పార్ధసారధి పోట్లూరి …….. జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తార స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు ! ఇంతకుముందు రోజుకి మూడు సార్లు భోజనం పెట్టేవాళ్ళు. రోజురోజుకి దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు ఆర్మీ మెస్ లలో !
భారత సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్న సైనికులకయితే వేళకి ఆహారం సప్లై చేయలేకపోతున్నది ప్రభుత్వం ! సరిహద్దుల దగ్గర ఉండే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి వాహనాలలో రోజూ ఆహారాన్ని సప్లై చేస్తారు కానీ తీవ్రమయిన గోధుమల కొరతతో బారక్స్ లలో ఉండే సైనికులకి రోజుకి రెండు సార్లు అదీ 4 రొట్టెల చొప్పున మాత్రమే ఆహారం ఇస్తున్నారు మెస్ నిర్వాహకులు ! గోధుమ పిండి మీద రేషన్ విధించడం వలన ఇంతకుముందులాగా ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు ఇవ్వలేమని సైనిక అధికారులు చెప్తున్నారు ! ఇక సరిహద్దుల దగ్గరికి సప్లై చేయాలంటే వాహనాలకి డీజిల్ మీద రేషన్ విధించడంతో రోజుకి రెండు సార్లు మాత్రమే వాహనాలు వెళ్ళి వస్తున్నాయి.
************************
Ads
పాకిస్థాన్ విదేశీ అప్పులు 130 బిలియన్ డాలర్లకి చేరుకుంది. ఇది ఆ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో [GDP] 95.39% గా ఉంది. ఇక ద్రవ్యోల్బణం అయితే 27.6% శాతంగా ఉంది. ఇది గత 48 ఏళ్ల లోనే గరిష్ట స్థాయి. అదే ఆహార ద్రవ్యోల్బణం అయితే 42.9% శాతంగా ఉంది. ఇది గత సంవత్సరానికి ఇదే సమయంతో పోలిస్తే 4 రెట్లు అయ్యింది. 2022 లో ఆహార ద్రవ్యోల్బణం 12.8% గా ఉంది ఇదే సమయానికి!
**********************
గత సంవత్సరం నుండి ప్రజలకి చేసే సప్లైస్ మీద కోత పెట్టి దానిని ఆర్మీ కి తరలిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రజలతో పాటు ఆర్మీకి కూడా ఆహార కొరత ఏర్పడింది ! తాము అర్ధాకలితో దేశ రక్షణ విధులు నిర్వహించలేమని, కాబట్టి రోజుకి మూడు సార్లు భోజనం పెట్టమని కొరుతూ సైనికులు తమ అధికారులకి వినతి పత్రాలు ఇస్తున్నారు. విషయం శృతి మించుతున్నది అని తెలుసుకొని అధికారులు పై స్థాయి జనరల్స్ దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఇది ఆర్మీ నిబంధనలకి విరుద్ధం! ఏ దేశ ఆర్మీలో అయినా క్రమశిక్షణకి మొదటి స్థానం ఉంటుంది. పై అధికారుల ఆజ్ఞలని మారు మాట్లాడకుండా పాటించాల్సిందే !
అయితే ఈ వార్త ఇప్పుడే బయటపడ్డా నిజానికి గత నెల రోజులుగా సైనికులకి రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం ఇవ్వాలనే ఆదేశాలు వెళ్ళాయి పై నుండి ! నెల రోజుల నుండి అర్ధాకలితో ఉంటున్న సైనికులు ఎదురు మాట్లాడితే సైనిక కోర్టులో శిక్షలు పడతాయని తెలిసీ వినతి పత్రం ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతున్నది !
******************
పాకిస్థాన్ సైన్యంలో డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ [DGMO] హెడ్ క్వార్టర్స్ లోని అధికారులు సరిహద్దుల దగ్గరకి ఆహార, మందుల సప్లై తగ్గిపోతున్నదని, దీని వలన సరిహద్దుల దగ్గర విధులు నిర్వహించే సైనికుల సామర్ధ్యం తగ్గిపోతున్నదని ఒక రిపోర్ట్ తయారు చేసి పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడికి పంపించింది ! నిజానికి DGMO కి ఇలాంటి రిపోర్ట్ పంపించే అధికారం లేదు కానీ తప్పనిసరి పరిస్థితిలో రిపోర్ట్ పంపించింది ఎలాగయినా సైనికులకి ఆహారం, మందుల సరఫరా ఆగకుండా చూడాలని!
పాకిస్థాన్ దేశ మొత్తం బడ్జెట్ లో 16% సైన్యానికే కేటాయించారు. గత సంవత్సరం కంటే ఇది 4% ఎక్కువ… కానీ కేటాయింపులు అయితే జరిగాయి కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం నూటికి నూరు శాతం సఫలం కాలేకపోవడంతో ప్రజలతో పాటు సైన్యానికి కూడా ఆర్ధిక మాంద్యం సెగ తగులుతున్నది!
