రణబీర్ కపూర్ అంటాడు కదా… మై ఉడ్‌నా చాహ్‌తా హూఁ మై దౌడ్‌నా చాహ్‌తా హూఁ బస్ రుక్‌నా నహీఁ చాహ్‌తా… (నేను ఎగరాలని కోరుకుంటున్నా, నేను పరుగెత్తాలని కోరుకుంటున్నా, ఆగిపోవాలని అనుకోవడం లేదు…) సేమ్, అలాగే… నేనూ అదే అనుకునేదాన్ని… కానీ మాది రాజస్థాన్‌లోని ఓ మారుమూల ఊరు… ఆ ఊళ్లో ఆడవాళ్లు అంటే వండాలి, బట్టలుతకాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి… ఈ స్టీరియోటైప్ జీవితాన్ని బ్రేక్ చేయడం అంత సులభం కూడా కాదు… కానీ నేను దానికి సిద్ధపడ్డాను…
నా స్కూలింగ్ అయిపోయాక ఊళ్లో అందరూ అనసాగారు… ఇస్కీ షాదీ కరాదో… (ఈమె పెళ్లిచేసేయండి ఇక)… కానీ నా కల అది కాదు… ఎంతసేపూ అదే జీవితమా..? నేనూ బట్టలుతకాలి, వండాలి, పిల్లల్ని కనాలి, సాకాలి… ఇదేనా లైఫు..? నాన్నతో అన్నాను… ‘‘నేను నగరం వెళ్తాను’’… నాన్న వెంటనే ఒప్పుకున్నాడు… కానీ మాతో బంధాల్ని తెంచుకుని వెళ్లిపో అన్నాడు… ఎంత కఠినమైన తిరస్కృతి… కానీ ఆ మూల్యం చెల్లించడానికే రెడీ అయ్యాను…
వాళ్లందరినీ చూస్తూ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఢిల్లీ వెళ్లిపోయాను… పక్కా ఓ పల్లెటూరి పిల్లను… ఇంగ్లిష్ నాకు పెద్ద సమస్య… నా హిందీలో కూడా రాజస్థానీ యాస… నా లుక్కు పెద్దగా ఎవరికీ నచ్చేది కాదు… అనేక ఇంటర్వ్యూలలో రిజెక్ట్… రిజెక్ట్… కొందరు దోస్తులు, యూట్యూబ్ సాయంతో నా లుక్కు కొంచెం మార్చుకున్నాను… మోడరన్ ఫ్లేవర్ అద్దుకున్నాను… 2018 జూలైలో కేబిన్ క్రూ… విమానసిబ్బందిలో ఒకరిగా నాకు జాబ్ వచ్చింది…
Ads
ఎక్సయిట్‌మెంట్… ఇంటికి ఫోన్ చేశాను… ఎవరూ పట్టించుకోలేదు… మా ఊళ్లో నా జాబ్ సమాచారం బాగా వ్యాప్తి చెందింది… చాలామంది ‘‘దాని ముక్కు కోసేయాలి’’ అని కామెంట్స్ చేశారు… తరువాత ఇంటితో నా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి… మాటల్లేవు, ఫోన్లు లేవు… కేబిన్ క్రూ అంటే అదేమైనా దిక్కుమాలిన ఉద్యోగమా..? ఎందుకు నా ఊరివాళ్లు అంత తేలికగా, చీప్‌గా తీసిపారేస్తున్నారు..?
నా ఖర్మకొద్దీ పరిస్థితులు మారిపోయాయి… నా ట్రెయినింగ్ ఆగిపోయింది… నాకు పాస్‌పోర్టు లేదు… దాంతో నేను మళ్లీ కొలువులేనిదాన్ని అయిపోయాను… పైసల్లేవు… ఆదుకునేవాళ్లు లేరు… పలురోజులు పస్తులుండాల్సి వచ్చింది… ఏదో తీవ్రంగా నష్టపోతున్నాననే భావనే నన్ను ఫ్రస్ట్రేట్ చేస్తోంది… నా కుటుంబాన్ని కోల్పోయాను, నా ఊరిని కోల్పోయాను, నేనేం సాధించాను..?
