అమెరికా తన గగనతలంలో కనిపించిన నాలుగో ‘గుర్తుతెలియని పరికరాన్ని లేదా వాహనాన్ని’ కూల్చేసింది… వారంలో ఇది నాలుగోది… మొదటిదేమో చైనా ప్రయోగించిన గూఢచార పరికరం… మరి మిగతా మూడు..? అవి గ్రహాంతర జీవుల వాహనాలు కూడా కావచ్చుననీ, ఆ కూలిన వస్తువుల శిథిలాలు దొరికితే, దర్యాప్తు జరిపితే, పరీక్షలు చేస్తే నిజాలు తెలుస్తాయని అమెరికా అంటోంది… ఎవరో అల్లాటప్పాగా కూసిన కూతలు కావు… నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (నొరాడ్) హెడ్ వాన్ హెర్క్ చెబుతున్నాడు అలా…
అమెరికా ఏం మాట్లాడినా అసలు అర్థం వేరే ఉంటుంది… టార్గెట్ ఇంకొకటి ఉంటుంది… చైనా ప్రయోగించిన నిఘా విమానాన్ని (బెలూన్) కూల్చేశాక… ఏమిటీ తొందరపాటుతనం, అది ప్రజావసరాల కోసం ప్రయోగించిన బెలూన్ అని చైనా దబాయించింది… అంతేకాదు, మరి మా గగనతలంలో ఎగురుతున్న మీ నిఘా విమానాల మాటేమిటి..? మేమూ కూల్చేయాలా అనడిగింది… చైనాతో మరింత దూరం పెరుగుతున్న ఈ నిఘా యవ్వారాన్ని పక్కదోవ పట్టించడానికి ఇలా గ్రహాంతరజీవులు వస్తున్నారేమో, ఇవి వాళ్ల వాహనాలేమోనని ఓ కొత్త పాట మొదలుపెట్టిందా అమెరికా..?
కావచ్చు… లేకపోతే గ్రహాంతరజీవులు పదే పదే ఆ అమెరికాకే ఎందుకొస్తారు..? వేరే ఏ దేశంలోనూ ఇలాంటి వార్తలు రావు… అమెరికాయే కాదు, అమెరికా తోెకదేశాలు కూడా ఇవేపాట పాడుతుంటాయి… రెండుమూడేళ్ల క్రితం ఓ వార్త గుర్తుందా..? భూమిపై ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని, అప్పుడప్పుడూ మనుషుల్లో కలిసిపోయి తిరుగుతున్నారని ఒక వార్త… అబ్బే, ఎవరో రచయితో, సినిమా స్క్రిప్టరో, అవతార్ సినిమా నిర్మాతో చెప్పలేదు… ఇజ్రాయిల్ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ చెబుతున్నాడు… మరి ఈయనకెలా తెలుసు అంటారా..? సదరు గ్రహాంతర జీవులు ఇజ్రాయిల్‌తో కూడా కలిసి పనిచేస్తున్నారట…
Ads
ఎహె… అన్నీ పిచ్చి మాటలు… వయస్సు ఎక్కువై, ఏదేదో సంధి ప్రేలాపనకు దిగుతున్నాడేమో అని కొట్టేద్దామంటారా..? నో, నో… 89 ఏళ్ల ఈ పెద్ద మనిషి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అమ్మతోడు, నన్ను నమ్మండి బాస్ అన్నాడు… ఆరేడేళ్ల క్రితం అయితే ఇవన్నీ చెబితే తనను పిచ్చాసుపత్రిలో వేసేవారేమో, ఇప్పుడు పర్లేదు, నాకొచ్చిన నష్టమేమీ లేదు అట… ఈయన తక్కువవాడేమీ కాదు… ఆ దేశ స్పేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు ముప్ఫయ్ ఏళ్లపాటు చీఫ్… ‘నాకు బోలెడు డిగ్రీలున్నయ్, డాక్టరేట్లున్నయ్… ఇప్పుడు నన్ను ఎవరైనా పిచ్చోడు అనుకున్నా పెద్ద ఫరక్ పడదు… నిజాల్ని చెబుతున్నాను’’ అని నమ్మకంగా చెబుతున్నాడు…
మనుషులు, అంతరిక్ష జీవులతో ఒక గాలాక్టిక్ ఫెడరేషన్ కూడా ఏర్పాటైందంటున్నాడు… స్పేస్ స్టేషన్‌లాగే అంగారక గ్రహం అండర్ గ్రౌండ్‌లో ఒక స్థావరం ఉందట… అక్కడ అమెరికన్, ఏలియన్ సైంటిస్టులు కలిసి పనిచేస్తున్నారట… ఏం పనిచేస్తున్నారు అంటే, అది మాత్రం తనకు తెలియదు అన్నాడు… వీళ్లే కాదు, అమెరికాలోని ముఖ్యులంతా ఏలియెన్స్ ఉనికిని నమ్ముతారు… ఆమధ్య హిల్లరీ క్లింటన్ తన ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే అమెరికా దాచిపెడుతున్న ఏలియెన్స్ సంబంధాలను ప్రజలందరికీ బహిరంగపరుస్తానని హామీ ఇచ్చింది… రకరకాల వార్తలు… కొందరు గ్రహాంతరజీవులు అమెరికాకు చిక్కారనీ, ఓ రహస్య ప్రదేశంలో దాచి పరిశోధిస్తున్నారనే వార్తలు తరచూ అక్కడి మీడియాలో కనిపిస్తూ ఉంటయ్…
ఒక మహిళను గ్రహాంతరవాసులు చెరిచారని కూడా ప్రచారం… అసలు అది సాధ్యమా..? ఒక్కసారి ఇలా ఆలోచించండి… ఈ ఏలియెన్స్ కథలు ఎంత అబ్సర్డో మీకే అర్థమవుతాయి…
‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు లోనై, క్రమేపీ మారుతూ మారుతూ, ఇక్కడి ప్రకృతికి తగిన మనిషిగా మారడానికి ఇంతకాలం పట్టింది… ఇంకా మారుతాడు… ఇదే సిట్యుయేషన్ వేరే గ్రహాలపై ఉండాలనీ లేదు, జీవం ఒకవేళ ఉన్నా ఇలాగే పరిణామగతికి గురై ఉండాలనీ లేదు… సినిమాల్లో, నవలల్లో ఏలియెన్స్ సృష్టి మనిషి కల్పనాత్మక ఆనందం కోసమే తప్ప అదేమీ శాస్త్రీయ నిరూపణకు, వాదనకు నిలబడేవి కావు…’’
… స్థూలంగా ఆధునిక వైజ్ఞానిక సమాజం అవగాహన, అంచనా ప్రస్తుతానికి ఇదే… ఐతే అందరూ ఇలాగే ఆలోచించాలని ఏమీ లేదు… ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల ఆలోచనలు అప్పుడప్పుడూ తిక్క తిక్కగా కూడా సాగుతూ ఉంటయ్, అమెరికన్ యూనివర్శిటీల్లో పరిశోధనలు చిత్రవిచిత్రంగా ఉంటయ్… ఇదీ అలాంటిదే… మరి గ్రహాంతరవాసుల వాహనాలు అంటారా..? మనకు అంతుపట్టని ప్రతి గగనవస్తువూ దేవుడి మహిమ అనుకోవాలి లేదంటే ఏలియెన్స్ వాహనాలు అనుకోవాలి… అంతే…
Share this Article