కనీసం పారాసిట్మాల్ లాంటి మందులు కూడా దొరకడం లేదు పాకిస్థాన్ లో! విచిత్రం ఏమిటంటే భారత్ లో తయారయిన మందులకే పాకిస్థాన్ లో డిమాండ్ ఉంది… అదే చైనా మందులని వాళ్ళు నమ్మడం లేదు. దీనిని ఆసరా చేసుకొని స్మగ్లర్లు భారత్ మందులని అక్రమంగా సరిహద్దులు దాటించి, వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు పాకిస్థాన్ లో. ఇక సైన్యానికి కూడా మందుల కొరత సెగ తగలడంతో మిలటరీ హాస్పిటల్స్ లో ఉండే ఫార్మసీలలో మందుల మీద కూడా రేషన్ విధిస్తున్నట్లు తెలుస్తున్నది!
********************
ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] ఇప్పటికే ఖరారు అయిన బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ పాకేజీ ని విడుదల చేయడంలో వ్యూహాత్మక జాప్యం చేస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలని ఇంకా పెంచాలని సూచిస్తున్నది. అలాగే పాకిస్థాన్ ప్రజలకి ఇస్తున్న సబ్సిడీలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని, వాటిని పూర్తిగా ఎత్తివేయమని డిమాండ్ చేస్తున్నది IMF. ఇక వారం క్రితమే IMF డిమాండ్ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలని మరో 15% పెంచింది ప్రభుత్వం. అయితే అది చాలదని మరో 15% పెంచమని డిమాండ్ చేస్తున్నది IMF…
******************
మొదటి సరిగా IMF పాక్ సైన్యాన్ని టార్గెట్ చేసింది ! ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థిని మెరుగుపరుచుకోవాలి అంటే తమ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని తప్పకుండా పాటించాలి అని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది IMF…
1. ముందు పాకిస్థాన్ సైన్యాధికారులకి ఇస్తున్న సౌకర్యాల మీద కోత విధించాలి.
2. ఇక నుండి పాకిస్థాన్ ఎలాంటి ఆయుధాలు కానీ, ఇతర మిలటరీకి సంబంధించినవి ఎలాంటి వస్తువులని కొనడానికి వీలు లేదు.
3. పాకిస్థాన్ సైన్యానికి సంబంధించిన అన్ని ఎస్టాబ్లిష్మెంట్ల మీద ఇస్తున్న పన్ను మినహాయింపులని తొలగించి, వెంటనే వాటి మీద ప్రజల మీద విధిస్తున్న పన్నుల కంటే ఎక్కువగా పన్నులు విధించాలి.
4. పాకిస్థాన్ మార్కెట్లని అంతర్జాతీయ సంస్థలకి అనువుగా విధివిధానాలని కొత్తగా రూపొందించాలి ! అంటే అంతర్జాతీయ మార్కెట్ల కోసం పన్ను రాయితీలతో పాటు భూమి కేటాయింపుల విషయంలో ఉదారంగా ఉండాలి అన్నమాట!
అయితే IMF విధిస్తున్న ఇలాంటి షరతులకి పాక్ ప్రభుత్వం ఒప్పుకున్నా ఆర్మీ జనరల్స్ ఒప్పుకోరు ! ఎందుకని ? పాకిస్థాన్ లోని ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కి చెందిన అన్ని విభాగాలకి వ్యాపారాలు ఉన్నాయి అక్కడ ! రియల్ ఎస్టేట్, పాలు, పాల ఉత్పత్తులు, సూపర్ మార్కెట్లు, సిమెంట్ మరియు హార్డ్వేర్ షాపులు.., ఇలా ప్రతి రంగంలోనూ సైన్యానికి సంబంధించినవి ఉన్నాయ్. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో సింహా భాగం ఆర్మీ అధికారుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. పదీపరకా ఇతర చిన్న చిన్న అధికారులకి వెళుతుంది కానీ దిగువ స్థాయిలో పనిచేసే సైనికులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు.
****************************
ఇటీవలే పాకిస్థాన్ సైన్యం ఒక ప్రతిపాదన చేసింది అక్కడి పౌర ప్రభుత్వానికి ! అదేమిటంటే మన దేశ డాలర్ రిజర్వ్ పెరగాలి అంటే దానికోసం పేద ప్రజలకి ఇచ్చిన ఉచిత భూములని స్వాధీనం చేసుకొని, వాటిలో అధునాతన సౌకర్యాలతో మాన్షన్ తరహా మరియు విల్లా టైపు నిర్మాణాలు చేసి, అంతర్జాతీయంగా అమ్మకాలకి పెడితే, వాటిని గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల వాళ్ళు ఎగబడి కొంటారు… తద్వారా మనకి డాలర్ రూపంలో ఆదాయం వస్తుంది అని! అవునా ? నిజమా ? ఇతర దేశాల వాళ్ళు పాకిస్థాన్ లో విల్లాలు, మాన్షన్స్ కొంటారా ? కానీ పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం ఇచ్చిన సలహాని పాటించి పేద ప్రజలకి ఇచ్చిన కొన్ని భూములని లాక్కొని వాటిని సైన్యానికి అప్పచెప్పింది ! ఇదిగో ఇలాంటి వాటిని చూపిస్తూ IMF షరతులు విధించడం సబబే!
Share this Article