దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నాం చూస్తున్నారా..? ఈ తెలంగాణ సూపర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం….. ఇదేకదా బీఆర్ఎస్ పదే పదే చెబుతున్న మాట… నిజమేమిటో ఊళ్లల్లో రైతులకు తెలుసు… ఆ 24 గంటల కరెంటు కథేమిటో అనుభవిస్తున్నవాళ్లకు తెలుసు… మరీ కొన్నిరోజులుగా వ్యవసాయానికి కరెంటు సరఫరా పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది…
మాట్లాడితే కేసీయార్ అసెంబ్లీలో అంటుంటాడు… ఎవరైనా కరెంటు విషయంలో ఆందోళనలు చేశారా, చేస్తున్నారా..? గతంలో ఉమ్మడి పాలనలో రోజూ నిరసనలు, ధర్నాలే, మేం ఎంత పవరైనా ఇస్తాం, ఇస్తున్నాం, ఎవరికీ కంప్లయింట్ లేదు అని…! కానీ కొన్నిరోజులుగా ప్రతిచోట ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి… కోతకొచ్చిన పంట ఎండిపోతోంది, కాపాడండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు… కారణం ఏమిటి..?
ఇన్నేళ్లూ మస్తు కరెంటు ఇచ్చినం, నాలుగు రోజులు కొద్దిగా కోత పెట్టాల్సి వచ్చింది, దానికే ప్రతిపక్షాలు పండుగ చేసుకుంటున్నాయి అని విద్యుత్తు మంత్రి జగదీష్‌రెడ్డి అసెంబ్లీలో చెబుతున్నాడు… నిజానికి తెలంగాణలో కరెంటు మంత్రి, ఉన్నతాధికారి అన్నీ ప్రభాకర్‌రావే… జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్, కరెంటు పాలసీలు, కొనుగోళ్లు కథా కమామిషు అన్నీ ఆయనే… మరి రైతులను గోస పెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందీ అంటే… అదీ ప్రభుత్వ వైఫల్యమే…
Ads
ఆంధ్రజ్యోతి, వెలుగు తప్ప రైతుల ఆందోళనల్ని మెయిన్ పేజీల్లో కవర్ చేస్తున్న పత్రిక ఏదీ లేదు… వాళ్లకు కార్ రేసింగులు, ఆహా ఓహో భజనలు తప్ప రైతులు కడుపునొప్పి పట్టడం లేదు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనడానికి మనం ఒప్పందాలు కుదుర్చుకున్నాం… దానికోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి గ్రిడ్ స్పేస్ తీసుకొని, కిరాాయిలు కూడా కడుతున్నాం… కానీ ఛత్తీస్‌గఢ్‌కు మాత్రం సరిగ్గా బకాయిలు చెల్లించడం లేదు… దాదాపు 2, 3 వేల కోట్ల బాకీలు…
అడిగీ అడిగీ, చూసీ చూసీ ఆ రాష్ట్రం కరెంటు సరఫరాను ఆపేసింది… ఏపీకి కూడా బోలెడన్ని బకాయిలు చెల్లించాల్సి ఉంది… అన్నింటికీ మించి గతంలోనైతే ఎడాపెడా కరెంటును బయట కొనుగోలు చేసేవాళ్లం… (అందులో బోలెడంత అవినీతి ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపణ…) ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ కొనుగోళ్లూ తగ్గిపోయాయి… ఇలాంటి కారణాలతోనే రైతులకు ‘‘పవర్ కట్’’ రుచి చూపిస్తున్నాం… అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయో, కరెంటు ప్రైవేటు కొనుగోళ్లకు ఎంత, ఏయే రేట్లకు వెచ్చించారో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలి… కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టినవి కాదు, ఈ ప్రభుత్వం సొంతంగా ఆపరేషన్‌లోకి తీసుకొచ్చిన ప్లాంట్లు, వాటి సామర్థ్యం ఎంత..?!
Share this Article