Misinterpretation:
హైదరాబాద్ విలేఖరి:-
మీరు రెండు గంటల క్రితం ఢిల్లీలో విమానం ఎక్కే ముందు అన్న మాటకు కట్టుబడి ఉన్నారా?
రాజకీయ నాయకుడు:-
ఢిల్లీలో చలి ఎక్కువగా ఉండి… నా మాట వణికి… మీ ఢిల్లీ విలేఖరికి నా మాండలికం అర్థం కాక… అది మాండురాగం అనుకున్నాడు. నిజానికి నేను పాడింది పాండురాగం.
హై. వి.:-
నేనడుగుతున్నది మీ సంచలన ప్రకటన గురించి. పాడు రాగాల గురించి కాదు.
Ads
రా. నా:-
నేను చెబుతున్నది కూడా మీరడిగిందే. నువ్వడిగింది నేనేనాడయినా కాదన్నానా?
హై. వి:-
నేను మాట్లాడితే… మీరు పాట పాడుతున్నారు. తల్లి కడుపులో పడ్డప్పటినుండే నేను ఇంగ్లీషు తిని తాగి పీల్చి పెరిగాను. నాకు తెలుగు మాటే సరిగ్గా అర్థమై చావదు. ఇక మీరు పాడితే ఎలా? సరిగ్గా మాట్లాడండి.
రా. నా:-
మీ ఢిల్లీ విలేఖరి నా మాటను వక్రీకరించి… నా పాటను మిమిక్రీకరించి… నా భావాన్ని పరాభవించాడు.
హై. వి:-
మా ఢిల్లీ విలేఖరి అంత సమర్థుడా? ఆశ్చర్యంగా ఉందే! ఆయన ఇక్కడ పనికిరాడని అక్కడికి పంపారని మా ఆఫీసు గోడలు చెవులు కొరుక్కుంటూ ఉంటాయి. మా విలేఖరి నోట్లో వేలు పెడితే కొరకడం తెలియని అమాయకుడు. ఆయన పంపిన వీడియో ఇది. వినండి మీరన్న మాట మీకే తెలుస్తుంది.
రా. నా:-
ఢిల్లీలో నేను మాట్లాడింది నిజం. ఆ వీడియోలో ఉన్నది నేనే. కానీ ఆడియో నాది కాదు. మీ విలేఖరి నా గొంతును మిమిక్రీ చేసి… నా వ్యాఖ్యలను వక్రీకరించి… నన్ను బద్నాం చేశాడు. దీని మీద సిటింగ్ జడ్జ్ తో న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
హై. వి:-
రెండు గంటల్లో మా ఢిల్లీ విలేఖరి ఇన్ని విద్యలను ప్రదర్శించి… మిమ్మల్ను బద్నామ్ చేస్తాడని మీరు నిజంగా అనుకుంటున్నారా?
రా. నా:-
వీడియోలో చూడండి. మీ మైక్ 67.7 డిగ్రీల కోణంలో వంగి పరావర్తనం చెంది… నన్ను పరాభవిస్తోంది.
హై. వి:-
సార్! నేనేమి అడుగుతున్నాను?
మీరేమి చెబుతున్నారు?
మీకేమయినా అర్థమవుతోందా?
రా. నా:-
నా వ్యాఖ్యలు మీ కెమెరా లెన్స్ లో వికిరణమై… ప్రతిబింబమే బింబం అయ్యింది. అద్దంలో ప్రతిబింబం అసలు కాదు. అద్దం అబద్దం. నేను నిప్పులాంటి నిజం.
హై. వి:-
సార్! ఉస్మానియా చెట్ల కింద అర కప్పు ఇరానీ చాయ్ లు తాగుతూ… ఎంసిజె చేసి… పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి…రాసి… ఏ ఉద్యోగం రాక… నా ఖర్మ కాలి… జర్నలిస్టును అయ్యాను. ఇప్పుడు నా కడుపు, మెదడు అన్నీ కాలుతున్నాయి…
రా. నా:-
మీ ఛానెల్ రెండు నాల్కల ధోరణి మీద నేను అంతర్జాతీయ ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయదలుచుకున్నాను.
హై. వి:-
కొండ నాలుకకు టిఆర్పి మందు వేయబోతే ఉన్న బార్క్ నాలుక కూడా పోయి… మేమేడుస్తుంటే… మాలో రెండు నాల్కలను దర్శించిన మీ జ్ఞాన నేత్రాలను వర్ణించడానికి నా దగ్గర మాటల్లేవు.
సార్!
మీ కార్లో కొద్దిగా నాకు చోటిచ్చి… ఎర్రగడ్డలో దిగబెడతారా? ఈ ఐడి కార్డు మా ఆఫీసులో ఇవ్వగలరా? ఈ మైక్ నా గుర్తుగా మీదగ్గరే ఉంచుకోండి.
నా పేరేమిటి?
ఇంతకూ నేనెవరు?
రా. నా:-
నీకు పేరు లేదు. నువ్వు రాజకీయ వ్యాఖ్యల వక్రీకరణ బాధితుడివి. పొడిగా అయితే నీ పేరు రా.వ్యా.వ.బా.
హై. వి:-
అబ్బా!
ఏమి పొడిచారు సార్!
మా రా. వ్యా. వ. బా. సంఘం తొలి మీటింగ్ కు మీరే వచ్చి కుళ్లబొడవండి.
రా. నా:-
… కుళ్ళబొడిచింది చాలదు… తీ!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article