Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బలగం వేణన్నా… వర్స తప్పినవ్… మేనత్త బిడ్డను చేసుకునుడు గలత్ వర్స…

March 4, 2023 by M S R

నాకూ అట్లనే అనిపించింది… తెలంగాణలో అసలు మేనత్త బిడ్డల్ని ఆడబిడ్డల్లెక్క చూస్తం కదా… అవకాశం వచ్చినప్పుడు కట్నం పెట్టి కాళ్లు మొక్కుతం కదా… మరి బలగం సినిమాలో ఆ దర్శకుడు వేణు గట్లెట్ల గలత్ వర్స కలిపిండు అనిపించింది… నిజానికి బలగం సినిమాలో ఆట, పాట, కట్టుబాటు, కల్చర్, చావు, దావత్ అన్నీ తెలంగాణతనాన్ని నింపుకున్నవే… అచ్చమైన తెలంగాణ సినిమా ఇది… అందరూ చూడదగిన ఓ ఎమోషనల్ మూవీ… దరిద్రపు కమర్షియల్ మాస్ మసాలా కాదు…

సరే, గీ మేనత్త బిడ్డల సంగతికొస్తే… మిత్రుడు Ambatla Ravi… తోపాటు చాలామంది ఫేస్‌బుక్ మిత్రులు కూడా ఇలాగే షేర్ చేసుకుంటున్నారు… మేనరికాల్లోనూ తేడాలు ఉంటయ్… మేనమామ బిడ్డను చేసుకోవచ్చు, మేనత్త బిడ్డను చేసుకోవద్దు… అది గలత్ వర్స అయితది… ఆంధ్రాలో మేనమామ (అమ్మ సోదరుడిని)ను చేసుకుంటరు, కానీ తెలంగాణలో అది కుదరదు… ఎక్కడి వొంతెన (సంప్రదాయం) అక్కడిదే… బలగం సినిమాలో ముచ్చటను మీరూ చదవండి ఓసారి… (ఈ వర్స సంగతి ఉన్నదే షేర్ చేస్తున్నా, సినిమా సమీక్షను మినహాయించి… )



ఇంత పెద్ద బలం, బలగం ఉన్న సినిమాలో, అదీ తెలంగాణ సినిమాలో, తెలంగాణ వాళ్లే చేసిన సినిమాలో తెలంగాణ ‘వర్స’ మిస్సయినట్లనిపించిది! ఆ వర్స ఏంది?!

Ads

కథలోకి వెళ్తే.. కొమురయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక ఆడబిడ్డ. తొల్సూరు కొడుకు ఐలయ్య, చిన్న కొడుకు మొగులయ్య, బిడ్డె లక్ష్మి. ఐలయ్యకు ఒక్కగానొక్క కొడుకు సాయిలు (ప్రియదర్శి), మొగులయ్యకు ఇద్దరు ఆడబిడ్డలు, లక్ష్మికి ఒక్కగానొక్క కూతురు సంధ్య (కావ్య). సంధ్య కడుపులో ఉన్నప్పుడు లక్ష్మీ తన భర్త నారాయణతో కలిసి తల్లిగారింటికి వస్తది. అప్పుడు సాయిలుకు మూడు నాలుగేండ్లు ఉంటయనుకుంట. మేనత్తకు ఎదురుంగపోయి.. ఆమె కడుపు మీద ముద్దుపెడ్తడు. దాన్ని చూసి.. నారాయణ (మేనత్త లక్ష్మి భర్త) ‘‘నాకు ఆడబిడ్డ పుడ్తెగిన్క సాయిగాడికే ఇస్త” అంటడు. ఆ మాటకు పెద్దమనిషి కొమురయ్యతోపాటు అంతా ఖుషీ అయితరు. ఉప్పొంగిపోతరు.

అదే రాత్రి.. అత్తగారింట్ల తనకు మర్యాద దక్కలేదని నారాయణ అలుగుడు, ఆయనను ఐలయ్య, మొగులయ్య నల్లిబొక్క కోసం ఆటపట్టించుడుతోటి లొల్లి షురూ ఐతది. గూసులాడుకుంటరు. గల్లలు పట్టుకుంటరు. కొమురయ్య సముదాయించినా ఫాయిదా ఉండదు. ‘సస్తే గనీ నీ గడ్పల అడుగు పెట్ట మామ’ అని శపథం చేసి నారాయణ తన భార్యను తీస్కొని వెళ్లిపోతడు.

