ప్రధాని మోడీ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… ఎందుకంటే..? మన ప్రభుత్వం తాలూకు ప్రతి సిస్టంలోనూ సుప్రీంకోర్టు తన భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది… ఎలక్షన్ కమిషనర్ల నియామకాలకు ఓ కొత్త పద్ధతిని నిర్దేశించింది తాజాగా… దాని ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం చీఫ్ జస్టిస్ సూచనల మేరకే ఎలక్షన్ కమిషన్లను నియమించాలనేది సుప్రీం ఐదుగురు సభ్యుల ధర్మాసనం తాజా తీర్పు… ఎందుకంటే… ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని నివారించడానికి..!
సరే, బాగుంది… కానీ ఒక నియామక ప్రక్రియ ఇలా ఉండాలి అని సుప్రీం నిర్దేశించగలదా..? ఎన్నో ఏళ్లుగా రాజ్యాంగం నిర్దేశించిన మేరకే నడుస్తున్న పద్ధతిని కూడా సమీక్షించడం కరెక్టేనా అనే ఓ ప్రశ్న తలెత్తబోతోంది… కాగ్, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు ఇలాంటివన్నీ రాజ్యాంగబద్ధంగా నడిచే సంస్థలు… ఎవరి స్వయంప్రతిపత్తి వాళ్లకుంది… ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్… ఒకరి పరిధిలో ఒకరు జోక్యం చేసుకోరు సాధారణంగా… మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో తమ పాత్ర ఉండాలని సుప్రీం చెబుతోంది…
నేషనల్ జుడిషియల్ కమిషన్ వద్దంటుంది… కొలీజియమే ఫైనల్ అంటుంది… నా పరిధిలోకి ఎవరూ రావద్దు, మా జడ్జిల నియామకం మా ఇష్టం అంటుంది… కేంద్రం కూడా ఈవిషయంలో ఏమీ చేయలేకపోతోంది… కేంద్రం చేసిన చట్టాన్ని సుప్రీం అభయెన్స్‌లో పెట్టింది… రాజ్యాంగ సవరణ చేసైనా టూథర్డ్ మెజారిటీతో దీన్ని అమల్లోకి తీసుకురావాలనే బలమైన ఉద్దేశం, సుప్రీంతో గోక్కోవడం ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదు… న్యాయ మంత్రి, రాజ్యసభ చైర్మన్ అప్పుడప్పుడూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తున్నా సుప్రీం దాన్నేమీ పట్టించుకోవడం లేదు…
Ads
అలాంటిది ఇప్పుడిక ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో మాత్రం మా మాట కూడా చెల్లుబాటు కావాలంటోంది… దీన్ని కూడా మోడీ సర్కారు పాటిస్తుందా..? వ్యతిరేకిస్తుందా..? చూడాలి…! కేంద్రం నియమించే ఎలక్షన్ కమిషనర్లు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నవారి మాటే వింటారనే సూత్రీకరణ కరెక్టు కాదనిపిస్తోంది… సుప్రీం జడ్జిల నియామకంలో కొలీజియం బదులు ప్రధాని, ప్రతిపక్షనేత, సుప్రీం జడ్జి సూచనలే చెల్లుబాటు కావాలని ఇంకెవరైనా ప్రతిపాదిస్తే..?
ఎన్డీటీవీ ఇంకాస్త దూరం వెళ్లి ఇంకొన్ని పరిణామాలను ఊహిస్తోంది… ఇక ఎన్నికల కమిషన్ సొంత, స్వయంప్రతిపత్తి కలిగిన సెక్రెటేరియట్ కలిగి ఉండబోతోందనీ, ఎన్నికల సంఘం రూల్స్ తనే ఫ్రేమ్ చేసుకుంటుందనీ, స్వతంత్ర బడ్జెట్ రూపొందించుకుంటుందనీ, అభిశంసన నుంచి ప్రొటెక్షన్ పొందుతుందనీ విశ్లేషించింది… పొలిటికల్ పవర్ ఈ దేశంలో అల్టిమేట్… దీన్ని సహిస్తుందా చూడాలిక… అంతేకాదు, ఎన్నికల కమిషన్ ఇక నేరుగా కన్సాలిడేటెట్ ఫండ్ నుంచి తమ బడ్జెట్ నిధులు డ్రా చేసే అవకాశం ఉందట… ఇకపై పీఎం ఆఫీసు, లా మినిస్ట్రీ అనుమతులు అక్కర్లేదట…
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ‘సరైన వ్యక్తి’ ఉండాలంటే ఫెయిర్, ట్రాన్స్‌పరెంట్ మెకానిజం ద్వారా ఎంపిక జరగాలనేది సుప్రీం ఉద్దేశం… స్థూలంగా రైట్… కానీ అక్కడ ముగ్గురు ఉంటారు… చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తీసుకునే నిర్ణయాన్ని మిగతా ఇద్దరు వ్యతిరేకిస్తే అది చెల్లుబాటు కాదు, మెజారిటీ పనిచేస్తుంది… (గతంలో శేషన్ పెత్తనాన్ని కత్తెర వేసేందుకు పీవీ తీసుకున్న నిర్ణయం)… అలాంటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక పద్ధతి మార్చి, మిగతా ఇద్దరి ఎంపిక పాత పద్ధతిలోనే ఉంటే ప్రయోజనం ఏమిటి..?
ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ప్రెసిడెంట్ నియమించే పద్ధతి ఉంది… ఆరేళ్లు వాళ్ల అధికార కాలవ్యవధి… ఎక్కువగా మాజీ బ్యూరోక్రాట్లను, ప్రధాని సూచనల మేరకు ప్రెసిడెంట్ నియమించడం అలవాటు… ఇప్పుడు ఈ తీర్పుకు నేపథ్యం ఏమిటంటే… మాజీ ఐఏఎస్ అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడం… నవంబరు 18న వీఆర్ఎస్ తీసుకున్నాడు, 19న ఎన్నికల కమిషనర్ అయిపోయాడు… 21న బాధ్యతలు కూడా తీసుకున్నాడు… తను 2025లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిపోతాడు పద్దతి ప్రకారం…
ఇప్పుడున్న ముగ్గురూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది… ఇప్పుడు సుప్రీం తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోంది… కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి ఈ తీర్పును ‘చరిత్రాత్మకం’ అని వర్ణించాడు… సహజంగానే ప్రతిపక్షాలు సమర్థిస్తాయి… ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే… ఈ తీర్పును సమర్థించి ఉండేదా..? అప్పుడు బీజేపీ గనుక ప్రతిపక్షంలో ఉండి ఉంటే, బీజేపీ లీడర్ మాట కూడా చెల్లుబాటయ్యే కొత్త పద్ధతిని ఆహ్వానించి ఉండేదా..? అనేక ప్రశ్నలు… ఇప్పుడు మోడీ ఈ తీర్పును స్వాగతించి, ఆ ప్రకారమే నడుచుకోబోతున్నాడా..? రేప్పొద్దున ఆర్మీ, ఇతర కీలక నియామకాల్లోనూ ఇదే పద్ధతి పాటించే పరిస్థితి తలెత్తితే వాటికీ ఆమోదం పలుకుతుందా..? ఇదీ వేచిచూడాల్సి ఉంది…!!
Share this Article