తమిళనాడుకు నీళ్లు కావాలి… కావేరి జోలికి పోతే కన్నడిగులు తంతారు… ఇక మిగిలింది తెలుగువాళ్ల నీళ్లు… అప్పట్లో ఎన్టీయార్‌ను పట్టుకుని చెన్నైకి తాగునీళ్లు పేరిట ఓ కాలువ తవ్వించుకున్నారు… కాస్త అవసరం తీరింది… ఇంకా కావాలి… తెలుగువాళ్లను పిచ్చోళ్లను చేయడమే వీజీ… అందుకని నదుల అనుసంధానం అనే ప్లాన్‌కు తెగబడ్డారు…
కేంద్రంలో ఎక్కువ బ్యూరోక్రాట్లు వాళ్లే… సాగునీటి శాఖలోనూ వాళ్లే… గోదావరిలో మస్తు నీళ్లున్నాయి కదా, వాటిని తరలించుకుపోదామని ప్లాన్ వేశారు… అందుకని గోదావరి టు పెన్నా నక్షా గీశారు… ఫ్లడ్ కంట్రోల్, వాటర్ ఎఫిసియంట్ యూజ్ వంటి తోకలన్నీ తగిలించి, కేంద్రం డబ్బులతోనే ఆ ప్రాజెక్టు కట్టించాలని ఎత్తుగడ వేశారు…
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది… అనుసంధానం చేద్దాం కానీ ముందుగా మహానది నీళ్లను గోదావరిలో కలపండి, గోదావరిలో మిగులు జలాలు, వరద జలాలు ఎక్కువగా ఉన్న చోట నుంచి నీళ్లు తీసుకుని వెళ్లి పెన్నాకు కలపండి అని..! అప్పటి ఆ ప్రభుత్వంలో కేసీయార్ కూడా ఉన్నాడు… జగన్ అప్పటికి చదువుకుంటున్నాడు…
Ads
కేంద్రంలో యూపీఏ ఉండనివ్వండి, బీజేపీ ఉండనివ్వండి… ఈ సంధాన వ్యూహాల గురించి కుర్చీలో ఉన్నవాళ్లకు అర్థం కాదు… వాళ్ల ప్రయారిటీలు వేరు… బీజేపీలో ఉన్న తృతీయ శ్రేణి లీడర్లను కూడా ఈ వ్యూహంలో కలుపుకుని వెళ్తారు తమిళ మేధావులు… దేశంలో ఎక్కడా ఈ నదుల అనుసంధానం మీద యాక్టివిటీ ఉండదు… కేవలం గోదావరి టు పెన్నా…
వైఎస్ ఉన్నప్పుడు పోలవరం నుంచి కృష్ణాకు, అక్కడి నుంచి పెన్నాకు నీళ్లను తరలిద్దాం అనేది ప్లాన్… అందులో నష్టం లేదు… పోలవరం పాయింటులోనే నీటిలభ్యత ఎక్కువ… అంతేతప్ప తెలంగాణలో దేవాదుల పాయింట్‌కు ఎగువన పెద్దగా నీటిలభ్యత లేదు… అందుకే కదా ప్రాణహితను కూడా కలిపి, కాలేశ్వరం పేరిట నానా కథలు పడ్డది… కేంద్రమేమో ఇచ్చంపల్లి దగ్గర అడ్డంగా కట్ట కట్టేసి, నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించేద్దాం అంటోంది…
మళ్లీ మీటింగులు పెడుతున్నారు… దూకుడు పెరిగింది… కేసీయార్ ప్రభుత్వం అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది గానీ ఏపీ ప్రభుత్వానికే ఏ సోయీ లేదు… అసలు ఏపీ సర్కారులో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేవాళ్లు ఏరి..? ఐనా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయే ధైర్యం ఏది..? పేరుకు పెన్నా- కావేరి కలుపుతాం, బెడ్తి-వార్దా కలుపుతాం అని ఏవేవో చెబుతుంది ఎన్‌డబ్ల్యూడీఏ… కానీ ఫస్ట్ ప్రయారిటీ గోదావరి నుంచి నీళ్లు ఎత్తుకుపోవడమే…
