Bharadwaja Rangavajhala………. “నేనేదో గొప్ప సినిమా తీశాను. అది విడుదల కాకపోతే ప్రపంచం ఏదో కోల్పోయిందని నేనననుగానీ … నేను తీసిన సినిమాల్లో ఒకటి రిలీజ్ కాకుండా ఆగిపోవడం నాకెందుకో కొంచెం బాధగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలా వేసి నలుగురికీ చూపించాలనే కోరిక కూడా నాకు లేదు. ఎవరో వచ్చి అడుగుతారు … నేను ల్యాబు నుంచీ ఈ ప్రింటు తెప్పించి వేయడం జరుగుతోంది. ఈ సినిమా కూడా జనంలోకి వెడితే … నేను అనుకున్న విషయం తప్పో ఒప్పో వారు చెప్పేస్తే … చాలు … అంతకన్నా నేను ఇంకేమీ కోరుకోవడం లేదు. ….”
సరిగ్గా ఇవే మాటలు విశ్వనాథ్ గారు ఆ రోజు సాయంత్రం అన్నారు. ఆడ వేషంలో నర్తించి గొప్ప కీర్తిని సంపాదించిన కళాకారుడి జీవితంలోని వివిధ కోణాల్ని తెర మీద ఆవిష్కరించారు విశ్వనాథ్. అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పడంగా కొందరు వ్యాఖ్యానించినప్పటికీ … సినిమా మొత్తంగా విశ్వనాథ్ పద్దతిలోనే వినోదాత్మకంగా నడుస్తూనే ఓ సమస్యను చర్చించేదిగా సాగుతుంది…
కూచిపూడి నేర్చుకున్న హీరో… స్టేజ్ మీద భామా కలాపం అద్భుతంగా చేస్తాడు అని పేరు… అతను ఎందుకు ఆడ పాత్రలే చేస్తాడు? తను ఆడ పాత్రలో ఎలా ఉంటాడో వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉంటుంది అని ఆడ పాత్రలే చేస్తాడు… మరదలితో పెళ్లి అనుకుంటారు పెద్దలు. మరదలు ఒద్దు అంటుంది. కారణం స్టేజ్ మీద ఆడ పాత్రలు వేసే మనిషిని పెళ్లాడను అంటుంది.
Ads
హీరోయిన్ మాధవీమాల నటన , నర్తన రెండూ చాలా చాలా బాగున్నాయి. ఓంపురి ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. మహదేవన్ సంగీతం ముఖ్యంగా నేనెవరో … అనామికనో పాట … చాలా గొప్పగా వచ్చాయి. డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి ఈ చిత్రాన్ని కనీసం యూట్యూబులో అయినా విడుదల చేస్తే బాగుంటుందని విశ్వనాథ్ గారితో అంటే… ఆయన ఒప్పుకోలేదు.
నిజంగానే … అంతటి దర్శకుడు తన సినిమా విడుదల కోసం వేచి చూడడం … ఆ పరిస్థితి కల్పించడం బాధాకరమే. ఆనాటి నా బాస్ రామలక్ష్మి గారితో కలసి విశ్వనాథ్ గారితో మాట్లాడా… ఆయన థియేటర్ రిలీజ్ కే మొగ్గుచూపారు… మా మేడం నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆయన కన్విన్స్ కాలేదు… ఏం చేస్తాం…
(విశ్వనాథ్ సినిమాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి… అదేసమయంలో అసలు రిలీజుకు నోచనివీ ఉన్నాయి… ప్రత్యేకించి సిరిమువ్వల సింహనాదం సినిమా వాటిల్లో ఒకటి… కనీసం డిజిటల్ రిలీజ్‌కు కూడా ఆయన అంగీకరించలేదు… థియేటర్లలోనే జనం ఆ సినిమాను చూడాలని కోరుకున్నాడు… ఆ దిశలో ప్రయత్నించి నిరాశకు గురైనవారిలో ఈ రచయిత కూడా ఉన్నాడు…)
Share this Article