ఇది కూడా ఓ సినిమా కథకు ఏమీ తీసిపోదు… ప్రేమ, పెళ్లి, కక్షకట్టిన కుటుంబం, ఆటుపోట్లు, మొహం చూడని తల్లీతండ్రి, చివరకు మరణం, ఎడబాటు… అవును, నందమూరి తారకరత్న జీవితంలో వైఫల్యాలు ఎన్నో ఉండవచ్చుగాక… కానీ మనిషి చాలా మంచోడు, ఆ ఎన్టీయార్ కుటుంబసభ్యుల్లో పెద్దగా కనిపించని ఓ అరుదైన ప్రేమగుణం నిండుగా జీర్ణించుకున్న మనిషి… ఇప్పుడు ఆ ప్రేమ దూరమై ఆయన ప్రియురాలు కమ్ పెళ్లాం అలేఖ్యరెడ్డి కుమిలిపోతోంది…
ఆమె ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు గురించి చాలామంది రాశారు… ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి… ఎమోషనల్‌గా… ‘‘కలిసి పోరాడాం, చివరిదాకా అలాగే నిలబడ్డాం… కారులో నిద్రపోయిన క్షణం నుంచి ఇప్పటిదాకా చాలా చాలా దూరం ప్రయాణించాం… నువ్వొక ఫైటర్‌వి… నువ్వు ప్రేమించినట్టుగా ఇంకెవరూ ప్రేమించలేరు…’’ కదిలించే పోస్టు…
Ads
ఎన్టీయార్ కొడుకైతేనేం… తారకరత్న తండ్రిని ఇప్పుడు లోకమంతా నిందితుడిగా చూస్తోంది… జూనియర్ ఎక్కడ ఎన్టీయార్ నటవారసుడు అవుతాడో అనే కక్షతో అప్పటికప్పుడు అర్జెంటుగా ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభింపచేశారు తారకరత్న హీరోగా… కానీ కొబ్బరికాయ కొట్టగానే సినిమా రిలీజ్ కాదు కదా… అందులో రెండుమూడే ప్రేక్షకులకు కనిపించాయి… చివరకు జూనియర్ హరికృష్ణకు ‘‘ఆమోదిత కొడుకు’’ అయ్యాడు… తారకరత్న మాత్రం ఎక్కడికక్కడ వెలిసిపోయాడు… కారణం… తన ప్రేమ, కుటుంబంతో కయ్యం…
విజయసాయిరెడ్డి షడ్డకుడి బిడ్డ కావచ్చు బహుశా… ఆయనకు మరీ దగ్గర చుట్టం… ఆ అలేఖ్యరెడ్డితో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తారకరత్నకు పరిచయం, అది ప్రణయమైంది… అది పరిణయమైంది… కుటుంబం గుర్రుగా చూసినా సరే, ఆమె చేయి విడవలేదు… సంఘీ గుడిలో పెళ్లి చేసుకున్నాడు… తండ్రి తన మొహం చూడలేదు… ఎన్టీయార్ ఇచ్చిన వందల కోట్ల ఆస్తి ఉన్నా సరే అది తారకరత్నకు ఉపయోగపడలేదు… తండ్రి అంత కఠినాత్ముడు…
ఇలాంటి పెళ్లిళ్లలో కొన్నాళ్లకు కుటుంబం తిరిగి దగ్గరకు తీస్తుంది… మనమడో, మనమరాలో పుట్టాక అందరినీ కలుపుతుంది… ఈ కథలో అదీ లేదు… తండ్రిని కాదని విడిగా బతుకుతున్న తారకరత్న ఆర్థికంగా గడ్డురోజుల్ని చూశాడు… ఆమె కూడా భర్తతో స్థిరంగా నిలబడింది… ఆశించిన కెరీర్ రాకపోయినా పెద్దగా ఫీలైనట్టు కనిపించేవాడు కాదు… అయితే అంత పెద్ద పరివారం ఉండీ తను చాన్నాళ్లు ఆర్థికంగా అనామకుడిగానే బతికాడు… అదీ ట్రాజెడీ…
మరి విజయసాయిరెడ్డి గానీ, మంచివాడు అనిపించుకునే బాలకృష్ణ గానీ… తనకు చేయూతనివ్వలేదా..? చిక్కు ప్రశ్న… తారకరత్న చికిత్స, మరణ సమయాల్లో మాత్రం బాలకృష్ణే కనిపించాడు… తారకరత్న మరణించాక ఆమె, బిడ్డల బాధ్యత నాదీ అని కన్నీళ్లతో గుండెలకు హత్తుకున్నాడు… ఫస్ట్ నుంచీ బాలయ్య ఒక్కడే తారకరత్న పట్ల ప్రేమగా ఉండేవాడట… పైన కనిపించిన ఫోటో అదే… ఐనాసరే, తారకరత్న తండ్రి స్పందన మాత్రం కఠినాత్మకం… కొడుకు మరణించాక, ఇక లోకం తిట్టిపోస్తుందని భయపడి, విగతజీవుడిగా మారిన తరువాత కొడుకు దగ్గరకు వచ్చారు… చూశారు, అంతే…
నిజానికి ఎన్ని కులాంతర ప్రేమ వివాహాలు జరగడం లేదు… పైగా రెడ్డి, కమ్మ వివాహాలు కూడా వేలల్లో ఉంటాయి కదా… ఐనా తారకరత్న తండ్రి ఎందుకంత రిజిడ్‌గా ఉండిపోయాడు… తెలియదు… తారకరత్న గిన్నీస్ రికార్డు స్థాయిలో తొమ్మిది సినిమాలు ప్రారంభమై, కొన్ని ఆర్థిక కష్టాల్లో ఉంటే ఆ తండ్రి ఏమీ పట్టించుకోలేదు… తను పూనుకుంటే అప్పుడే తారకరత్న కెరీర్ ఇంకాస్త బాగుండేది… ఆ కుటుంబమే తనను పట్టించుకోలేదు… పైగా జాతికి నీతులు చెబుతుంటారు వాళ్లు… కష్టాల్ని అధిగమించి తారకరత్న తన కష్టార్జితంతో మోకిలాలో సొంత ఇల్లు కట్టుకున్నాడు… అక్కడే ఉండిపోయాడు, మరణించాక కూడా అక్కడికే తీసుకొచ్చారు తనను…
‘‘ఎంత దౌర్భాగ్యం అంటే.. తన చెల్లెలి పెళ్లికి కూడా ఆయనకు ఆహ్వానం అందలేదు. పార్ధివదేహాన్ని చూడడానికి వచ్చిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ… అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లలను కనీసం పలకరించ లేదు… ఈ ఘటన చూసి అక్కడకు వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు…’’ ఈ వార్త చదివితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… ఆ తండ్రి మొదటి నుంచీ అలాగే ఉంటున్నాడు… వాళ్ల గురించి తెలుసు కాబట్టే తారకరత్న ఎప్పుడూ తన కుటుంబం గురించి మాట్లాడేవాడు కాదు… ఒక్క బాలయ్య గురించే పాజిటివ్‌గా మాట్లాడేవాడు… అవును, బాలయ్యే తనకు అన్నీ… ఇప్పుడూ ఆ తల్లికీ, పిల్లలకూ అన్నీ తానై బాధ్యత వహించాలి… తారకరత్న అసలు తండ్రి అంటారా..? అసలు తనను తండ్రి అంటారా..?!
Share this Article