అదుగో అదుగో… వచ్చె వచ్చె… అన్నట్టుగా టీవీ9 రవిప్రకాష్ (టీవీ9 తన ఇంటిపేరుగానే ఇంకా ఇంకా గుర్తొస్తుంటుంది) చానెల్ పేరు తరచూ వార్తల్లోకి వస్తుంటుంది… కానీ చానెల్ మాత్రం రాదు… అఫ్‌కోర్స్, అనుకున్నదే తడవుగా, అలవోకగా కొత్త చానెళ్లను ఆపరేషన్‌లోకి తీసుకొచ్చినట్టుగా పేరున్న రవిప్రకాష్ తన సొంత చానెల్ తీసుకురావడానికి అడ్డంకులేమిటి..? ఎందుకింత జాప్యం..?
మళ్లీ తాజాగా రవిప్రకాష్ సొంత చానెల్ ప్రచార తెరమీదకొచ్చింది… ఆర్ టీవీ పేరిట ఓ లోగో కూడా కనిపిస్తోంది… అంతేకాదు, మ్యాన్ పవర్ కావాలంటూ ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి… అప్పట్లో కొంతమందిని జర్నలిస్టులను తీసుకున్నారు, ట్రెయినింగ్ ఇస్తున్నారని అన్నారు, వాళ్లంతా ఏమయ్యారో తెలియదు… మళ్లీ కొత్తగా రిక్రూట్‌మెంట్లు షురూ…
Ads
వాట్సప్ గ్రూపుల్లో కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి… అవేమిటో ఓసారి చూద్దాం… రావాలి, రవిప్రకాష్ వంటి సీనియర్ పాత్రికేయుల సొంత చానెల్ రావాలి… ఎందుకంటే, తనకు తెలుగు టీవీ జర్నలిజానికి కొత్త పాఠాలు నేర్పించిన ట్రాక్ రికార్డ్ ఉంది… ఇప్పుడు న్యూస్ చానెళ్ల నాణ్యత ఘోరంగా ఉంది… ఈ స్థితిలో ఓ ప్రొఫెషనల్ వాయిస్ అవసరం… అయితే రవిప్రకాష్ పూర్తిగా నిష్పాక్షికంగా ఉండగలడా..? గతంలో కనబరిచిన టెంపర్‌మెంట్ ఇప్పుడూ చూపించగలడా…? అది వేరే చర్చ… కాసేపు దాన్ని వదిలేద్దాం…
వాట్సప్ పాయింట్ల వారీగా ఆలోచిస్తే…
1. రాయుడు టివీ లైసెన్స్‌ను రవిప్రకాష్ కొని… ఆర్ టీవీగా పేరు పెట్టుకున్నాడు ….
— ఇందులో తప్పేమీ లేదు… కొత్త లైసెన్సులు రావడం లేదు, రవిప్రకాష్ మీద కేసులున్నందున కొత్త చానెల్ తన పేరిట రాకపోవచ్చు, అందుకని రన్నింగులో ఉన్న చానెల్ తీసుకుని, సొంతంగా నడిపించుకోవడం సులభమార్గమే…
2. జూబ్లీ హిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర ఆఫీస్ ప్రారంభమయ్యింది …
— రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఆఫీసు ఉందేమో గానీ, రేవంత్‌రెడ్డికీ దీనికీ ఏ సంబంధమూ లేదు… కాకపోతే ఆఫీసు ఓపెనైంది అనేది ఓ సమాచారం…
3. అపాయింట్‌మెంట్స్ మొదలయ్యాయి ….