మళ్లా 20 ఏండ్లకు భార్య లక్ష్మి, బిడ్డ సంధ్యను దీస్కొని అత్తగారింటికి నారాయణ వస్తడు. అదీ కొమురయ్య సచ్చిపోయిండని తెల్సీ. సావు కోసం వస్తరు. సంధ్య తన అమ్మమ్మవాళ్ల ఇంటికి రావడం తాను పుట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి. తాత సచ్చుడేందో, తన పూలుపండ్లు (వరపూజ) ఆగిపోవుడేందోనని సాయిలు ఆగమాగమైతడు. వరపూజ జరిగితే కట్నం కింద ముందుగాళ్ల పది లక్షలు వస్తయని, ఆ వెంటనే వాటితోటి అప్పు తీర్చొచ్చన్నది సాయిలు ఆలోచన. సావు వాకిట్ల జరిగిన లొల్లితోటి వరపూజనే కాదు, ఆ లగ్గం కూడా క్యాన్సిల్​ ఐతది. అప్పెట్ల తీర్చాలన్న టైమ్​లో సాయిలుకు.. తన మేనత్త లక్ష్మి బిడ్డ సంధ్య మీద మనసు పడ్తది. సంధ్యను జేస్కుంటే అత్తగారి యావదాస్తి తనకే వస్తదని, అప్పులు తీర్చొచ్చని లైనేస్తడు.. లవ్​ ట్రాక్ వేస్తడు.. ‘పొట్టిపిల్లా.. పొట్టి పిల్లా’ అని పాట కూడా అందుకుంటడు.

రెండో రోజు కొమురయ్య సావు అయిపోతది.. కానీ, మూడోరోజు పిట్టకేస్తె కాకి ముట్టదు, ఐదో రోజు పిట్టకేస్తె కూడా కాకిముట్టదు. ఎంత బతిమాలినా, ఎన్ని మొక్కులు, ఎంత మంది మొక్కినా కాకి అట్లచ్చి అటు నుంచే అటే ఎన్కకు పోతది. ఎట్లయినా సరే 11వ రోజు ముట్టుకోవాల్సిందే. ‘‘11వ రోజు కాకి ముట్టుకోకుంటే మీతో ఊరోల్లు ఎవరూ మాట్లాడరు.. మిమ్మల్ని వెలివేస్తున్నట్లే. కొమురయ్యకు తీరని కోరిక ఏదో ఉన్నది. అందుకే పిట్ట ముడ్తలేదు’’ అని గ్రామపెద్దలు చెప్తరు. కొమురయ్య కోరికల్లో.. ఒకటి: 20 ఏండ్లు దూరం దూరం ఉన్న తన బిడ్డ, కొడుకులు మళ్లా కలిసి ఉండటం.. రెండోది: తన కొడుకు కొడుకు (సాయిలు)కు తన బిడ్డ బిడ్డ (సంధ్య)ను ఇచ్చి లగ్గం జేయడం. పదకొండో రోజు అందరూ కలిసిపోతరు.. సాయిలు, సంధ్య లగ్గంకు కూడా ఒప్పుకుంటరు.. పిండాన్ని కాకి ముడ్తది. సినిమా ఐపోతది. కథ నడిచిన తీరు మంచిగనిపించింది. ముఖ్యంగా కొమురయ్య చెల్లెలి పాత్ర ‘అన్నాచెల్లెల్ల’ బంధాన్ని చెప్తూ ఏడ్పించేసింది. గోషి చీరలో ఆమెను చూస్తుంటే, ఆమె మాటలు వింటుంటే మా పెద్దక్క (నాన్నకు పెద్దక్క), సిన్నక్క (నాన్నకు సిన్నక్క) యాదికొచ్చింది.

ఇగ విషయానికి వద్దాం…!!

