గతంలో ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి దిక్కు అన్నట్టుగా మాట్లాడేవాడు కేసీయార్… ఇప్పుడు తనదీ జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీల విశిష్టత మరిచిపోతాడు, మాట కూడా మాట్లాడడు… అవసరమైతే ‘‘బాబ్లీ అసలు ఇష్యూయే కాదు, శ్రీరాంసాగర్ నీళ్లు ఎత్తిపోసుకొండి, పెద్ద మనస్సుతో చెబుతున్నా’’ అంటాడు… అదేదో తనే తెలంగాణ మీద సర్వాధికారాలు ఉన్నట్టు… బాబ్లీ ఎగువన కట్టే ప్రాజెక్టులపై నిలదీయాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి ‘‘మీ ఇష్టమొచ్చినన్ని నీళ్లు వాడుకొండి’’ అని ఓపెన్ ఆఫర్ ఇస్తే, దాని మీద జరగాల్సినంత చర్చ జరగదు…
కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు కట్టబోతోంది… జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చింది… ప్రాథమిక అంచనా 20 వేల కోట్ల ఖర్చు… అప్పర్ భద్ర నుంచి లిఫ్టుల ద్వారా టీఎంసీల కొద్దీ నీటిని తుంగ తదితర రిజర్వాయర్లకు ఎత్తిపోసి, పలు ప్రాంతాలకు జీవప్రదాయిని కాబోతోంది… అది ఏపీకి, తెలంగాణకు నష్టదాయకం… అసలే ఆలమట్టి ఎత్తు పెంచబోతున్నది… ఇక ఈ అప్పర్ భద్ర సరేసరి… మరి తెలంగాణ స్పందన ఏమిటి.? సున్నా..! అవసరమైతే కర్నాటకలో మీటింగు పెట్టి, కృష్ణాలో మీ ఇష్టమొచ్చినట్టు నీళ్లు వాడుకొండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చి వస్తాడేమో…
ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత తెలుస్తుంది… ప్రాంతీయ ప్రయోజనాల పట్ల కృతనిశ్చయం బయటపడుతుంది… ఉదాహరణకు ఈ వార్త చదవండి ఓసారి…
Ads
ఏపీ సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది… ఇది తుంగభద్ర ఆయకట్టులోని రాయలసీమకు నష్టం కాబట్టి సీరియస్‌గా రియాక్టవుతోంది… ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదా రద్దు చేసి, అన్నిరకాల సాంకేతిక అనుమతులూ రద్దు చేయాలంటూ పోరాడబోతోంది… శషభిషలు, మొహమాటాలు ఏమీ లేవు… మా నీళ్లను దోచుకుంటారా అని కర్నాటకను సూటిగా ప్రశ్నిస్తోంది… సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది…
అసలు బచావత్ ట్రిబ్యునల్ దీనికి ఒక్క టీఎంసీ కూడా కేటాయించలేదు… తరువాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటిలభ్యత పేరిట, కర్నాటక నీళ్ల వాటాను అడ్డగోలుగా పెంచేసి, ఈ ప్రాజెక్టుకు 10 టీఎంసీలు కేటాయిస్తే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది నోటిఫై కూడా కాలేదు… ఈ స్థితిలో ఏపీ కృష్ణాజలాల్లో తన హక్కు కోసం ఓ పోరాటం ప్రారంభించింది… ఇదీ స్పిరిట్… కర్నాటక గెలుస్తుందా..? ఏపీ హక్కులు కాపాడబడతాయా లేదానేది వేరే సంగతి… కనీసం ఏపీ ప్రభుత్వంలో స్పందన ఉంది…
మరి అదే ప్రాజెక్టు తెలంగాణకు మరింత నష్టదాయకం కాదా..? మరి తెలంగాణ ఎందుకు స్పందించడం లేదు..? కర్నాటకలో కూడా పార్టీ పోటీచేస్తుంది కాబట్టి ఇక తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టాల్సిందేనా..? అందుకేనా టీఆర్ఎస్‌కు వోట్లు వేసి అధికారంలోకి తెచ్చుకుంది తెలంగాణ సమాజం… తెలంగాణకు రక్షణగా ఉండవయ్యా అని చెబితే, లేదు, లేదు, నేను ఢిల్లీకి పోతాను అనే పాట ఎత్తుకోవడం… ఇదుగో ఇలాంటి అప్పర్ భద్ర వంటి ప్రాజెక్టులకు ఉపయోగపడటానికేనా..? అప్పర్ భద్ర, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం లిఫ్ట్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వైఖరి ఏమిటి..? సైలెన్స్…!!
Share this Article