Abdul Rajahussain……… దేవదాసు “ప్రియసఖి”పార్వతి కాదు ‘చంద్రముఖి’ ! శరత్ దేవదాసులో…” నవలా న్యాయం ! శరత్ ‘దేవదాసు‘ పార్వతిని ప్రేమించాడు… కానీ అంతస్తులు అడ్డొచ్చి వారి పెళ్ళి జరగలేదు. దాంతో దేవదాసు పార్వతిని మరచిపోలేక భగ్నప్రేమికుడై తాగుబోతుగా మారతాడు. చేజేతులా జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటాడు…. అయితే నిజమైన ప్రేమ మనిషి వినాశనాన్ని కోరుకోదు కదా ! మరి దేవదాసు విషయంలో ఇలా …. ఎందుకు జరిగింది? అన్న తర్కం చాలా కాలంగా వుంది.
శరత్ చాలా తెలివైన రచయిత. భవిష్యత్తులో ఇటువంటి తర్కాలేవో తలెత్తుతాయేమో? అని ముందుగానే ఊహించాడేమో? ‘ చంద్ర
ముఖి ‘ పాత్రను సృష్టించి ఆ లోటును భర్తీ చేశాడు. దేవదాసు నవలలో ‘పార్వతి ‘ (పారూ ) నాయికగా కనిపించినా, వాస్తవానికి ‘చంద్రముఖే ‘ కథానాయిక. దేవదాసుపై పార్వతి చూపిన ప్రేమ కంటే, చంద్రముఖి చూపించిన ప్రేమనే గొప్పగా చిత్రీకరించాడు శరత్.
Ads
దేవదాసును తన వాడిగా చేసుకోవాలను కుంటుంది .‘పార్వతి.’ కానీ,.. తను దేవదాసు సొంతం కావాలనుకుంటుంది ‘ చంద్రముఖి ‘. అన్నీ వున్న జమీందారు బిడ్డయైనా దేవదాసును ఇష్టపడుతుంది పార్వతి. కానీ, అన్నీపోగొట్టుకొని , కాటికి కాళ్ళు చాపివున్న దేవదాసును ఇష్టపడుతుంది చంద్రముఖి.
పార్వతి ప్రేమ లౌకికమైంది. పార్వతి ప్రేమలో స్త్రీ సహజమైన కామం, మోహం , స్వార్థం వున్నాయి. చంద్రముఖి ప్రేమ అలౌకికమైంది. చంద్రముఖి ప్రేమ నిస్వార్థమైంది. కామం, మోహాలకు అతీతంగా దేవదాసుతో ఓ బలమైన మానసిక బంధం వుంది. దేవదాసు పార్వతి మధ్య ప్రేమ స్త్రీ,పురుష ప్రకృతి సంబంధంగా ఏర్పడింది. కానీ చంద్రముఖి దేవదాసుల ప్రేమ ప్రాకృతిక లౌకిక ఆనందానికి అతీతమైంది.
ప్రేమ అనేది బయటకు వ్యక్తం చేసేది కాదు.అది మనస్సు పొరల్లోంచి ఉబికొచ్చే ఓ వెచ్చని అనుభూతి. ఆనందమయమైన మానసిక రసస్పర్శ.
చంద్రముఖి పాత్ర ద్వారా ఇటువంటి ప్రేమనే వ్యక్తం చేశాడు శరత్ ! ‘పారూ ‘ అంటూ పార్వతిని పిలిచే పిలుపుకన్నా,’అమ్మీ ‘(తెలుగులో) అని చంద్రముఖిని పిలిచిన పిలుపులోనే దేవదాసు నిజమైన ప్రేమ దాగుంది.
చంద్రముఖి ఓ వెలయాలు. విటుల సుఖం కోసం బజారులో అందుబాటులో వున్న అమ్మకపు సరుకు. రూకలతో ఎవరైనా కొనుక్కునే అంగడి బొమ్మ. శారీరక సుఖం కోసం తన వద్దకు వచ్చేవారు , ఆ ‘కాస్సేపు ‘ ఎక్కడలేని ప్రేమను ఒలకబోసేవారు. చంద్రముఖి దాన్నే నిజమైన ప్రేమని భావించి భ్రాంతిలో బతికేది. తన అందం, మేని లావణ్యం, ఒంపు సొంపులపై ఆమెకెంతో గర్వం వుండేది. మన్మథుడైనా తన అందచందాలకు దాసుడు కావలసిందేనన్న అహంభావి.
అటువంటి చంద్రముఖిని అసహ్యించుకుంటాడు దేవదాసు. దాంతో చంద్రముఖి భ్రమలు తొలిగిపోతాయి. కళ్ళు తెరుచుకుంటాయి. భౌతికమైన సౌందర్యం శాశ్వతం కాదని తెలుసుకుంటుంది. నిజమైన ప్రేమ దేవదాసు రూపంలో కనిపిస్తుంది. దేవదాసుపై ప్రేమను పెంచుకుంటుంది.
ప్రేమంటే స్త్రీ, పురుషుల మధ్య వుండే శారీరక ఆకర్షణ కాదని,, దానికి అతీతమైన ఓ మానసిక బంధమన్న… సంగతి తెలిసొస్తుంది. దాంతో దేవదాసు సన్నిధిలో తన జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలని ఆశపడుతుంది. అది తీరని కోరికే అని తెలిసినా , ఎక్కడో ఏదో ఓ మూల
చిన్ని ఆశ చంద్రముఖిని ప్రలోభపెడుతుంది.
అందుకే దేవదాసును తన దగ్గరే వుంచుకొని సేవలు చేయాలని నిర్ణయించుకుంటుంది!. పార్వతి కూడా ఓ దశలో దేవదాసును తన ఇంట్లోనే వుండమంటుంది. అయితే అది… సాధ్యం కాని విషయమని పార్వతికి తెలుసు. అయినా మాటవరసకు అంటుంది.అలాగని పార్వతికి దేవదాసుపై ప్రేమ లేదని కాదు. కానీ దేవదాసు పార్వతి కోరికను తిరస్కరిస్తాడు…
(అప్పటికే పార్వతికి ఓ ముసలోడితో పెళ్ళై వుంటుంది ) ప్రేమించినందుకే పార్వతికి, తనకు ఈ కష్టాలు వచ్చాయని ప్రేమను ద్వేషిస్తాడు. అందుకే తన దగ్గరే వుండమని చంద్రముఖి అడిగినపుడు కూడా తిరస్కరిస్తాడు. “వద్దమ్మీ నువ్వు కూడా పార్వతిలా బాధపడతావు” అంటూ హెచ్చరిస్తాడు. అయినా చంద్రముఖి దేవదాసును ప్రేమిస్తూనే వుంటుంది.
కాసుల వర్షం కురిపించే తన వృత్తిని సైతం మానుకొని సాధారణ గృహిణిలా జీవించడానికి సిద్ధపడుతుంది. ఓ ఏడాది పాటు మారుమూల పల్లెలో అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతుంది. ఎలాగైనా.. దేవదాసును కలుసుకోవాలని ఆయన ఊరికి వెళుతుంది. అక్కడ దేవదాసు లేడని తెలుస్తుంది. ఎక్కడ వుండొచ్చో ఆరా తీస్తుంది.
కలకత్తాలోనే వున్నాడని తెలిసుకొని, వెదుక్కుంటూ వస్తుంది. కొన్నాళ్ళకు దేవదాసు రోడ్డు పక్కనే పడివుండటాన్ని చూసి, ఇంటికి తెచ్చి సపర్యలు చేస్తుంది. తప్పతాగిన మైకంలో చంద్రముఖిని గుర్తుపట్టడు దేవదాసు. మత్తు వదిలాక అసలు విషయం తెలుస్తుంది. తనను ఇంటికి తెచ్చి సపర్యలు చేస్తోంది చంద్రముఖే అని తెలుసుకుంటాడు.
ఈ లోకంలో తన గురించి ఇంతగా పట్టించుకునేది ఒక్క చంద్రముఖే అన్నది దేవదాసు నమ్మకం. దానికి కారణం చంద్రముఖిపై దేవదాసుకున్న అనురాగం. ప్రేమ. చంద్రముఖి ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుంటాడు దేవదాసు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. చివరి సారిగా చంద్రముఖితో దేవదాసు అన్నమాటలు వారిరువురి మధ్య అమలిన ప్రేమకు తార్కాణంగా…. నిలిచిపోతాయి.
“పాప పుణ్యాలను విచారించే భగవంతుడు నాకేం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ, మళ్ళీ జన్మంటూ వుంటే నిన్ను తప్పక పెళ్ళాడతాను” అంటాడు. చంద్రముఖి నిస్వార్థ ప్రేమకు నవలాకారుడు శరత్ అందించిన “నవలా న్యాయం” ఇది. చిన్నతనం నుంచి ప్రేమించిన పార్వతి విషయంలో కూడా దేవదాసు ఎప్పుడూ ఇలా ఊహించలేదు. పార్వతితో ఎప్పుడూ ఇలా అనలేదు కానీ, చంద్రముఖి విషయంలో మాత్రం దేవదాసు తన మనసులోని మాటను బయటపెడతాడు.
’ఈ జన్మలో ఒకటి కాలేకపోయినా… మరో జన్మలో అయినా ఒకటవుదాం’ అన్న దేవదాసు భావన చంద్రముఖి పాత్ర నిలువెత్తు గొప్పదనానికి నిదర్శనంగా భావించవచ్చు. పార్వతి, దేవదాసుల ప్రేమతో పోల్చితే… చంద్రముఖి దేవదాసుల మధ్య ప్రేమే ఎంతో గొప్పదిగా కనిపిస్తుంది. శరత్ దేవదాసు నవలను చదివిన వారు పార్వతినైనా మరిచిపోతారేమో గానీ, “చంద్రముఖి”ని మాత్రం మరచిపోలేరు. అంతగా చంద్రముఖి పాత్ర పాఠకుల గుండెల్లో ఇంకిపోతుంది.
ఇదే కథని కాస్త అటు ఇటు చేసి దాసరి నారాయణరావు గారు “ప్రేమాభిషేకం“ తీశారు. జయసుధ చంద్ర ముఖిగా, శ్రీదేవి పార్వతిగా నటించారు. ఈ సినిమాలో జయసుధ పాత్ర పట్లనే ప్రేక్షకుల్లో సానుభూతి కలుగుతుంది. అంతగా చంద్రముఖి పాత్రను తీర్చిదిద్దాడు శరత్ !!…. ఎ.రజా హుస్సేన్!
Share this Article