ఇప్పుడు ట్రెండ్ ఖచ్చితంగా డిష్యూం డిష్యూం మాస్ మసాలా సినిమాలదే… లేకపోతే పఠాన్‌లో ఆ యాక్షన్ సీన్లు ఏమిటి..? ఆ వసూళ్ల వరద ఏమిటి..? కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, విక్రమ్, పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి… అన్నీ అంతే కదా… చివరకు సుడిగాలి సుధీర్ తీసిన గాలోడు కూడా అంతే… సరే, ఈ ఉదాహరణల్లో సుధీర్‌ను తీసేస్తే మిగతావన్నీ పెద్ద హీరోలవి… ఇమేజీ బిల్డప్పులకు పేరొందిన ‘ఏ’ కేటగిరీ స్టార్స్… కాబట్టి రజినీకాంత్, బాలకృష్ణ తరహాలో నవ్వొచ్చే ఫైట్లు చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తూనే ఉంటారు…
మరి బి గ్రేడ్, సి గ్రేడ్ కేటగిరీల్లో ఉండే చిన్న హీరోల మాటేమిటి..? వాళ్లు మెషిన్ గన్లు పెట్టి కాలుస్తూ ఉంటే నప్పదు… జనం మెచ్చరు… మరీ అబ్బురపరిచే కథాకథనాలు ఉంటే తప్ప… అందుకని కొత్త కథలు ఎన్నుకోవాలి, ప్రయోగాలు చేయాలి… కిరణ్ అబ్బవరం ఆ టైపే… ప్రతిదీ కొత్తగా ఉంటుంది కథ… ఒకటికాకపోతే మరొకటి సినిమా చాన్స్ వస్తూనే ఉంటుంది… చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో… ఇంకా నటనకు సంబంధించి నేర్చుకోవాల్సింది బాగా ఉన్నా సరే, తన స్థాయిలో తను కష్టపడి చేస్తాడు… కానీ ఏదీ పెద్దగా కలిసిరావడం లేదు… కానీ తన ప్రయాసను, వెళ్తున్న పంథాను మెచ్చుకోవచ్చు…
తాజాగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కూడా టైటిల్ మొదలుకొని సినిమా పోకడ దాకా కొత్తకొత్తగానే ఉంటుంది… పైగా ఈ సినిమాకు అల్లు అరవింద్ ముద్ర పడటంతో కాస్త ఆసక్తి పెరిగింది సినిమాపై… పెద్ద నిర్మాతలు కూడా కిరణ్ పట్ల చూపు సారించారు… గుడ్…
Ads
సినిమా సంగతికొద్దాం… ఇందులో ఓ కొత్త కాన్సెప్టు… అది హీరోయిన్ దర్శన అలవాటు… ఏ డే విత్ నైబర్ నంబర్ అనే కాన్సెప్టు… యూట్యూబ్ వీడియోలకు ఏది కొత్తగా ఉంటే అంతగా వ్యూస్, అంత రెవిన్యూ కదా… ఆ పిల్ల తన ఫోన్ నంబర్‌కు అటూఇటూ ఉండే నంబర్లకు కాల్ చేసి, కలిసి, వీడియో చేస్తుంటుంది… అలా హీరో పరిచయం అవుతాడు… ఇంకో నెంబర్ మురళీ శర్మది… ఈ ఇద్దరికీ వేరే ఉపకథలుంటాయి… హీరోయిన్ నైబర్ నంబర్ పేరిట ఓ ప్రాంక్ షూట్ చేయబోతుంది… అది కాస్తా నిజమైన షూటింగ్‌గా మారి ఓ కేరక్టర్ చచ్చిపోతుంది… ఇక అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్…
వాటిని ఈ సినిమా ప్రధానకథతో ముడేయాలి… కాస్త కామెడీ చిలకరించాలి… మరి సస్పెన్స్ ఎలా..? థ్రిల్, మిస్టరీ, సస్పెన్స్ కోసం టెర్రరిస్టులు, ఎన్ఐఏను కూడా సినిమాలోకి తీసుకొచ్చారు… కాస్త కంగాళీ యవ్వారమే అయినా సరే, దర్శకుడు కాస్తోకూస్తో తిప్పలుపడి కథను ఓ కొలిక్కి తీసుకొస్తాడు… కానీ ఏ ఎపిసోడ్‌తోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు… వావ్ అనిపించే సీన్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్…
నిజానికి కిరణ్ స్ట్రెయిట్, ప్లెయిన్ హీరో… మన జీవితాల్లో తారసపడే కేరక్టర్‌లా ఉంటాడు… కానీ అలా ఉంటే లాభం లేదనుకుని ఒకటీరెండు ఫైట్లు పెట్టించుకున్నాడు… నాట్ ఇంప్రెసివ్… తను అలా ఉంటేనే బెటర్… మాస్ మూస వైపు రావద్దు… ఆ టైపు సినిమాలు కొందరికే ఆప్ట్… ఉదాహరణకు అఖండ కేరక్టర్ బాలయ్య మాత్రమే చేయాల్సింది… ఆ డైలాగులు తనకే సూటవుతాయి… దాన్నే కిరణ్ చేస్తే కామెడీ అయిపోతుంది… ఆ తేడా పరిగణనలో ఉంచుకోవాలి…
సినిమాలో కశ్మీర బాగానే చేసింది… మురళీశర్మ కేరక్టరైజేషన్ కొంత అయోమయంగా ఉన్నా గానీ తను మాత్రం బాగానే చేశాడు… ఐనా తనకు వంకపెట్టడానికి ఏముంటుంది..? జగమెరిగిన ప్రతిభ… సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఎట్సెట్రా అన్నీ సోసో వ్యవహారమే… ఇది అల్లు అరవింద్ సమర్పించిన సినిమాయా అని ఆశ్చర్యమేస్తుంది… తన ఇతర సినిమాలకన్నా కిరణ్‌కు ఇది కాస్త బెటర్ కావచ్చుగాక… కానీ ఓ హిట్‌ను మోసుకొచ్చే సీన్ మాత్రం లేదు ఈ సినిమాకు..!!
Share this Article