2019లో ఓ రాత్రి అమ్మకు ఫోన్ చేశాను… పూర్తి ధైర్యాన్ని కూడగట్టుకున్నాను… కడుపులో దుఖమంతా తన్నుకొస్తోంది… నోటి నుంచి మాటే రావడం లేదు… మా, మా అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను తప్ప ఏమీ మాట్లాడటం లేదు… ‘‘అమ్మా, నేను చచ్చిపోతా ఇక్కడే ఒంటరిగా…‘‘ అన్నాను… ఆమె ఒకే మాట చెప్పింది… ‘‘ఏడవకు బిడ్డా, ఇంటికి రా…’’
ఊరు వెళ్లాను… ఊరు ఏమీ మారదని తెలుసు… నేను మారనని కూడా వాళ్లకు తెలుసు… అందుకే ఊరివాళ్లు ఏమీ కామెంట్స్ చేయలేదు… నాన్న కూడా ఓ మాటన్నాడు… ‘‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి…’’ ఆయనకు కూడా అర్థమైపోయింది నేను నగరాన్ని విడిచిపెట్టి రాలేనని… సంప్రదాయ జీవనం నుంచి భిన్నంగా బతకాలని అనుకుంటున్నానని…
ఈసారి మరింత స్ట్రాంగ్‌గా ఢిల్లీ వెళ్లాను… కొన్ని మోడలింగ్ అసైన్‌మెంట్స్ చేసేదాన్ని… బాడీ డబుల్‌గా నటించేదాన్ని… నేను కేబిన్ క్రూకు తొలిసారిగా సెలక్టయిన చాన్నాళ్లకు… అంటే 2022లో అబుదాబిలో కేబిన్ క్రూ జాబ్ వచ్చింది… మా ఊరి నుంచి విదేశాల్లో పనిచేసే తొలి మహిళ అయ్యాను…
ఎందుకోగానీ, ఊళ్లో మార్పు కనిపిస్తోంది… ఇంతకుముందులా నామీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు… పైగా మా, పప్పా నాగురించి గర్వంగా చెబుతున్నారు ఊళ్లో, తలెత్తుకుని…! నాతో బంధాలు తెంచుకుని వెళ్లిపో అన్న నాన్న ఇప్పుడు గట్టిగా హత్తుకుని ‘శెభాష్’ అన్నాడు… ఈ మార్పు ఏమిటి..? ఒకప్పుడు దిక్కుమాలిన కొలువుగా కనిపించిన విమానసిబ్బంది ఉద్యోగం ఇప్పుడు అభినందనల్ని మోసుకొచ్చింది ఎలా..?
ఏడాది గడిచింది… 23 దేశాలు తిరిగాను… చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి… నాన్నకు ఓ కారు కొనిచ్చాను… విచిత్రంగా మా పరిసరాల్లోని స్కూల్స్, కాలేజీల్లో మాట్లాడటానికి నన్ను రమ్మంటున్నారు… ఒకసారి మా ఊరు వెళ్లినప్పుడు ఓ పిల్ల అంటోందిలా… ‘‘అక్కా, నువ్వు మాకు ప్రేరణ’’… కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి… అసలు నేనేం సాధించానని… నిద్రలేని రాత్రులు, పస్తులున్న రోజులు యాదికొచ్చి కళ్లు తుడుచుకున్నాను… వాటి మూల్యం కనిపిస్తోందని అనుకున్నాను… ఓ నిస్సారమైన, సంప్రదాయ, గ్రామీణ, మహిళా జీవనచట్రం నుంచి బయటపడి, సొంత కాళ్ల మీద నేను నిలబడటమే వాళ్లందరికీ ఓ గెలుపుగా కనిపిస్తోంది… ఆశ్చర్యమే… ఆనందమే…
Share this Article