ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్‌కు యాస్పిరేషన్స్ ఎక్కువ… తెలంగాణ భాషలో చెప్పాలంటే వేషాలు ఎక్కువ… జగన్ దగ్గర నడిచాయి గానీ కేసీయార్ నాలుగు రోజులు భరించలేకపోయాడు తనను..! వెరసి తెలంగాణ వదిలేసి పూర్తిగా ఆయన టీం ఏపీకి వలసపోయింది… కానీ టీడీపీ స్ట్రాటజిస్టు రాబిన్ శర్మ పద్ధతి వేరు… తన పనేదో తనది… ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్‌లా కుర్చీలు కావాలనే ఆశలేమీ కనిపించవు తనలో… పద్ధతైన మనిషి…
తను కూడా గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసినా సరే, ఆ ఛాయలు పెద్దగా ఇతనిలో కనిపించవు… అయితే ఏవో రెండుమూడు సైట్లలో రాబిన్ శర్మ తొలి విజయం అని చదివాను… బహుశా తెలుగుదేశం అనుకూల సైట్లు కావచ్చు… ఏమిటయ్యా అంటే… మేఘాలయలో రాబిన్ శర్మ ఎన్పీపీ విజయం కోసం స్ట్రాటజిస్టుగా మస్తు పనిచేశాడు… ఆ పార్టీ అధినేత కొన్రాడ్ సంగ్మా మళ్లీ సీఎం కాబోతున్నాడు, ఇక తదుపరి మజిలీ తెలుగుదేశం గెలుపే… అట… (ఏపీలో వైసీపీకి అదే రాబిన్ శర్మ పాత దోస్త్ ప్రశాంత్ కిషోర్ టీమే ఇంకా పనిచేస్తున్నదని మరిచిపోతే ఎలా..?)
నిజానికి ఆల్‌రెడీ గతంలో ఈయన కేజ్రీవాల్ కోసం పనిచేసినట్టు గుర్తు… (వీళ్ల కంపెనీ పేరు షోటైమ్ కన్సల్టింగ్) మరి సంగ్మాది తొలివిజయం ఎలా అవుతుంది..? సరే, దాని మాటెలా ఉన్నా సరే… ఎన్పీపీ సంపూర్ణ విజయం ఏమీ సాధించలేదు…
Ads
ఏదో కారణం మీద బీజేపీ, ఎన్పీపీ నడుమ విభేదాలు తలెత్తాయి… అంతకుముందు అవి రెండూ దోస్తు పార్టీలే… విడివిడిగా పోటీచేశాయి ఈసారి… సంగ్మా తనకు సొంతంగానే మెజారిటీ వస్తుందని ఆశపడ్డాడు… తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యలో సీట్లు రావు గానీ కింగ్ మేకర్ కావాలని బీజేపీ ఆశపడింది… ఎస్, సంగ్మా 26 సీట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయాడు…
వెంటనే అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ గుర్తొచ్చాడు… అమిత్ షా గుర్తొచ్చాడు… ఇద్దరికీ ఫోన్లు చేశాడు… ఇక మీరే చక్రం తిప్పాలని కోరాడు… ఇద్దరూ అభయహస్తం ఇచ్చి, నువ్వే సీఎం, మిగతాది మాకు వదిలెయ్, మళ్లీ మనం కలిసి పరిపాలిస్తున్నాం అన్నారు… వెంటనే సంగ్మా గవర్నర్‌ను కలిసి మెజారిటీ చూపించాడు… మళ్లీ ప్రమాణం చేయబోతున్నాడు…
సంగ్మాకు వచ్చిన 26కు బీజేపీ రెండు యాడ్ అవుతున్నా, ఇంకా మెజారిటీ ఫిగర్‌కు తక్కువే… అందుకని అమిత్ షా ఫోన్లు చేసి, చక్రం తిప్పి, HSPDP, PDF పార్టీల మద్దతు కూడా అప్పటికప్పుడు సంపాదించేశాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతోంది… ఈ మొత్తం వ్యవహారంలో రాబిన్ శర్మ సాధించిన ఘనత ఏమున్నట్టు..? ఇదే కూటమి గత ఎన్నికల్లోనూ గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇప్పుడు పోస్ట్ పోల్ అలయెన్స్… అంతే తేడా… అయితే రాబిన్ శర్మ పనిమంతుడు కాదు అనడం లేదు… కాకపోతే మేఘాలయలో గెలుపును పక్కాగా ఓన్ చేసుకునేంత ఏమీ లేదు..!!
Share this Article