ఓటీటీ పుణ్యమాని అన్ని భాషల ప్రేమికులకు నాణ్యమైన సినిమా అందుబాటులోకి వచ్చింది… తమకు నచ్చిన సినిమాలను సబ్ టైటిల్స్ చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు… థియేటర్లకు వెళ్లి నిలువుదోపిడీ ఇవ్వాల్సిన పని లేదు… ఇష్టమున్న సీన్లు పదే పదే చూడొచ్చు, బోర్ సీన్లు జంప్ చేయొచ్చు, చెత్తా పాటల్ని స్పీడ్‌గా లాగించేయొచ్చు… మరీ అవసరమైతే నేరుగా క్లైమాక్స్ చూసేసి, వేరే సినిమాకు వెళ్లిపోవచ్చు… ఇలా మలయాళం సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి…
ఎప్పుడైతే ఆ సినిమాలు ఓటీటీలో చూసేస్తారో, ఇక ఆ సినిమా మీద ఆసక్తి ఉండదు ప్రేక్షకలోకంలో… దాని రీమేక్ హక్కులు కొని, మళ్లీ వ్యయప్రయాసలతో కొత్త సినిమా నిర్మించి రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు..? కానీ మన నిర్మాతలకు ఆ సోయి లేదు… నిజానికి డబ్బింగ్ హక్కులు కొని, పాపులర్ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలు, చౌకగా బొచ్చెడు డబ్బు…
Ads
పుష్ప, కాంతార, విక్రమ్, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కార్తికేయ ఎన్ని సినిమాలు ఈ డబ్బింగ్ వెర్షన్లతో పాన్ ఇండియా సినిమాలు అయిపోయి డబ్బు దండుకోలేదు… పోనీ, రీమేక్ అనగానే, ఒక భాషలో హిట్ అయ్యిందని వేరే భాషల్లో హిట్ కావాలని ఏముంది..? ఏమీ లేదు… అందుకే ఒరిజినల్ భాషలో హిట్టయిన చాలా మలయాళం రీమేక్స్ చతికిలపడుతున్నయ్… ఈ చర్చకు తెరతీసింది అక్షయ్ కుమార్ అట్టర్ ఫ్లాప్ సినిమా సెల్ఫీ… అక్షయ్ కెరీర్‌లో దీనంత ఫ్లాప్ సినిమా మరొకటి లేదు…
ఇది డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళం సినిమాకు రీమేక్… అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ బీమ్లానాయక్ కాస్త బెటర్… లూసిఫర్ సినిమాను తన ఇమేజీకి తగినట్టు ఏవేవో మార్పులు చేయించుకున్నా సరే చిరంజీవి సినిమా అంత పెద్దగా హిట్ కాలేదు… కప్పెల రీమేక్ బుట్టబొమ్మ గానీ, సేమ్ పేరుతో మలయాళం నుంచి రీమేకైన ఇష్క్ గానీ పెద్దగా క్లిక్ కాలేదు… ఇష్క్‌లో తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ హీరోహీరోయిన్లు…
సుధీర్ బాబు నటించిన హంట్ అనే సినిమాకు ఒరిజినల్ మలయాళం మూవీ ముంబై పోలీస్… అదీ పెద్దగా సక్సెస్ కాలేదు… మలయాళంలో ఓ మోస్తరుగా ఆడిన జోసెఫ్‌ను రాజశేఖర్ హీరోగా శేఖర్ పేరిట తీశారు… అదెప్పుడు వచ్చిపోయిందో జీవితకు కూడా గుర్తుండి ఉండదు… ఇలా ఎన్నో సినిమాలు మలయాళంలోని ఒరిజినల్ మూవీల్లోని ఆత్మను పట్టుకోలేక అడ్డదిడ్డంగా రీమేక్ చేసి, చేతులు కాల్చుకున్నారు… ఒకే పెద్ద ఎగ్జెంప్షన్ ఏమిటంటే… దృశ్యం-2 సినిమా… అది సూపర్ హిట్టయింది… అది ఆ కథలోని దమ్ము… సో, రీమేక్ సక్సెస్ ఫార్ములా అనుకుంటే అంతకుమించిన భ్రమ మరొకటి లేదు…!!
తెలుగులో కథారచయితలు లేరా..? ట్రెండ్‌కు తగినట్టు రాయలేరా..? చివరకు త్రివిక్రమ్ వంటి చేయితిరిగిన రచయిత సైతం రీమేక్ సినిమాల్ని తెలుగీకరించుకుంటున్నాడు… పవన్ కల్యాణ్ హీరోగా రాబోయే ఓ సినిమాకు ఒరిజినల్ వినోదయ సీతమ్… ఎంకరేజ్ చేస్తే రాయగలిగిన వాళ్లు బోలెడు మంది… కానీ వేరే భాషలో సక్సెసయితే గుడ్డిగా వాటి హక్కులు తెచ్చుకుని తెలుగీకరించుకుంటున్నారు… ఐతేనేం, హిట్టవుతుందనే నమ్మకం లేదు… మరి అలాంటప్పుడు అచ్చమైన తెలుగు కథలే రాయించుకోవచ్చు కదా…!!
Share this Article