John Kora……… మన దేశంలో ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ వంటి కేంద్ర సంస్థలైనా.. సీఐడీ, ఏసీబీ వంటి రాష్ట్ర సంస్థలైనా.. ఎవరైనా ప్రభుత్వాలు చెప్తేనే దర్యాప్తు చేస్తాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్తేనో.. రాష్ట్రంలో ఉండే అధికార పార్టీలు చెప్తేనో దర్యాప్తు చేసి.. తదుపరి విచారణను కోర్టుకు అప్పగిస్తాయి.
అయితే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వెనక, ముందు ఏమీ చూసుకోకుండానే దర్యాప్తు, విచారణ, తీర్పు ఇచ్చేస్తున్నాయి. వెబ్ మీడియాను అయితే మనం ఆపే పనే లేదు. స్వీయ నియంత్రణ ఉండదు. ఏదో ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్, వెబ్‌సైట్ చెప్పిందే సుప్రీంకోర్టు కంటే అత్యున్నత తీర్పులా మారిపోయింది.
పొద్దున టీవీ చూస్తుంటే.. (పొద్దున్నే ఇంట్లో అందరూ నిద్ర లేవడానికి టీవీ9 పెడతాం. ఆ హడావిడికి అందరికీ నిద్ర మత్తు వదులుతుంది).. ప్రీతి ఆత్మహత్య వెనుక మరో కోణం అంటూ నాలుగైదు బ్రేకింగ్ ప్లేట్లు వేసింది. కేఎంసీలో రూ.50 లక్షల బాండ్ ఉండటం వల్లే.. సైఫ్ బారి నుంచి తప్పించుకోలేక.. కాలేజీలోనే కొనసాగింది. అనేది ఆ బ్రేకింగ్ న్యూస్‌లోని విషయం.
Ads
ప్రీతి ఆత్మహత్య విషయంలో అందరిలాగే నేనూ బాధపడ్డాను (ఇలా రాయాలి. లేకపోతే తర్వాత చెప్పే విషయంపై నన్ను ఆడుకునే అవకాశం ఉంది). దేశంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్‌ను తయారు చేయాలంటే దాదాపు రూ.1.7 కోట్లు ఖర్చు అవుతుందని ఇటీవల ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. అదే మెడిసిన్ పీజీ విద్యార్థి కోసం రూ.2 కోట్లకు పైగానే ఖర్చు ఉంటుంది. కానీ, మెడిసిన్ విద్యార్థులు ఏ కోటాలో సీటు వచ్చినా.. ఇంత మొత్తం (ఎన్ఆర్ఐ కోటా తప్ప) ఫీజు కట్టరు. ఎవరు ఎంత ఫీజు కట్టాలో కౌన్సిలింగ్ టైమ్‌లోనే చెప్తారు.
విద్యార్థులు కట్టగా మిగిలిన ఫీజును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే ఆయా కాలేజీలకు అందిస్తుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా విద్యార్థి.. మధ్యలోనే చదువు మానేస్తే ఆ సీటు ఖాళీగా ఉంచాల్సిందే. అది కాలేజీ వాళ్లకే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టం. అందుకే నీట్ పరీక్ష విధానం వచ్చిన దగ్గర నుంచి అన్ని మెడికల్ కాలేజీలు బాండ్స్ రాయించుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఈ బాండ్స్ అనేవి రాష్ట్రాన్ని బట్టి, కాలేజీని బట్టి మారుతుంటాయి. ఏపీలో ఒక బాండ్, తెలంగాణలో మరో బాండ్.. మరో కాలేజీలో మరో రకం బాండ్. ఇది విద్యార్థులు కాలేజీని మధ్యలో మానేయకూడదనే ఉద్దేశంతో నిర్ణయించింది. అంతే కానీ వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు.
ఇక ర్యాగింగ్ వల్ల విద్యార్థులు కాలేజీ వదిలి వెళ్లిపోతే ఇంత భారీ డబ్బు కట్టాలే అని బాధపడుతుంటారు. ఒత్తిడికి గురవుతారు. అసలు ఈ ర్యాగింగ్ అనే దాన్ని అణచివేయడం సదరు కాలేజీ మేనేజ్‌మెంట్ బాధ్యత. ప్రీతి విషయంలో కాలేజీ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసిపోతోంది. అయితే బాండ్ రాయించుకోవడం వల్లే ప్రీతి ఒత్తిడికి గురైంది అని రిపోర్టు చేయడం మాత్రం అబద్దం.
ప్రీతి వాళ్ల డాడీతో.. వచ్చేస్తే బాండ్ డబ్బులు కట్టాలి డాడీ అని చెప్పి ఉండొచ్చు. కానీ పీజీ సీటును వదిలి వచ్చే వాళ్లు చాలా తక్కువ. ర్యాగింగ్ మొదటి మరియు చివరి కారణం. అంతే కానీ ప్రభుత్వం పెట్టిన బాండ్ కాదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్లను తయారు చేస్తుంటే.. ఆ తర్వాత చాలా మంది ప్రైవేట్ క్లీనిక్స్ పెట్టుకుంటున్నారని.. విదేశాలకు వెళ్లిపోతున్నారని.. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని నిబంధన కూడా పెట్టారు. బాండ్ తప్పు అయితే గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని నిబంధన పెట్టడం కూడా తప్పే..
అందుకే చెప్పేది ఏంటంటే.. ఆ బాండ్ ఎందుకు పెట్టారో మీడియా సంస్థలకు అవగాహన ఉండాలి. అంతే కానీ.. బాండ్ కూడా మరో కోణం అని రాయడం అంటే.. మనకు అవగాహన లేదనే అర్థం… #భాయ్‌జాన్
Share this Article