తెలంగాణలో మేనత్త (నాన్న అక్క/చెల్లె)కు ప్రత్యేక స్థానం ఉంది. మేనత్త అంటే మన ఇంటి ఆడబిడ్డ. ఆమెకు, ఆమెను ఏ ఇంటికైతే కోడలిగా పంపుతామో ఆ ఇంటివాళ్ల (చిన్నపిల్లలైనా సరే)కు మనం కాళ్లు మొక్కడం తెలంగాణ అంచాన (అంచనా కాదు.. సంప్రదాయం/పద్ధతి)గా వస్తున్నది. ఆడబిడ్డ అత్తగారు ఎప్పుడూ మనకంటే పెద్దోళ్లే అని ఆ ఆడబిడ్డ పుట్టింటివాళ్లు భావిస్తుంటరు. ఆడబిడ్డ అత్తగారి ఇంట్లోని చిన్నపోరగాళ్లను కూడా ‘అరేయ్​ తరుయ్’​ అని ఇక్కడోళ్లు పిల్వరు. మర్యాదగా మాట్లాడుతరు. మస్తు అర్సుకుంటరు. మేనత్త కొడుకుకు మన ఇంటి నుంచి ఆడబిడ్డను ఇచ్చుడు తప్పితే మేనత్త కూతురును మన ఇంటి కొడుకుకు చేసుకోవడం దాదాపు తెలంగాణలో ఏ పల్లెలో లేదు. మేనత్తకు పుట్టిన ఆడబిడ్డలుంటే మన ఇంటి ఆడబిడ్డల (అక్కా చెల్లెళ్ల) లెక్కనే చూస్కుంటం. వదిన అనో, మర్దలనో కూడా పిలువం. మా నిజామాబాద్​లో అయితే.. ఇట్లనే ఉంటది. అన్న కొడుకుకు, చెల్లెలి కూతురును ఇచ్చి లగ్గం జేయడం అనే వర్స ఉండదు. దాదాపు తెలంగాణ అంతటా ఇట్లనే ఉంటదనుకుంట!!

అసుంటిది.. తెలంగాణ సినిమా, తెలంగాణ ఆత్మగల్ల సినిమా, తెలంగాణ బలగమంతా చేసిన సినిమాలో మేనత్త బిడ్డను ఆ మేనత్త అన్న కొడుకుకు ఇచ్చి లగ్గం జేయాలనుకోవడం.. పెద్ద మనిషి కొమురయ్య కోరిక కూడా అదే కావడం మంచిగనిపియ్యలే!! మంచి బలగంలో ఈ వర్స నాకు నచ్చలేదు. సినిమా చూసినంక సిరిసిల్ల, కరీంనగర్​ దోస్తులకు కూడా ఫోన్​ చేసిన. మా సుట్టుపక్కల కిరాణా దుకాణం నడుపుకొనే నల్గొండ వాళ్లను అడిగిన.. రోడ్డు మీద చాయ్​ బండి నడిపే గజ్వేల్​ అవ్వనడిగిన.. ‘‘మీ దగ్గర మేనత్త బిడ్డను లగ్గం జేస్కుంటరా?’’ అని. ‘‘ఆళ్లు పెద్దోళ్లాయె.. మనం ఆళ్ల కాళ్లు మొక్కెటోళ్లమే. ఆళ్ల పిల్లని జేస్కుంటమా? మన పిల్లనే ఇస్తం.. అదీ వర్స’’ అన్నరు. మరీ తెలంగాణ బలగమంతా కలిసి తీసిన తెలంగాణ ‘బలగం’లో ఆ తెలంగాణ వర్స మిస్సవ్వడం ఏందో?!

దిల్​ రాజు బ్యానర్​లోనే ఆ మధ్య వచ్చిన ‘శతమానం భవతి’ సినిమాలో కూడా మేనత్త బిడ్డకు ఆ మేనత్త అన్న కొడుకుకు కలపడం, పెండ్లి జేయడం ఉంటది. అది ఆంధ్రా నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి, ఆంధ్రా పల్లెల్లో తీసిన సినిమా కాబట్టి అక్కడి సంప్రదాయం పాటించారు ఓకే.. తప్పులేదు. కానీ, అదే బ్యానర్​లో వచ్చిన తెలంగాణ కల్చర్​ మొత్తం ఉన్న ‘బలగం’లో కూడా మేనత్త బిడ్డను, ఆ మేనత్త అన్న కొడుకును కలపడం మంచిగనిపించలే. తెలంగాణలో కూడా అక్కడక్కడ చెల్లె బిడ్డను అన్న కొడుక్కు ఇచ్చి పెండ్లి చేసే వర్స ఉండొచ్చేమో కాదనలేం. కానీ, ఫక్తు తెలంగాణ సినిమాలో దాదాపు తెలంగాణలో ఎక్కువ మంది పాటించే వర్సను తప్పితే ఎట్ల?!

నోట్​: నాకు నచ్చిన సినిమా కాబట్టి.. తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి.. తెలంగాణ వాడిని కాబట్టి.. ఇంతగనం రాయాల్సి వచ్చింది. కుదిరితే మళ్లోనాలుగైదు సార్లు ‘బలగం’ చూస్త.. అంత మంచిగుంది సినిమా!! ఈ ‘వర్స’ పక్కనవెడితే.. ఇంటిల్లిపాది వెళ్లి ‘బలగం’ చూసిరండ్రి. ఊరికి పోయి.. అందరితో ముచ్చటించినట్లుంటది. పిల్లాజెల్లా అంతా కాయూష్​ జేస్తరు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions