తెలుగు పాట ‘నాటునాటు’ ఆస్కార్‌కు చేరువైనట్టే ఉంది… కీరవాణిని ఆస్కార్ అవార్డుల వేదికపై పర్‌ఫామ్ చేయమని అడిగారు అంటే… అది అవార్డు దక్కబోతోందనడానికి ఒక సూచికగా భావించాలట… ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా ఒక సూచికే అంటున్నారు… సరే, మంచిదే… కానీ పాపం, ఆ పాటకు ప్రాచుర్యమే ఆ స్టెప్పులతో వచ్చింది… లేకపోతే ఆ పాట కంటెంటులో ఏముందని..? ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బాగా బాధపడుతున్నాడని వార్తలు…
ఎంతసేపూ కీరవాణి పేరే తప్ప తనకు క్రెడిట్ దక్కడం లేనదేది బాధ… ఆ బాధలో న్యాయముంది… కనీసం పాట రాసిన చంద్రబోస్ సోషల్ మీడియాలో వార్తలు రాయించుకుని కాస్త ఆ క్రెడిట్‌లో భాగం కొట్టేసేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నాడు… కీరవాణితోపాటు పర్‌ఫామ్ చేయడానికి వెళ్తున్నాడు… సింగర్ పర్‌ఫామ్ చేయగలడు గానీ రైటర్ ఏం చేయగలడు అని అడక్కండి… కొన్ని అంతే… కానీ ఫాఫం, ఆ పాట పాడిన వారిలో ఒకడైన రాహుల్ సిప్లిగంజ్ కూడా బాగా బాధపడుతున్నట్టే లెక్క…
తన కొడుకు కాలభైరవను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి కీరవాణి ఒకటే ఆనందపడిపోయాడు… ఇంకా పొత్తిళ్లలోనే ఉన్నట్టున్న బిడ్డ ఎంత ఎదిగిపోయాడు, అప్పుడే ఓ గరల్ ఫ్రెండ్ కూడా అన్నట్టుగా మహా సంబరపడిపోయాడు… వెరసి రాజమౌళి, కీరవాణి, కాలభైరవ వీళ్ల పేర్లే పదే పదే వినిపిస్తున్నాయి… ఐనా సరే, ఓ పాట ఆస్కార్ వేదికపై మెరిస్తే ఆనందపడదాం… కానీ మరో విషయం కూడా చెప్పుకోవాలి…
Ads
రాజమౌళిని మెచ్చుకోవాలి… సినిమాలో ఏమున్నా ఏమీ లేకపోయినా కొత్తకొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ వెతుకుతూ… తెలుగు సినిమాను అంతర్జాతీయం చేశాడు… వందల కోట్లను కుమ్మేశాడు… అంతేకాదు, అసలు ఈ పెద్ద పెద్ద అవార్డులన్నీ జాగ్రత్తగా వ్యవహరిస్తే కొనుక్కోవచ్చు అనే నిజాన్ని కూడా కనిపెట్టాడు… మన సినిమాల్లో పాటలను చూసి విదేశీయులు ఇన్నాళ్లూ పకపకా నవ్వుకునేవాళ్లు… అలాంటిది ఒక సాదాసీదా పాటను ఆస్కార్ దాకా తీసుకుపోవడం అంటే మాటలా..? ఎన్ని లాబీయింగు మార్గాలు తెలుసుకుని ఉంటాడో కదా రాజమౌళి…
ఈ నాటునాటు పాటకే ఇంత సీన్ లభిస్తుంటే… నిజంగా బాగున్న పాటలకు సంబంధించి మనం ఎన్ని అవకాశాలను కోల్పోయాం ఇన్నేళ్లూ సరిగ్గా ప్రయత్నించక..! ఇప్పుడు రూట్ దొరికింది, ఏం చేయాలో తెలిసింది… గుద్దుతా నీయవ్వ గుద్దుతా… చల్లగా లేస్తోంది తరహాలో వచ్చే కొత్త పాటలకు కూడా రేప్పొద్దున మనం ఆస్కార్ భాగ్యాన్ని కలిగించవచ్చు… ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్’ కేటగిరీలోకి జొప్పించవచ్చు… అంతెందుకు..? ప్రైవేట్ ఎంట్రీ పేరిట ఆర్ఆర్ఆర్‌ను ఏకంగా బోలెడు కేటగిరీల్లో నామినేట్ చేయించిన రాజమౌళే… ఇకపై తన సినిమాలను మరింత జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి, ఈసారి ఉత్తమ దర్శకుడు అవార్డును కొట్టే దృశ్యాలు కూడా లీలగా కళ్లముందు కదలాడుతున్నాయి…
