సరికొత్త టెక్నాలజీ విప్లవం… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందిన చాట్‌జీపీటీ ప్రపంచం దిశను, దశను మార్చేయబోతోంది అన్నట్టుగా మోస్తున్నారు దాన్ని… అది సౌకర్యమా..? మనిషి మెదడును మరింత కుంచింపజేయనుందా..? అలెక్సాకు, గూగుల్ సెర్చ్‌కూ దానికీ తేడా ఏమిటి..? అసలు మనిషి ఈ కృత్రిమ మేధపై ఇంకా ఇంకా ఆధారపడితే జరిగే అనర్థాలు ఏమిటి…? అనే ప్రశ్నల మీద చర్చించడం లేదు మనమిక్కడ…
గూగుల్ వాడు బాడ్ పేరిట సేమ్ చాట్‌జీపీటీ వంటి ఓ కృత్రిమ మేధతో పనిచేసే ఓ ప్రోగ్రామ్ రచించాడు… అదింకా పూర్తిగా ప్రవేశపెట్టబడలేదు, ఇంకా ప్రయోగదశలోనే ఉంది… కానీ ఒక ప్రశ్నకు బ్లండర్ జవాబు ఇచ్చిందనే ప్రచారం జరగడంతో, గూగుల్‌కు జరిగిన నష్టం ఎంతో తెలుసా..? 100 బిలియన్ల డాలర్లు… (అంటే ఎన్ని కోట్ల రూపాయలో తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చే కావాలి…)
కానీ చాట్ జీపీటీ ఎన్ని బ్లండర్స్ చెబుతున్నా సరే, దాని మార్కెట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది… యూజర్ల సంఖ్య కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది… అబ్బో, ఫలానా ప్రశ్నకు చాట్ జీపీటీ ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా..? హబ్బ, ఎంతటి ప్రజ్ఞ..? అంటూ వరుస స్టోరీలు రాస్తూనే ఉన్నారు జర్నలిస్టులు… కానీ గూగుల్ బాడ్ నాసిరకమూ కాదు, చాట్ జీపీటీ అంత నాణ్యమైన సరుకూ కాదు… దాన్ని నమ్ముకుంటే మనిషి మరింత అధోగతి పాలే…
Ads
ఉదాహరణ చెప్పాలా..? Mimicry Srinivos పరిచయం ఎవరికీ కొత్తగా అక్కర్లేదు కదా… జగమెరిగిన మిమిక్రీ ఆర్టిస్టు… అసలు మిమిక్రీనే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు… ఆయన తమ్ముడు అమెరికాలో ఉంటాడు… పేరు Sreekumar Gomatham… తను చాట్ జీపీటీకి ఒక ప్రశ్న సంధించాడు… Who is mimicry srinivas… ఇదీ ప్రశ్న… ఇదే గూగుల్ సెర్చ్‌లో కొడితే, పాపం, అది కనీసం నేరుగా మిమిక్రీ శ్రీనివాస్ వికీపీడియా లింక్ వరకు తీసుకెళ్లేది, మనం చదువుకునేవాళ్లం… కానీ చాట్ జీపీటీ ఇచ్చిన జవాబు ఇదీ… మీరే చదవండి…
మిమిక్రీ శ్రీనివాస్‌ను మిమిక్రీ శ్రీనివాస్ అని పిలుస్తుంటారుట… తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ కోసం పనిచేస్తుంటాడట… మిమిక్రీ ఆర్టిస్టే కాదు, కమెడియన్ కూడానట… బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా పొందాడట… పాపం శమించుగాక… 2020లో తన 49 ఏళ్ల వయస్సులో మరణించాడట… హతవిధీ…
ఈ జవాబు చదివిన షాక్ నుంచి కాసేపటికి తేరుకున్నాక శ్రీకుమార్ ‘ఆయన చనిపోలేదు, నా సోదరుడు ఆయన, ఇంకా బతికే ఉన్నాడు’ అని టైప్ చేశాడు… దాంతో చాట్ జీపీటీ క్షమాపణలు చెప్పింది… వ్యక్తుల వివరాలను చెప్పడంలో ఇంకాస్త ఖచ్చితత్వం అవసరమే… మిమిక్రీ శ్రీనివాస్ బతికే ఉన్నాడని వింటున్నందుకు సంతోషం… ఇది తెలిపినందుకు ధన్యవాదాలు అని బదులిచ్చింది… జరిగిన పొరపాటును అర్థం చేసుకుని, అచ్చం మనిషిలాగే క్షమాపణలు చెప్పిన తీరు మాత్రం బాగుంది అంటారా..? అవును, అది కరెక్టే…
Share this Article