ఎల్లుండి దీనిపై హైదరాబాదులో మీటింగు పెట్టారు… మహానది టు గోదావరి మాట్లాడరు… నిధులెలాగో చెప్పరు… పోనీ, 39 వేల కోట్లను కేంద్రమే భరిస్తుందీ అనుకుందాం… కాలేశ్వరానికి లక్షన్నర కోట్లు పెట్టాడు కేసీయార్… మరి గోదావరి టు కృష్ణా, కృష్ణా టు పెన్నా, పెన్నా టు కావేరి ప్లాన్లు కలిపి 39 వేల కోట్లు చాలట… అసాధ్యం… పైగా లిఫ్టులు కావాలి, ఆ ఖర్చు ఎవరు, నిర్వహణ వ్యయాలు, ఏటా కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలి..? అన్నింటికీ మించి చత్తీస్‌గఢ్‌ను ఈ ప్రాజెక్టు చర్చల నుంచే దూరం ఉంచారు… అదేమంటే ఇంకేదో సాకు, ఏదో ఉపనదిని గోదావరికి కలుపుతాంలే అని మాట్లాడుతున్నారు… అన్నీ నెత్తిమాసిన లెక్కలే… నువ్వు వాడుకోవడం లేదు కదా, నీ వాటా 147 టీఎంసీలను తీసుకుపోతాం అంటోంది కేంద్రం…
గోదావరి బేసిన్‌లో అది లేదా..? దానికి ముంపు సమస్య లేదా..? మునిగితే మునగనీ అనే ధోరణి… ఆ ప్రభుత్వమూ మాట్లాడదు… పోలవరం కట్టే దిక్కులేదు గానీ నదులను అనుసంధానిస్తారట… పోలవరం పూర్తి చేయండి, కృష్ణాకు ఆల్‌రెడీ కలిపేశారు… అక్కడి నుంచి పెన్నాకు కలపండి… చేతనైతే అక్కడి నుంచి తమిళనాడుకు నీళ్లివ్వండి… పోలవరం పాయింట్‌లో నీళ్లు కూడా సరిపడా ఉన్నాయి… నిజానికి వైఎస్ ఉన్నప్పుడు దుమ్ముగూడెం నుంచి కృష్ణాకు నీళ్ల తరలింపు అనే ప్లాన్ వేశాడు… దాని వెనుక సీమ ప్రయోజనాలున్నయ్… కేసీయార్ రాగానే ఆ ప్రాజెక్టును రద్దు చేసిపారేశాడు…
గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు, సాగర్ ఆయకట్టుకు నీళ్లిచ్చేస్తే… శ్రీశైలంపై ఒత్తిడి తగ్గుతుంది, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు పుష్కలంగా నీళ్లను తీసుకుపోవాలని వైఎస్ సంకల్పం… శ్రీశైలంలోకి నీళ్లు రాకుండా కర్నాటక ఎగువన ఆలమట్టి ఎత్తు పెంచుతోంది… లిఫ్టులు కడుతోంది… తుంగభద్రకు ఎగువన కూడా అప్పర్ భద్ర కడుతోంది… ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా కేంద్రం, అనగా బీజేపీ ప్రభుత్వం ఓ దిక్కుమాలిన వ్యూహంతో కదులుతోంది… ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ప్రతినిధులు ఒక్కరూ మాట్లాడరు… అది మన దౌర్భాగ్యం… కొంతలోకొంత తెలంగాణ ప్రభుత్వమే మేలు… అధికారికంగా ఈ నదుల అనుసంధానంలోని మర్మాన్ని తెలుసుకుని వ్యతిరేకిస్తోంది… చత్తీస్‌గఢ్ తరఫున కూడా తనే మాట్లాడుతోంది, ఏ సోయీ లేనిది ఏపీ ప్రభుత్వానికి…!!
Share this Article