శాన్ ఫ్రాన్సిస్కోలో అడ్డా వేసి, దాదాపు ఈ ప్రయత్నాలకు 50 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రచారమైతే జరుగుతోంది… ఊరికే ఖర్చు పెడితే రాదు, అమెరికా పత్రికల్ని బుట్టలో వేసుకోవాలి… ఇతర దేశాల్లోనూ సినిమాను ఆడించాలి… పాత్రికేయుల్లో ప్రభావవంతులు ఎవరో గుర్తించి కాస్త సంతృప్తిపరచాలి… ఫిలిమ్ క్రిటిక్స్‌ను ప్రభావితం చేయాలి… అబ్బో, రాజమౌళి విపరీతంగా ప్రయాసపడ్డాడు… తను బాగా ఆశపెట్టిన ఉత్తమ దర్శకుడు రాకపోవచ్చుగాక కానీ రూట్ దొరికిందిగా, ఇంకా పొద్దు లేదా, పొలం లేదా..?
హలో థమన్, హలో డీఎస్పీ వింటున్నారా..? ఫాలో అవుతున్నారా..? డీఎస్పీ ఆల్‌రెడీ నువ్వు పీక అందుకో ఒయ్, నువ్వు డప్పు అందుకో ఒయ్ అని పాట కూడా రాసేశాడు, రాబోయే రోజుల్లో కూడా రాస్తాడు… తెలుగు సినిమాకు పాటలు రాయడం పెద్ద విషయమా అనేంత ధీమా వచ్చేసింది తనకు… తను స్వయంగా డాన్సు కూడా చేస్తాడు… ఇక థమన్ కూడా ఇవి అలవాటు పడాలి… మైత్రి మూవీస్ వంటి పెద్ద నిర్మాతలు దొరికితే, డబ్బు ఖర్చు చేయగలిగితే, రాజమౌళి బాటలో అన్నీ ఆర్గనైజ్ చేసేవాళ్లు దొరికితే… మళ్లీ ఉత్తమ పాట కేటగిరీకి పోటీపడితే… అప్పుడే ఏ చంద్రబోసులు, ప్రేమ్ రక్షితులూ, కాలభైరవలూ అవసరం లేదు…
ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ డాన్స్ కంపోజర్, ఉత్తమ గాయకుడు… మొత్తం క్రెడిట్స్ మీరే ఎంజాయ్ చేయవచ్చు… రాసేవాడు దొరికితే కొనేయండి, ఔత్సాహిక డాన్స్ కంపోెజర్లను పట్టేయండి… సరేనా..? అన్నింటికీ మించి కాస్త అమెరియన్ యాక్సెంట్ ప్రాక్టీసు చేయండి, ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది, వేదిక మీద మాట్లాడాల్సి ఉంటుంది… ప్చ్, రాజమౌళి ఈ చిట్కాలన్నీ ఎవరితోనైనా షేర్ చేసుకుని ఉంటే… దాక్కో దాక్కో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక పాట కూడా ఆస్కార్‌పై మెరిసి, డీఎస్పీ మొహం కూడా వెలిగిపోయేది… ఏమో, దిగుదిగుదిగు నాగ పాటకు థమన్ కూడా ఆస్కార్ కాలర్ ఎగరేసేవాడేమో… ఇంతకుముందులాగా అఫీషియల్ ఎంట్రీలే అవసరం లేదని రాజమౌళి నిరూపించాడు కదా…! తన బాటలో ఈసారి కొన్ని సినిమాలు ఆల్‌రెడీ ప్రైవేట్ ఎంట్రీలుగా అప్లయ్ చేసి, కొంతదూరం ప్రయాణించాయి కూడా..!!
Share this Article