— నిజమే, మనం పైన ఆర్టీవీ రిక్రూట్‌మెంట్ ప్రకటన కూడా ఇచ్చాం… కాకపోతే వచ్చి చేరుతున్నవాళ్లు ఎందుకు నిలబడటం లేదు..? బహుశా చానెల్ స్టార్టయితే పరిస్థితి కొంత మారుతుందేమో…
4. మొదట డిజిటల్లో వచ్చి … తరువాత శాటిలైట్ అట …
— ఆల్‌రెడీ తొలివెలుగు పేరిట వెబ్‌సైటు, యూట్యూబ్ చానెల్, ఈపేపర్ నడుస్తున్నాయి… ఆర్టీవీకి కూడా వెబ్‌సైట్ తప్పదు, అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా హౌజులు నడిపిస్తున్నాయి కూడా… ఫస్ట్ డిజిటల్, తరువాత శాటిలైట్ నడిపే పక్షంలో ఆల్‌రెడీ నడుస్తున్న చానెల్ కొనుక్కుని ఏం చేయడానికి..? సో, నేరుగానే చానెల్ వచ్చే చాన్సుంది…
5. హిందీ , కన్నడ , తమిళ , తెలుగు భాషల్లో న్యూస్ ఛానెల్స్ పెడుతున్నట్లు రవిప్రకాష్ స్టాఫ్ కు చెబుతున్నాడు …
— పాన్ ఇండియా భాషల్లో చానెళ్లు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉన్నమాట నిజమే… కానీ తనున్న స్థితిలో అంత సాధన సంపత్తి ఉందానేది ఓసారి ఆలోచించాలి… అదే ఉంటే సొంత చానెల్ ఇన్నాళ్లుగా ఎందుకు జాప్యం జరుగుతున్నట్టు..?
6. కేటీఆర్ ఇన్వెస్టర్ అని కొందరు , సుజనా చౌదరి అని మరి కొందరు అంటున్నారు …
— కేటీయార్‌కు ఆల్‌రెడీ టీన్యూస్ ఉంది… తెలుగులో మరో చానెల్ అక్కర్లేదు… కానీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి హిందీ చానెల్ ఒకటి కావాలి… నార్తరన్ ఇండియా ప్రేక్షకుల కోసం… అయితే నిజంగానే కేటీయార్ అండగా ఉంటే, డబ్బుకు ఢోకా ఏముంది..? అదే నిజమైతే ఇప్పటికే కొత్త చానెళ్ల పనులు బాగా పురోగతిలో ఉండి ఉండాలి… మైహోంకూ కేసీయార్ క్యాంపుకూ ఇప్పుడు టరమ్స్ బాగాలేవు కాబట్టి… ఏ రవిప్రకాష్‌నైతే తాము కేసులు పెట్టి, నానారకాలుగా వేధించారో అదే రవిప్రకాష్‌తో చానెళ్లు పెట్టిస్తే… అది చెప్పుకోదగిన విశేషమే కదా… అదే మరి కాలమహిమ అంటే… కానీ ఇది నిజమేనా..?! మరి సుజనా చౌదరి అంటారా..? తన మహాన్యూస్ చానెల్‌నే అడ్డికిపావుశేరులాగా అమ్మేసుకున్నాడు..!!
7. రవిప్రకాష్ దగ్గర టీవీ9లో పనిచేసిన చంద్రమౌళికి చెందిన రెడ్‌టి యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ఈ ఆర్‌టివీలో మెర్జ్ చేశారు …
— అయి ఉండవచ్చు… తద్వారా కొంత అనుభవమున్న మ్యాన్ పవర్ అందుబాటులోకి వస్తుంది… చంద్రమౌళి ఎలాగూ రవిప్రకాష్ మనిషే…
8. రవిప్రకాష్ నడుపుతున్న తొలి వెలుగు వెబ్ టీంను కూడా ఇందులోనే మెర్జ్ చేశారు …
— మ్యాన్ పవర్ కోసమైతే దీంట్లో తప్పులేదు… కాకపోతే తొలి వెలుగును సమాంతరంగా అలాగే నడిపించడం బెటర్… కానీ ఒకవేళ కేటీయార్ గనుక ఆర్టీవీ స్పాన్సరర్ అయ్యే పక్షంలో తొలి వెలుగు తన టెంపర్‌మెంట్ పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుంది అనివార్యంగా… అదే కోల్పోయినప్పుడు అది పారలల్‌గా నడవడం వేస్ట్, ఆర్టీవీలో విలీనం కావడమే బెటర్…
Share this Article