ఈనాడులో ఓ వార్త… ఎన్టీయార్ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం అని శీర్షిక… బాగుంది, కానీ లోపల మ్యాటర్‌లో ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఆర్బీఐ విడుదల చేస్తుందని రాశారు… కానీ అరుదేమీ కాదు… కొన్ని సందర్భాల్లో, కొందరు వ్యక్తుల స్మారకార్థం ఇలాంటి స్మారక నాణేల్ని విడుదల చేయడం పరిపాటే… అరుదైన విశేషం ఏమీ కాదు…
తన తండ్రి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందనీ, దీన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామనీ ఎన్టీయార్ బిడ్డ పురంధేశ్వరి కాస్త సినిమా భాషలో చెప్పింది… కానీ ఈ నాణేలకు లీగల్ టెండర్ ఉండదు… అంటే, ఆర్బీఐ అధికారికంగా చెలామణీలో ఉంచే నాణేలు కావివి… అంటే ఇతర నాణేల్లాగా మార్కెట్‌లో వంద రూపాయల కరెన్సీ నోటులా చెల్లుబాటు కాదు… వీటిని కమెమరేటివ్ కాయిన్స్ అంటారు…
ఆసక్తి కలిగిన వాళ్లు కొనుక్కోవచ్చు… నేరుగా ఆర్బీఐ మింట్ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు… ఎన్టీయార్ చిత్రమే కాదు, చాలామంది చిత్రాలతో కూడా నాణేల్ని ఆర్బీఐ విడుదల చేసింది… 50, 75, 100, 125, 150, 200, 1000 వరకూ అంకెలు ముద్రిస్తారు… రేట్లు రకరకాలు… నిజానికి ఇవి నాణేలు కాదు, ఇది నాణేంలా ఉండే నమూనా స్మారకచిహ్నం… పోస్టల్ స్టాంపుల్ని కూడా ఇలా ముద్రించే సౌలభ్యం ఉంది…
Ads
ప్రస్తుతం ఆర్బీఐ నాణేల్లో అధికారికంగా లీగల్ టెండర్ ఉన్నవి… 50 పైసలు, 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలు… మార్కెట్‌లో 20 రూపాయల నాణేలు కనిపించవు… యాభై పైసల్లోపు నాణేలు కూడా ఎవరూ యాక్సెప్ట్ చేయరు… అర్ధ రూపాయి నాణేల్ని కూడా 10 రూపాయలకన్నా ఎక్కువ ఇస్తే యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు… అంటే 20 అర్ధరూపాయి నాణేల వరకూ వోకే… అసలు మార్కెట్‌లో ఒక రూపాయి చెలామణీ కూడా బాగా తగ్గిపోయింది… 10 రూపాయల కాయిన్‌ను రకరకాల డిజైన్లలో రిలీజ్ చేసినందున చాలామంది వాటినీ యాక్సెప్ట్ చేయడం లేదు, కానీ అది తప్పు…
కమెమరేటివ్ కాయిన్స్ సంగతికొస్తే… అవి రకరకాల రేట్లలో దొరుకుతాయి… ఉదాహరణకు ఎన్టీయార్ స్మారక నాణెం ధర 4,160… ఎన్టీయార్‌ను అభిమానించేవాళ్లు, తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతిపరులు కొనుక్కోవచ్చు… ఇది పూర్తిగా వెండితో చేసిన నాణెం కూడా కాదు… 50 శాతం వెండి… 40 శాతం రాగి ఉంటుంది… మిగతా పది శాతంలో జింక్, నికెల్ ఉంటాయి… ఇవి కమెమరేటివ్ కాయిన్స్ కాబట్టే డిజైన్‌పై పురంధేశ్వరి సూచనలను తీసుకున్నారు… ఆర్బీఐ రెగ్యులర్ కాయిన్స్ అయితే ఇంటర్నల్ డిజైన్లను ఆర్బీఐ ఉన్నతాధికారులే ఆమోదిస్తారు… అదీ సంగతి…
Share this Article