ఇదొక మిస్టరీగా మారినట్టుంది… ప్రభాస్ రాముడిగా నటించిన చరిత్రాత్మక, పౌరాణిక సినిమా ఆదిపురుష్… జనవరిలోనే రిలీజ్ కావల్సి ఉండింది… కానీ జూన్‌కు మార్చారు… ఈ 6 నెలలూ దేనికీ అంటే..? సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ తిట్టిపోశారు… రావణుడి వేషం, హనుమంతుడి పాత్ర మొహం, వానరసైన్యం తదితర సీన్లు చూసి ప్రేక్షకులకు డోకొచ్చింది…
మరీ జాంబవంతుడు, వానరసైన్యం సీన్లను ఏవో పాత ఇంగ్లిష్ సినిమాల నుంచి యథాతథంగా కాపీ చేసి, పేస్ట్ చేసినట్టున్నారు… బహుశా ఇండియన్ సినిమాకు సంబంధించి టీజర్ చూసి, ఇంతగా జనం నెగెటివ్‌గా రియాక్టయిన సినిమా మరొకటి లేదేమో..! ఆ దెబ్బకు ఠారెత్తిన నిర్మాతలు బాబ్బాబు, గట్టెక్కించు అని సదరు దర్శకుడు ఓం రౌత్ చేతులు పట్టుకున్నారు…
ఇంత భారీ సినిమా తీయడమే జీవితకాలపు అదృష్టం అనుకోవాల్సిన సదరు రౌతు అత్యంత తేలికగా మరో 150 కోట్లు అవుతాయి, ఆరు నెలలు అదనంగా టైమ్ కావాలి అన్నాడు… అత్యంత బాధ్యతారాహిత్యం… అలాంటి దర్శకుడిని పెట్టుకున్నందుకు అనుభవించండి అంటూ నిర్మాతలను ఫిలిమ్ సర్కిళ్లు వెక్కిరించాయి… ఈమధ్యలో ప్రభాస్ తలపట్టుకున్నాడు…
Ads
ఇదీ ఇప్పటివరకు జరిగిన కథ… అందరూ ఏమనుకుంటారు… ఫాఫం, జనానికి నచ్చని సీన్లను గ్రాఫిక్స్ సాయంతో మళ్లీ మార్చేస్తున్నారు, ఇంకాస్త మేకప్ వేసి, పాత తప్పులకు పాతరేసి, కొత్తగా రిలీజ్ చేయబోతన్నారు, మరి 150 కోట్లంటే మాటలా..? అని భావిస్తున్నారు… కానీ …?
ఆశ్చర్యం ఏమిటంటే..? అలాంటి పెద్ద పెద్ద మార్పులు, చేర్పులు ఏమీ ఉండబోవడం లేదనీ, పైపైన టూత్ పాలిష్ పనులు తప్ప మేజర్ వర్క్ ఏమీ లేదని ఈ సినిమాకు వర్క్ చేసిన ఓ కీ టెక్నీషియన్ చెబుతున్నాడు… ఆ అపరిచిత టెక్నీషియన్ చెబుతున్న ప్రకారం, సినిమా ఎడిటింగ్‌లో గానీ, గ్రాఫిక్స్ వర్క్‌లో గానీ పెద్ద మార్పుల్లేవు…
సినిమా ఎడిటర్ అశిష్ మాత్రే కూడా ఆమధ్య చెప్పాడు… ‘‘మేం ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నాం… దర్శకుడి మదిలో ఉన్న ఆలోచనల మేరకే సినిమా రూపొందింది… టీజర్‌కు ప్రేక్షకుల రెస్పాన్స్ చూశాక అందరమూ షాక్ తిన్నాం… ప్రేక్షకులు ఊహల్లో ఉన్నది వేరు, దర్శకుడు ఓం రౌత్ చూపించాలని అనుకున్న రామాయణ దృశ్యాలు వేరు… అందుకే ప్రేక్షకులకు వెంటనే అది ఎక్కలేదు… కానీ త్రీడీలో టీజర్ చూశాక కొందరు కన్విన్స్ అయ్యారు… సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులు కూడా కన్విన్స్ అవుతారు…
మేం పెద్దగా ఆదిపురుష్ సినిమాకు మార్పులేమీ చేయడం లేదు… అది ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే ఉంటుంది… (సీతమ్మ కిడ్నాప్‌ను కూడా జస్టిఫై చేసేలా ఉంటుందని అప్పట్లో రావణ పాత్రధారి సైఫ్ చెప్పిన సంగతి తెలిసిందే… అంటే ఇప్పటికీ సినిమా అదే కథ చెప్పబోతున్నదన్నమాట…) ఎవరో ఏదో విమర్శించారని మేం మా ప్లాన్, మా కథ మార్చలేదు… మేం ఎక్కడ సినిమా ఆపామో, అక్కడి నుంచే మళ్లీ స్టార్ట్ చేశాం, అంతే… ఎందుకంటే… మా ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరిగింది… మరీ సరిదిద్దాల్సినంతగా తప్పులేమీ లేవనే మా భావన’’ అని చెబుతూ వచ్చాడు…
సరే, బాగానే ఉంది… మీ ఒరిజినల్ ప్లాన్ మేరకు ఉన్న సినిమాను ప్రేక్షకులు అంగీకరిస్తారా..? ఛీత్కరిస్తారా..? అనేది వేరే సంగతి… ఏ మార్పులూ లేనప్పుడు మరి ఆరు నెలల అదనపు టైమ్ దేనికి తీసుకుంటున్నట్టు..? 150 కోట్లు దేనికి ఖర్చు చేస్తున్నట్టు… మొత్తం దాదాపు 600 కోట్ల ఖర్చు అనేది నిజమేనా..? అసలు ఈ గ్రాఫిక్ సినిమాల నిర్మాణవ్యయంలోనే ఏదో భారీ మతలబులు ఉన్నట్టున్నాయి..? ఏమో, ఒక్క సినిమా కథలైనా ఈడీ తవ్వగలిగితే బెటరేమో… ఈ రావణమాయలన్నీ బయటపడతాయి…!!
Share this Article