Bharadwaja Rangavajhala………… ప్రధాని మోదీ చాలా గర్వంగా పార్లమెంటులో పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత ప్రాపర్ హిట్ లేని షారూఖ్ ఖాన్ పఠాన్ తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు… నిజమే … ఈ సినిమా వసూళ్ల గురించి ప్రధాని మోదీ సాక్షాత్తూ లోక్ సభలో ప్రస్తావించారు. పఠాన్ కాశ్మీర్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తోందన్నారు. శ్రీనగర్ లో ఫలానా ఐనాక్స్ లో అన్ని స్క్రీన్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయన్నారు. దీనికి కారణం కశ్మీర్ లో ఆర్టికల్ త్రీసెంటీ రద్దు చేయడమే అన్నారు. తాను తన పార్టీ ప్రభుత్వమూ కల్సి శ్రమకోడ్చి కశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు తీసుకువచ్చేశామన్నారు.
బిజేపి ప్రభుత్వం తీసుకున్న చొరవతో కశ్మీర్ ప్రజాజీవనం సాధారణ స్తాయికి వచ్చేసిందని … ప్రజలు పనిపాటల్లో పడిపోయారనీ దశాబ్దాల నాటి వత్తిడి నుంచీ వారు విముక్తులయ్యారని చాలా గర్వంగా ప్రకటించారు. కశ్మీర్ లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయని, మొన్న విడుదలైన పఠాన్ సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తోందనీ చెప్తూ ఐనాక్స్ పేరు కూడా ప్రస్తావిడం గమనార్హం…. ఈ విషయం పక్కన పెడితే మన మీడియా ఏం చేసిందీ?
ఫలానా సినిమా గురించి ప్రధాని మోదీ పార్లమెంట్ లో మాట్లాడారహో అని గగ్గోలు పెట్టింది తప్ప అసలు ఎందుకు ఆ పెద్దమనిషి ఆ సినిమా గురించి మాట్లాడారు? దట్టూ ఐనాక్స్ అనే ఎందుకు ప్రస్తావించారు అని అస్సలు … ఒక్కరూ పట్టించుకోలేదు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. రెండు రోజులుగా ఎవరైనా ఈ విషయం పట్టించుకుని ఎక్కడో అక్కడ రాయకపోతారా అని ఎదురుచూశాను కానీ నిరాశే ఎదురైంది. దీంతో ఇక తప్పక నేనే రాస్తున్నాను.
Ads
కశ్మీర్ అనే మార్కెట్ ఓపెన్ చేశాను మిత్ర కార్పొరేట్ కంపెనీలారా … అక్కడ ప్రవేశించి అక్కడి ప్రజల్ని హాయిగా దోచేసుకోండి అని చెప్పకనే చెప్పారేమో మోదీ అని నా అనుమానం. ఆ అమాయకపు భూస్వామ్య రోజుల్లో గురజాడ అప్పారావు గారు … దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని రాశారు … అదే ప్రస్తుతం నడుస్తున్న ఫాసిస్టు రోజుల్లో ఆయన బతికుంటే తప్పనిసరిగా అలా రాయడం తప్పైపోయిందని చెంపలేసుకుని … దేశమంటే మట్టి అవునో కాదో నాకు తెలియదుగానీయోయ్ దేశమంటే డెఫినెట్ గా మార్కెట్టేనోయ్ అని రాసుండేవాడు … అని నా ప్రగాఢ విశ్వాసం …
ఈ విషయపు లోతులు తెలియాలంటే ఫాసిజం అనగా ఏమో తెలియాలి … ఫాసిజం అంటే … మతం పేరుతో కావచ్చు కులం పేరుతో కావచ్చు … బ్లడ్ బ్రీడ్ ఇలా ఏ పేరుతో అయినా కావచ్చు … మనమందరం ఒక్కటే …. మనం ప్రమాదంలో ఉన్నాం … అందరం కల్సి కట్టుగా ఉండాలి అని చెప్పి …. మెజార్టీ జనాన్ని తన వెనుక వేసుకుని … అప్పుడు కార్పొరేట్ కంపెనీలను పిల్చి …. బాబూ కార్పోరేట్లూ … నా వెనుక ఇంత పెద్ద మార్కెట్ ఉంది … కనుక దీన్ని మీకు అప్పగించుతా … మరి నాకేంటి అని అడగడమే …
మనుషుల్ని మార్కెట్ గా చూడగలగడమే ఆధునిక దర్శనం అని నేను మరోసారి చెప్తున్నాను. ఈ దర్శనం లేని వాడు ప్రస్తుతం రోజుల్లో చెల్లనేరడు అని కూడా ఢంకా బజాయించి మరీ చెప్తున్నాను. ఇలా మార్కెట్ జ్ఞానం పుష్కలంగా ఉండడం వల్లే …. రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమా తీయగలిగాడు. మెజార్టీ మతాన్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకుని ఓ పార్టీ రాజ్యమేలుతున్న వేళ ఆ ఎరుక లేకుండా వ్యవహరించడం మార్కెట్ విడిచి సాము చేయడమే అవుతుందని తెలియడమే రాజమౌళి దార్శనికత.
తన హీరో కాషాయం కట్టాలనుకున్నాడు …. కాషాయం కట్టడంతో పాటు హీరోయిక్ ఇమేజ్ ఉన్న పాపులర్ కారక్టర్స్ ఏమున్నాయి అని వెతికాడు … అల్లూరి సీతారామరాజు అనే పాత్రను కనిపెట్టాడు. ఆ పాత్ర ద్వారా తాననుకున్న పని పూర్తి చేయవచ్చు అని అర్ధమైంది. అయిన మరుక్షణం …. మార్కెటింగ్ బజ్ క్రియేట్ చేయడానికి మరో పాత్ర కూడా ఉండాలి కాబట్టి … తీవ్రంగా ఆలోచించి కొంరం భీం పాత్రను తీసుకువచ్చి ఆ పాత్రను రామభక్త హనుమాన్ గా మార్చాడు.
అలా అటు అల్లూరి సీతారామరాజుకీ ఇటు కొంరం భీంకీ కూడా విజయవంతంగా వెన్నుపోటు పొడిచి తన కుటుంబానికి రెండు పద్మశ్రీలు … సాధించడంతో పాటు కొడుకుగా పితృరుణం తీర్చుకుని తండ్రికి రాజ్యసభ ఇచ్చేసి …. కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు.. ఇలా మెజార్టీ మతం ఓటుబ్యాంకుగానే కాక … మార్కెట్ గా కూడా దర్శనం ఇచ్చాక … హిందూ అనే సంకుచితత్వం నుంచీ బయటకు వచ్చి భారతీయత అనే విస్తరణ లోకి వెళ్లారు.
మనం హిందువులమా? కాదు, భారతీయులం మనం …. మనది ఏ జాతీ..? భరతజాతి అని చెప్పడం ప్రారంభించి …. మార్కెట్ విస్తరణలో భాగంగానే కశ్మీర్ ను చదును చేసి ఆర్టికల్ త్రీసెంటీ రద్దు ద్వారా అరకొర ప్రాణంతో కొట్టుకుంటున్న స్వయం నిర్ణయాధికార శ్వాసను చంపేసి … దాన్ని కూడా తన మార్కెట్ లో కలిపేసుకుంది భరతజాతి.
అక్కడ సినిమాలు ఆడేస్తున్నాయి … అవి కూడా కార్పోరేట్లకు చెందిన ఐనాక్స్ లేదా ఐమాక్స్ అన్నారు తప్ప గంగా మహలో యమునా మహలో అని సింగిల్ స్క్రీన్ గురించి ప్రధాని మాట్లాడలేదు. ఐనాక్స్ లో పఠాన్ సినిమా హౌస్ ఫుల్స్ ఆడుతోంది అన్న మాటలో ఇంకో అంతరార్ధం ఏమిటంటే ….
పఠాన్ సినిమాలో కథేంటి ఓసారి చూద్దాం …. కశ్మీర్ లో ఆర్టికల్ త్రీసెంటీ రద్దు మీద పాకిస్తాను తీవ్ర నైరాశ్యంలో పడిపోయిందని … ఆ నైరాశ్యంతో భారతదేశంలో కొన్ని దాడులు జరిపించడానికి సన్నాహాలు చేసిందనీ … ఆ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ చేసిన వీరోచిత ప్రతిఘటనా పోరాటగాధనే పఠాన్ సినిమాకథ.
అసహనము మట్టిగడ్డలూ అంటూ ఈ దేశంలో ఉండడం కష్టమనీ ఆ మధ్య కాస్త విసురుగా ప్రకటనలు చేసిన బాలీవుడ్ ఖాన్ లు లొంగుబాటు ప్రకటించేశారనీ … జాతీయవాద కథలతో సినిమాలు తీయకతప్పడం లేని అంగీకరించేశారనీ … అలాగే జనం కూడా దట్టూ కశ్మీర్ ప్రజలు కూడా ఈ తరహా కథలనే చూడ్డానికి నడుం బిగించేశారనీ అందుకే హౌస్ ఫుల్స్ అవుతున్నాయని … ప్రధాని చెప్పకనే చెప్పారు. పఠాన్ సినిమా కశ్మీర్ మార్కెట్ పై తమ పట్టును నిరూపించింది కావున … కార్పొరేట్ కంపెనీలకు ఆయన పార్లమెంటు వేదికగా పిలుపునిచ్చారన్నమాట.
రండి … హాయిగా వ్యాపారాలు చేసుకోండి …. మీకు ఏం కావాలో అడిగి పుచ్చుకోండి … అందరం కల్సి ఆనందంగా కశ్మీరీ లోయలో కన్యాకుమారిలా ఓ సందమామ అని వేటూరి రాసిన పాట పాడుకుంటూ చిరంజీవి విజయశాంతిలా డాన్సులూ అవీ చేస్తూ హాయిగా ఉందాం … అని ప్రధాని మాటలు నాకు విశదపరచాయి. కావున …. ప్రధాని ఊరికే ఆ సినిమా గురించి మాట్లాడలేదు …ఊరికే ఐనాక్స్ అనలేదు … దాని వెనకాల ఉన్న వ్యూహం ఇప్పుడు మీకు అర్ధమైంది అనుకుంటాను… పిల్లలూ, రేపో ఎల్లుండో మళ్లీ కాస్త జబ్బ బలం కుదిరిన నాడు మరో అంశంతో మీ ముందుకు వస్తాను అంత వరకూ సెలవు నమస్తే …. ఇట్లు మీ…………. నేనానంద స్వామి…
Share this Article