలిగిన ఆ కుర్రాడు రేప్, హత్య చేయగలడా? పాపం ఎనిమిదేళ్లు జైలుశిక్ష అనుభవించాక కోర్టు అతన్ని నిర్దోషి అని తేల్చింది. మొన్న హైకోర్టు తెల్చేసింది…. ఆధారాలు సరిగా లేవని అసలు దోషి ఎవరో తేల్చకుండానే కేసు క్లోజ్ చేసేసింది! రెండు కేసులు సిబిఐ చేతిలోకి వెళ్లినా తేలలేదంటే అర్ధం… చట్టం తన పని తాను బాగా చేసుకుపోతున్నట్లేనా !

ఎన్టీఆర్ సినిమా బొబ్బిలిపులి గుర్తుకొస్తోంది! కోర్టు కోర్టుకు న్యాయం మారిపోతూ ఉంటుందని దాసరి నారాయణరావు ఆరోజుల్లోనే స్పష్టంగా చూపించారు. కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు అన్నీ షరా మామూలే! నిజానికి ధర్మానికి న్యాయం ఉండదు! అన్యాయానికి అక్రమానికి, కోరుకున్న వారికి పలుకుబడి ఉన్నవారికి, బలవంతులకు బలిసినవారికి మాత్రమే న్యాయం జరుగుతుంది! ఇందులో న్యాయమూర్తుల తప్పు లేదు! వారిని నమ్మించే న్యాయవాదులదే తప్పు! తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరులదే తప్పు! పావులుగా మారిపోయే బలహీన పోలీసులదే తప్పు! అలవోకగా పోస్టుమార్టం నివేదికలను మార్చేసే వైద్యులది తప్పు! సమస్య మనది కాదని చూస్తుండిపోయే సమాజానిది అసలైన తప్పు! ఆ సమాజంలో నేనూ వున్నాను!

సిగ్గుతో తల వంచుకుని ఆ తల్లులకు క్షమాపణలు చెబుతున్నాను! అయేషా, ప్రత్యూష తల్లుల కడుపు కోత ఎవరికి అర్ధం అవుతుంది? వారి జీవితాంతం ఆ గాయం మానదు! ఆ తల్లులకు వందనం. వారిద్దరి పోరాట పటిమకు పాదాభివందనం! ఇప్పుడు పసుపులేటి గీత రాసిన కవిత గుర్తుకొస్తోంది! అవును, మహిళల హత్యల వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావు! అసలు దోషులు ఎవరో చట్టానికి తెలియదు! అన్నీ కడుపు నొప్పితో చేసుకున్న ఆత్మహత్యలే ! హత్యలు కూడా ఆత్మహత్యలే! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొన్ని జిల్లాల్లో జీరో సీట్స్..! ప్రాంతీయమా..? ఉపప్రాంతీయ పార్టీలా..?!
  • ఇక పంజాబ్‌పై బీజేపీ కన్ను..! ‘ఆప్’ను మరింత తొక్కడమే టార్గెట్..!!
  • క్రిస్టియన్… దళిత్ కాదు… తన కులానికీ ఓ చరిత్ర… హైదరాబాద్‌కూ లింక్స్…
  • కొరడా పట్టుకో సీఎం సారూ… లేకపోతే నీ కళ్లకే గంతలు కడతారు…
  • మమత మట్టికరిచింది… ఆ దుర్గగుడి తలుపులు తెరుచుకున్నయ్…
  • ‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’
  • నో… వోట్ల తొలగింపుతో బీజేపీకి ఫాయిదా అనేది ఉత్త బోగస్ వాదన…
  • ‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…
  • అల్లరిపిల్ల..! అప్పట్లో మీనాకు భలే పాత్రలు దొరికేవి..!
  • బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions